చెన్నై: తమిళనాడులో సంచలనం సృష్టించిన తండ్రీకొడుకులు జయరాజ్, బెనిక్స్ కస్టడీ డెత్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) చార్జిషీట్ దాఖలు చేసింది. సత్తాన్‌కులం పోలీస్ స్టేషన్ హౌజ్ ఇన్‌చార్జ్ సహా తొమ్మిది మంది పోలీసుల పేర్లను అభియోగపత్రంలో చేర్చింది. ఎస్ శ్రీధర్, కె.బాలకృష్ణ, పి.రఘుగణేష్, ఏఎస్ మురుగన్, ఎ. సమదురై, ఏఎమ్ ముత్తురాజ, ఎస్. చెల్లాదురై, థామస్ ఫ్రాన్సిస్, ఎస్.వేల్‌ముత్తు తదితరులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొంది. ఈ మేరకు మధురై కోర్టులో చార్జిషీట్ ఫైల్ చేసింది. ఈ కేసులో అరెస్టైన స్పెషల్ సబ్ ఇన్స్‌పెక్టర్ పాల్‌దురై ఇటీవలే కరోనాతో మృతి చెందినట్లు సీబీఐ వెల్లడించింది. (చదవండి: ‘కొడుకు ఒంటిపై 13, తండ్రి శరీరంపై 17 గాయాలు’)
కాగా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సత్తాన్‌కుళానికి చెందిన తండ్రీకొడుకులు జయరాజ్(59), బెనిక్స్(31)లను అరెస్టు చేసిన పోలీసులు.. వారిని చిత్ర హింసలు పెట్టడంతో మరణించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అనేక పరిణామాల అనంతరం ఈ కేసు సీబీఐ చేతికి వచ్చింది. ఈ క్రమంలో జూలై 7న సీబీఐ రెండు కేసులు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేపట్టింది.
ఇక కస్టడీ డెత్ కేసులో అరెస్టైన సత్తాన్‌కుళం పోలీసు స్టేషను అధికారులు ముత్తురాజ్ మరుగన్, థామస్ ఫ్రాన్సిస్ బెయిలు మంజూరు చేయాల్సిందిగా ఇటీవల మద్రాసు హైకోర్టు మధురై బెంచ్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో న్యాయస్థానం ఎదుట హాజరైన సీబీఐ అధికారులు, పదునైన గాయాల కారణంగానే మృతి చెందినట్లు పేర్కొంది. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం బెనిక్స్ ఒంటిపై 13 గాయాలు, జయరాజ్ శరీరంపై 17 గాయాలు ఉన్నట్లు కోర్టుకు తెలిపింది. తాజాగా తొమ్మిది మంది పేర్లను చార్జిషీట్‌లో చేర్చింది.
Comments
Please login to add a commentAdd a comment