యూపీ సీఎం నివాసం ఎదుట బాధిత మహిళ ఆందోళన
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీ గూండా సర్కార్ నడుపుతోందని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జీవాలా ఆరోపించారు. బీజేపీ ఎంఎల్‌ఏ కుల్దీప్ సింగ్ సెంగార్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించిన మహిళ తండ్రి పోలీసు కస్టడీలో మరణించారన్న వార్తలపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ నివాసం ఎదుట ఆదివారం బాధిత మహిళ ఆత్మహత్యకు యత్నించిన క్రమంలో ఆమె తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీ పోలీసులు చితకబాదడం వల్లే మహిళ తండ్రి మరణించారని సుర్జీవాలా ట్వీట్ చేశారు. అత్యాచార బాధితురాలు ఆత్మహత్యకు ప్రయత్నించడం, పోలీసు కస్టడీలో ఆమె తండ్రి మరణించడం అత్యంత హేయమని ఆయన ట్వీట్ చేశారు.
నేరగాళ్లను అరెస్ట్ చేయడానికి బదులు యూపీ బీజేపీ సర్కార్ బాధితులను అరెస్ట్ చేస్తోందని, అక్కడ గూండాల పాలన సాగుతోందని ఆరోపించారు. అయితే తనపై వచ్చిన లైంగిక దాడి ఆరోపణలను బీజేపీ ఎమ్మెల్యే సెంగార్ తోసిపుచ్చారు. అయితే సెంగార్, ఆయన అనుచరులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, పోలీసులు కేసు నమోదు చేసేందుకు నిరాకరిస్తున్నారని బాధిత మహిళ ఆరోపించారు. అయితే పదేళ్లుగా ఈ వివాదం నడుస్తోందని, పూర్తి విచారణ అనంతరమే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment