అగర్తలా: త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేబ్‌పై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో ఆయన త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి వాకింగ్‌కు వెళ్లినప్పడు ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఆయనని ఢీకొట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. కాస్త ఆలస్యంగా ఆ ఘటన వివరాలను పోలీసులు శనివారం వెల్లడించారు. హత్యాయత్నానికి ప్రయత్నించిన ముగ్గురిని అదుపులోనికి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం బిప్లవ్ కుమార్ తన అధికారిక నివాసమైన శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ లేన్‌కి సమీపంలో గురువారం ఈవెనింగ్ వాక్‌కి వెళ్లారు.
ఆయన చుట్టూ భద్రతా వలయం ఉన్నప్పటికీ వారి మీదుగా హఠాత్తుగా ఒక కారు దూసుకువచ్చింది. కారు రావడాన్ని గమనించిన బిప్లవ్ పక్కకి జరగడంతో పెను ముప్పు తప్పింది. అయితే ఆయన భద్రతా సిబ్బందిలో ఒకరికి గాయాలయ్యాయి. ఆ కారుని పట్టుకోవడానికి సీఎం భద్రతా సిబ్బంది విఫలయత్నం చేశారు. ఆ తర్వాత పోలీసులు గురువారం అర్ధరాత్రి కారుని, అందులో ఉన్న ముగ్గుర్ని అదుపులోనికి తీసుకున్నారు. వారి వయసు సుమారుగా 20 ఏళ్లు ఉంటుంది. వారు ఎందుకు ఈ హత్యాయత్నానికి పాల్పడ్డారో కారణాలు ఇంకా తెలియలేదు. కోర్టు ఎదుట వారిని హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.
Comments
Please login to add a commentAdd a comment