ప్రముఖ హిప్నాటిస్ట్ అనుమానాస్పద మరణం
న్యూఢిల్లీ: ప్రసిద్ధ పారానార్మల్ పరిశోధకుడు, హిప్నాటిస్ట్ గౌరవ్ తివారీ (32 )అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఢిల్లీలోని తన ఫ్లాట్ లో అనుమానాస్పద పరిస్థితుల్లో గత గురువారం చనిపోయారు. భారత పారానార్మల్ సొసైటీ వ్యవస్థాపక సీఈవో తివారీ ద్వారక ప్రాంతంలో తన ఫ్లాట్ లోని బాత్రూమ్ లో శవమై కనిపించారు.
బాత్రూమ్ నుంచి దబ్ మన్న శబ్దం బిగ్గరగా వినిపించడంతో కుటుంబ సభ్యులు ఎలర్ట్ అయ్యారు. బలవంతంగా తలుపు తెరిచి అపస్మారక స్థితిలో ఉన్న అతణ్ని ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే గౌరవ్ చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. ఈ ఏడాది జనవరిలో వివాహం అయిన గౌరవ్ తల్లిదండ్రులు, భార్యతో కలిసి నివసిస్తున్నారు. అయితే ఆత్మహత్య చేసుకునేంత పెద్ద సమస్యలేవీ లేవని తెలుస్తోంది. ప్రాథమిక పోస్ట్ మార్టం నివేదికలో మెడ చుట్టూ నల్ల లైన్ ఉండడంతో , ఊపిరి ఆడక చనిపోయి వుంటాడని పోలీసులు భావిస్తున్నారు.
మరోవైపు ఒక ప్రతికూల శక్తి తన వైపు లాక్కుంటోందని గౌరవ్ తివారి ఒక నెల క్రితం భార్యతో చెప్పినట్టు తెలుస్తోంది. ఎంత ప్రయత్నించినా... అదుపు చేయడం కష్టంగా ఉందని భార్య దగ్గర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పనిలో ఒత్తిడికారణంగా అలా అలోచిస్తున్నారని తాను పెద్దగా పట్టించుకోలేదని పోలీసులకు తెలిపింది.
పారానార్మల్ (విపరీత మానసిక ప్రవర్తన గల) సమాజం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 2009 లో ఏర్పాటు పారానార్మల్ సొసైటీని స్థాపించి తన సేవలను అందిస్తున్నారు. విపరీత మానసిక ప్రవర్తన గల దాదాపు6000 ప్రదేశాలను సందర్శించి.. దర్యాప్తు చేపట్టారు. ఇంతలో ఆయన మరణం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసుల విచారణ కొనసాగుతోంది.