ప్రధాని కోసం ముస్లిం రైతు త్యాగం!
ఉత్తరప్రదేశ్ లోని ఓ ముస్లిం రైతు మే 26న జరగనున్న ప్రధాని మోదీ ర్యాలీ కోసం పెద్ద త్యాగమే చేశాడు. ర్యాలీకి అడ్డువస్తుందనుకున్న స్థలంలో ఏకంగా తాను వేసుకున్న పంటనే తొలగించి స్థలాన్ని ఖాళీ చేసి నాయకులకు అప్పగించాడు.
సహారన్‌పూర్‌లో జరగనున్న మోదీ బహిరంగ కార్యక్రమ వేదికకు సమీపంలోనే రియాజ్ పొలం ఉంది. దీంతో బీజేపీ నేతలు రియాజ్‌ను ఆశ్రయించారు. నేతలకు అడ్డు చెప్పకపోగా, తాను సాగుచేస్తున్న పంటను స్వయంగా తానే తొలగించి స్థలాన్ని స్వచ్ఛందంగా వారికి అప్పగించాడు. పంటకు నష్టపరిహారం ఇచ్చేందుకు తాము ప్రయత్నించినా తీసుకునేందుకు సదరు రైతు నిరాకరించాడని సహారన్‌పూర్ ఎంపీ రాఘవ్ లఖన్ పాల్ శర్మ తెలిపారు.
ప్రధానమంత్రి కార్యక్రమం కోసం సహారన్‌పూర్‌లోని ఢిల్లీ రోడ్ ప్రాంతంలో 8 ఎకరాల స్థలంలో వేదికను ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే అక్కడకు దగ్గరలో ఉన్న రియాజ్ పొలాన్ని ఖాళీ చేయించాల్సి వచ్చిందని, రియాజ్ ఏమాత్రం అడ్డు చెప్పకుండా ప్రధాని కార్యక్రమం కోసం భూమిని అప్పగించారని ఎంపీ రాఘవ్ శర్మ తెలిపారు.