
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌తో దేశవ్యాప్తంగా మూడువారాల పాటు లాక్‌డౌన్ విధించిన క్రమంలో పలు రంగాలపై మహమ్మారి ప్రభావాన్నినిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉపశమన ప్యాకేజీ ప్రకటించింది. చిరుద్యోగులకు ఊరట ఇచ్చేలా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు నిర్ణయాలు వెల్లడించారు. రూ 15,000లోపు వేతనాలు అందుకునే చిరుద్యోగులకు ఊతం ఇచ్చేందుకు పీఎఫ్‌లో ఉద్యోగుల వాటాను కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి ప్రకటించారు. సంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు మూడు నెలల పాటు ఉద్యోగుల, సంస్థల వాటా ఈపీఎఫ్‌ను ప్రభుత్వమే చెల్లిస్తుంది. 90 శాతం మంది రూ 15,000లోపు వేతనాలు కలిగిన కంపెనీలకు ఇది వర్తిస్తుంది. ఉద్యోగులు తమ పీఎఫ్‌లో 75 శాతం లేదా మూడు నెలల జీతంలో ఏది తక్కువైతే అంత మొత్తం విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇక జన్‌థన్ ఖాతాలున్న మహిళలకు మూడు నెలల పాటు నెలకు రూ 500 ప్రభుత్వం జమచేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మహిళల జన్‌థన్ ఖాతాల సంఖ్య దాదాపు 20 కోట్లు. ఎలాంటి ష్యూరిటీ అవసరం లేకుండా డ్వాక్రా మహిళా గ్రూపులకు రూ 20 లక్షల వరకూ రుణ సదుపాయం కల్పించనున్నారు. వితంతువులు, వికలాంగులు, వృద్ధుల ఖాతాల్లో రెండు విడతలుగా రూ 1000 జమచేస్తారు.
ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 8.3 కోట్ల మంది కుటుంబాలకు ఈ నిర్ణయంతో లబ్ది చేకూరుతుందని తెలిపారు. లాక్ డౌన్ ప్రకటించిన 36 గంటల వ్యవధిలోనే పేదలు, వితంతువులు, వికలాంగులు, మహిళలు, రైతులు తదితరుల సహాయార్ధం ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని ఆర్థికమంత్రి వెల్లడించారు. కాగా దేశంలో కరోనా వ్యాప్తి చెందుతున్న పరిణామాల అనంతరం తొలిసారి జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆర్థిమంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో ఒక ఎకనామిక్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన నేపథ్యంలోనే కేంద్రం తాజాగా తక్షణ సహాయ చర్యల్ని ప్రకటించింది. మరోవైపు వైరస్ ప్రభావంతో దెబ్బతిన్న వ్యాపారాలకు క్రెడిట్ ఇవ్వడం అవసరమని, ముఖ్యంగా ఈ కష్ట సమయంలో పేదలు మనుగడ సాగించడానికి తాత్కాలిక ఆదాయ బదిలీ పథకాన్ని అమలు చేయాలని ఆర్బీఐ మాజీ గవర్నరు రఘురామ్ రాజన్ సైతం సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment