అవి ప్రభుత్వ హత్యలే
♦ రోహిత్, రైతు ఆత్మహత్యలపై నర్మదా బచావో ఉద్యమకారిణి మేధాపాట్కర్
♦ ఆమెను లోపలికి అనుమతించని హెచ్‌సీయూ సెక్యూరిటీ సిబ్బంది
హైదరాబాద్: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్, రైతు ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలేనని నర్మదా బచావో ఉద్యకారిణి, నేషనల్ అలెయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్‌మెంట్ జాతీయ నాయకురాలు మేధాపాట్కర్ అన్నారు. హెచ్‌సీయూ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు ఆమె ఆదివారంరాత్రి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చారు. లోపలికి వెళ్లకుండా ఆమెను ప్రధాన ద్వారం వద్ద సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. లోపల ఉన్న విద్యార్థులనుద్దేశించి గేటు బయట నుంచే మాట్లాడారు. మోదీ ప్రభుత్వం కుల, మత, జాతి వివక్షలతో విద్యార్థులను రెచ్చగొడుతోందని ఆరోపించారు.
రోహిత్ తల్లి చెప్పిన దాన్నిబట్టి అతడు చాలా ధైర్యవంతుడని, అతనుంటే ఉద్యమానికి నాయకత్వం వహించేవాడని, లేకున్నా ముందుండి నడిపిస్తున్నాడని పేర్కొన్నారు. లోపలికి వెళ్లకుండా తనను అడ్డుకోవడం చూస్తుంటే లోపల ఎలాంటి పరిస్థితులున్నాయో అర్థం అవుతోందన్నారు. బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేధాపాట్కర్ మాట్లాడుతూ విద్యాసంస్థల్లో కులవివక్ష, అసమానతలు కొనసాగుతున్నాయని, అగ్రవర్ణాల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తున్నదని అన్నారు.
రోహిత్ మరణం తర్వాత యూనివర్సిటీల్లో తలెత్తిన పోరాటాలపట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఆమె తప్పుబట్టారు. హెచ్‌సీయూలో జరుగుతున్న పరిణామాలపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం జోక్యం చేసుకొని సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. వీసీ అప్పారావు వద్దంటూ విద్యార్థులు, ప్రొఫెసర్లు ఆందోళన చేపడుతున్నా ఆయన్నే కొనసాగించడం సమంజసం కాదన్నారు. హెచ్‌సీయూ విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ఈ నెల 6న వీసీ అప్పారావుకు వ్యతిరేకంగా, విద్యార్థులకు మద్దతుగా తలపెట్టిన చలోఅసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ‘సాక్షి’తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా రైతుల హక్కులు కాపాడాలని, పర్యావరణ హితంగా, రైతుల ప్రయోజనాలు నెరవేరేలా ముందుకు సాగాలని కోరారు.