
రెట్టింపు కంటే జరిమానా విధించొద్దు: సుప్రీంకోర్టు
చెక్ బౌన్స్ కేసులలో కింది కోర్టులకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: చెక్ బౌన్స్ కేసుల్లో చెల్లించాల్సిన మొత్తానికంటే రెట్టింపునకు మించి కోర్టులు జరిమానా విధించరాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ పరిమితిని కోర్టులు గౌరవించాలని, ఉల్లంఘించరాదని సూచించింది. చెక్ బౌన్స్‌కు సంబంధించి ఏదేనీ కేసులో కోర్టులు నిందితులను జైలుకు పంపకుండా వారిపట్ల దయతో కూడా వ్యవహరించవచ్చని జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ విక్రంజిత్ సేన్‌తో కూడిన బెంచ్ పేర్కొంది. పశ్చిమబెంగాల్‌కు చెందిన సోమనాథ్ సర్కార్ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
రూ.69,500 రూపాయల మొత్తానికి చెందిన చెక్ బౌన్స్ కేసులో సోమనాథ్‌కు ట్రయల్ కోర్టు అసలుతోపాటు రూ.80,000 జరిమానా చెల్లించాలని ఆదేశించడంతోపాటు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. దీనిపై సోమనాథ్ కలకత్తా హైకోర్టుకు వెళ్లగా.. జరిమానాను మాత్రం రూ.69,500కు తగ్గించి, జైలు శిక్షను ఎత్తివేసింది. అనంతరం తాను అంతమొత్తం చెల్లించుకోలేనంటూ సోమనాథ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం జరిమానాను రూ.20,000కు తగ్గించి పిటిషనర్‌కు ఉపశమనం కల్పించింది.