మా దాహం తీర్చండి మహాప్రభో!
లాతూర్(మహారాష్ట్ర): మహారాష్ట్రలోని మాసుర్ది, లాతూరులో భయంకరమైన కరువు సంభవించింది. త్రాగునీరు దొరకపోవడంతో అక్కడి గ్రామాల్లోని జనం అల్లాడిపోతున్నారు. కరువు కారణంగా పంట పోలాలు, కాలువలు, చెరువుల్లో నీరు ఎండిపోయి బీటలు వారిపోతున్నాయి. 20 కిలోమీటర్లు వెళ్తేనేగానీ త్రాగునీరు దొరకని పరిస్థితి నెలకొనడంతో లాతూరులో నివసించే జనం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నీళ్ల కొరత కారణంగా కొన్నిచోట్ల మహారాష్ట్ర ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది.
అంతేకాక నీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలకు రైళ్ల ద్వారా మంచినీరును సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అక్కడి ప్రజలు తమకు సాధ్యమైనంత తొందరగా త్రాగునీటిని సరఫరా చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికే రంగంలోకి దిగిన అధికారులు వాటర్ ట్యాంకర్లతో త్రాగునీటిని కరువు ప్రాంతాల్లో అందించే చర్యలు తీసుకున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఒక్కరోజు వాటర్ ట్యాంకర్ రాకపోయిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది.
వాటర్ ట్యాంక్ రాకపోతే నీటిని అప్పుగా తీసుకునైనా సరే తమ అవసరాలను తీర్చుకుంటున్నారు. లాతూరుకు వాటర్ ట్యాంకర్ రాగానే అక్కడి జనమంతా బారులు తీరి నీళ్ల కోసం అగచాట్లు పడుతున్నారు. ఈ వాటర్ ట్యాంకర్ల మీద ఆధారపడిన గ్రామస్తులు నీరు తెచ్చే దాకా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ట్యాంకర్లు రాకపోతే చేసేది ఏమిలేక కొన్ని మైళ్ల దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భయంకరమైన కరువు దాపరించడంతో సాగునీరు లేక పంటలు ఎండిపోవడంతో కొందరు గ్రామస్తులు ఊరు వదిలిపోతున్నారు.