సాక్షి, చెన్నై: కస్టడీలో ఉన్న నిందితుడి మృతి కేసులో సబ్ ఇన్‌స్పెక్టర్ సహా ముగ్గురు పోలీసులకు పదేళ్లు జైలు శిక్ష విధిస్తూ దిండుగల్ కోర్టు తీర్పు వెలువరించింది. దిండుగల్ జిల్లా వడమదురై పోలీసులు గతంలో మెట్టినా పట్టికి చెందిన సెంథిల్‌కుమార్‌ను బెదిరింపు కేసులో అరెస్టు చేశారు. రిమాండ్‌కు తరలించే సమయంలో గుండెపోటు రావడంతో అతను మరణించాడు. అయితే పోలీసులు కొట్టి చంపేసినట్టుగా ఆరోపణలు రావడం, బంధువులు ఆందోళనకు దిగడంతో కేసు సీబీసీఐడీకి చేరింది.
విచారణ ముగించిన సీబీసీఐడీ వడమదురై స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ తిరుమలై ముత్తుస్వామి, హెడ్ కానిస్టేబుళ్లు అరవిందన్, పొన్‌రాజ్, అబ్దుల్ వహబ్‌లపై మీద కేసు నమోదు చేసింది. దిండుగల్ కోర్టు న్యాయమూర్తి శరవణన్ ఈ కేసును విచారిస్తూ వచ్చారు. సీబీసీఐడీ సమర్పించిన చార్జ్ షీట్ మేరకు 60 మంది సాక్షులను విచారించారు. వాదనలు ముగించారు.
విచారణలో సెంథిల్‌కుమార్‌ను అరెస్టు చేసిన సమయంలో మెట్టినాపట్టి నుంచి వడమదురై పోలీసు స్టేషన్ వరకు దారి పొడవునా కొట్టుకుంటూ తీసుకొచ్చినట్టు తేలింది. తీవ్ర రక్తస్త్రావం జరిగినా కప్పిపుచ్చి ఆగమేఘాలపై కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించే ప్రయత్నం చేసినట్టు వెలుగు చూసింది. దీంతో ఈ కేసులో ఎస్‌ఐ తిరుమలైస్వామి, పొన్‌రాజ్, అరవిందన్‌లకు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ మంగళవారం సాయంత్రం న్యాయమూర్తి తీర్పునిచ్చారు. అలాగే చెరో రూ.5 వేల జరిమానా విధించారు. అదే సమయంలో సబ్ ఇన్‌స్పెక్టర్‌కు అదనంగా ఏడాది జైలు, రూ. వెయ్యి జరిమానా విధించారు.
చదవండి: 10 కిలోల బంగారు ఆభరణాలతో పరార్
Comments
Please login to add a commentAdd a comment