FAKE Video: Surgical Strike 2 Attack Video Taken From YouTube | సర్జికల్‌ స్ట్రైక్స్‌-2 ఫేక్‌ వీడియో - Sakshi
Sakshi News home page

వైరల్‌ : సర్జికల్‌ స్ట్రైక్స్‌-2 ఫేక్‌ వీడియో

Published Tue, Feb 26 2019 5:31 PM | Last Updated on Tue, Feb 26 2019 6:47 PM

Fake Video Clip Viral On Surgical Strikes 2 As IAF Airstrikes At Jashe Camp - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి ఉన్న జైషే ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటలకు మెరుపుదాడులు చేసింది. 12 మిరాజ్‌-2000 యుద్ధ విమానాలతో బాంబుల వర్షం కురిపించడంతో సుమారు 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. ప్రధాని ఆదేశాల మేరకు జరిగిన ఈ సర్జికల్‌ స్ట్రైక్స్‌-2 ఆపరేషన్‌పై దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌-2 ఎలా జరిగిందో చూద్దామని నెట్టింట తెగ వెదుకుతున్నారు. 

ఇదే సమయంలో బాలాకోట్‌లో జరిగిన సర్జికల్‌ స్ట్రైక్స్‌-2 వీడియో ఇదేనంటూ 20 సెకన్ల నిడివి ఉన్న ఓ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ వీడియోలో ఓ యుద్ధ విమానం ఆకాశంలో నుంచి ఉగ్ర స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. గింగిరాలు తిరుక్కుంటూ వెళ్తున్న బాంబులు ఉగ్రవాదుల గుడారాలను క్షణాల్లో బూడిద చేస్తున్నాయి. ప్రాణ భయంతో పరుగెడుతున్న ఉగ్రవాదులే టార్గెట్‌గా ఈ జెట్‌ ఫైటర్‌ నుంచి బుల్లెట్లు దూసుకెళ్లి వారిని హతమార్చుతున్నాయి. 

బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉన్న ఈ వీడియో చూసి చాలా మంది ఇది సర్జికల్‌ స్ట్రైక్స్‌-2 వీడియోనే అని పప్పులో కాలేశారు. ఎందుకంటే అది ఓ వీడియో గేమ్‌కు సంబంధించిన క్లిప్‌. ఉదాహరణకు ఇటీవల పాపులర్‌ అయిన పబ్‌జీ గేమ్‌ లాంటిదన్న మాట. ఇది తాలిబన్‌ ఉగ్రవాదులను టార్గెట్‌ చేస్తూ 2015లో తయారైన ‘ఆర్మా-2’ అనే వీడియో గేమ్‌ అని బూమ్‌ లైవ్‌ అనే ఫ్యాక్ట్‌ చెకింగ్‌ ఏజన్సీ గుర్తించింది. వీడియోలో కనిపిస్తున్నది అమెరికా యుద్ధవిమానం ‘అపాచీ’ని పోలిన రూపం అని తెలిపింది. 2015 జూలైలో ఈ వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ అయింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement