దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ: మమతా బెనర్జీ
దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి వచ్చిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. శివసేన, అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేతలతో కలిసి ఆమె రాష్ట్రపతి భవన్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెద్దనోట్ల రద్దుపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సామాన్య ప్రజలను ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించాలని.. పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ విషయంలో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని కోరామన్నారు. రాష్ట్రపతి కూడా ఆర్థికమంత్రిగా పనిచేసినవారేనని, అందువల్ల ఆయనకు దేశ పరిస్థితి మిగిలిన అందరికంటే బాగా తెలుస్తుందని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వంతో మాట్లాడి.. దేశంలో సాధారణ పరిస్థితి తిరిగి వచ్చేలా చూడాల్సిందిగా చెప్పాలని కోరామని ఆమె తెలిపారు.
ఇంతకుముందు ఏటీఎం అంటే ఎనీటైమ్ మనీ అని చెప్పేవారని, కానీ ఇప్పుడు మాత్రం అది 'ఆయేగా తబ్ మిలేగా (వస్తే అప్పుడు కలుద్దాం)' అన్నట్లు అయిపోయిందని ఎద్దేవా చేశారు. మార్కెట్లలోకి డబ్బులు తేవాలని, ప్రజలకు సాయం చేయాలని అన్నారు. స్వచ్ఛంద ఆస్తుల వలెల్డి పథకంలో రూ. 65 వేల కోట్లు జమ అయినట్లు చెప్పారని, అందులోంచి ఒక్క పైసా కూడా ప్రజలకు ఇవ్వలేదని ఆమె విమర్శించారు. మార్కెట్లో కూరగాయలు దొరకడం లేదని, పిల్లలకు పాలు లేవని, దుకాణాల్లో మందులు కూడా లేవని అన్నారు. ఇప్పటికి క్యూలలో నిలబడి ఎంతమంది చనిపోయారో తెలుసా అని ప్రశ్నించారు. గుండెపోటు వల్ల చనిపోయారని చెబుతున్నారని.. అది ఎందుకు వస్తుందని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన పెద్దనోట్ల రద్దుపై ప్రతిపక్షం మొత్తం పోరాటం సాగిస్తోంది. దీనివల్ల పేదలపైనే ప్రభావం పడుతోంది తప్ప ధనవంతులైన పన్ను ఎగవేతదారులపై కాదని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.