అగర్తలా : తన భర్త గురించి కొంతమంది వ్యక్తులు పనిగట్టికుని మరీ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని త్రిపుర సీఎం బిప్లవ్ దేవ్ భార్య నితి దేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిప్లవ్ దేవ్ తన భార్యను వేధింపులకు గురిచేస్తూ, గృహహింసకు పాల్పడ్డారని.. ఈ క్రమంలో నితి ఆయనకు విడాకులు ఇవ్వనున్నారంటూ కొన్ని మీడియా ఛానెల్లలో ప్రచారమైన సంగతి తెలిసిందే. ఈ విషయాల గురించి నితి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అవన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు.
ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఆమె సుదీర్ఘ పోస్టు పెట్టారు. ‘ పుకార్లకు నోరు ఉండదు కదా. నీచమైన బుద్ధి కలిగిన, అనారోగ్యంతో బాధ పడుతున్న కొంతమంది వ్యక్తులు ఛీప్ పబ్లిసిటీ కోసం ఇలాంటివి ప్రచారం చేస్తారు. నా భర్తను చెడుగా చూపించి రాజకీయంగా లబ్ది పొందాలని భావించిన వాళ్లే డబ్బులు చెల్లించి మరీ ఇలా దుష్ప్రచారం చేయిస్తున్నారు. ఒకరి భార్య, మరొకరి వదినగా, కూతురిగా, కోడలిగా ఎన్నో బాధ్యతలు నెరవేరుస్తున్నా. మన రాష్ట్ర ప్రజలకు నిజంగా నాపై ప్రేమానురాగాలు ఉంటే, నన్ను పూర్తిగా విశ్వసించినట్లైతే అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిని బాయ్‌కాట్ చేయండి. నా భర్త పట్ల నాకు అనిర్వచనీయమైన ప్రేమ ఉంది. ఎవరో ఏదో అన్నారని వారికి సమాధానం చెప్పాల్సిన పని లేదు’ నితి దేవ్ పేర్కొన్నట్లు ఓ జాతీయ మీడియా వెల్లడించింది. కాగా దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బీజేపీ గతేడాది త్రిపురలో అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యువ నాయకుడు బిప్లవ్ దేవ్‌ను.. కమలనాథుల ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు.
ఇక పదవి చేపట్టిన నాటి నుంచి బిప్లవ్ కుమార్ అనేకమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. మహాభారత కాలంలో శాటిలైట్ కమ్యూనికేషన్ ఉందంటూ మొదలైన ఆయన వ్యవహారం.. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీని మతి చెడిందంటూ ఎద్దేవా చేయడం... మాజీ మిస్ వరల్డ్ డయానా హెడెన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు... సివిల్ సర్వీసెస్‌కు సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్లే సరితూగుతారని, మెకానికల్ వాళ్లు పనికి రారని ప్రకటన... చివరకు.. చదువుకోవటం కన్నా పాన్ షాపులు పెట్టుకోవటం. ఆవులు మేపుకోవటం ఉత్తమం అంటూ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించటం, ఇలా వరుసగా తన వ్యవహార శైలితో ఆయన మీడియాలో దర్శనమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment