
అన్నదాతల ఆక్రందన
దుర్గ్: ఎంతో కష్టపడి పండిన పంటకు కనీస ధర దక్కకపోవడంతో అన్నదాత కడుపు మండింది. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కకపోవడంతో కర్షకులు కన్నెర్ర చేశారు. పెట్టుబడి సంగతి అలా ఉంచితే కనీస ధర కూడా రాకపోవడంతో ఛత్తీస్ గడ్ లోని టమాట పడించిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కిలో టమాట ధర రూపాయికి పడిపోవడంతో అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏడు లారీల టమాటాలను రోడ్డుపై పడేసి తమ ఆవేదన తెలిపారు. ధంధా ప్రాంతంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. అన్నదాతల ఆవేదనను ఎవరూ పట్టించుకోకపోవడం శోచనీయం.
ఇటీవల కాలంలో టమాట ధరలు గణనీయంగా పడిపోయాయి. నిల్వచేసుకునే సౌకర్యం లేక అయినకాడికి అమ్ముకుందామని ఆశగా మార్కెట్లకు వచ్చిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. పెట్టుబడి డబ్బులు కూడా రాకపోవడంతో అన్నదాతలు చితికిపోతున్నారు. రైతులను ఆదుకోవాల్సిన పాలకులు, అధికార యంత్రాంగం చేతులు కట్టుకుని చూస్తుండడంతో పరిస్థితి దారుణంగా మారుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకుని తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.