
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలకు కోత విధిస్తారనే వార్తలను ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం తోసిపుచ్చింది. ఈ ప్రచారం నిరాధారమని, అవాస్తవమని స్పష్టం చేసింది. ఏ క్యాటగిరీకి చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రస్తుత వేతనాల్లో కోత విధించే ఎలాంటి ప్రతిపాదననూ పరిశీలించడం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఈ దిశగా ఓ వర్గం మీడియాలో వచ్చిన కథనాలు నిరాధారమని పేర్కొంది. కాగా పెన్షన్‌ల జారీలోనూ ఎలాంటి కోత విధించడం లేదని, అత్యవసర సమయాల్లో వేతనాలు, పెన్షన్‌లను తగ్గించే ప్రసక్తి లేదని గతంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ పెన్షన్లలో 20 శాతం కోత విధిస్తారనే ప్రచారం సాగిందని ఇది పూర్తి అవాస్తవమని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఇలాంటి వదంతులను నమ్మరాదని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment