బరౌనీ (బిహార్)/హజారీబాగ్ (జార్ఖండ్): జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై దేశ ప్రజల గుండెలు రగులుతున్నట్లుగానే తన హృదయం కూడా కోపం, విషాదంతో నిండిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. బిహార్, జార్ఖండ్‌ల్లో ఆదివారం మోదీ పర్యటించి వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. బిహార్‌లోని బెగుసరాయ్ జిల్లా బరౌనీలో ఆయన బహిరంగ సభలో ప్రసంగించారు. పుల్వామా ఉగ్రదాడిలో మృతి చెందిన 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లలో బిహార్‌కు చెందిన సంజయ్ కుమార్ సిన్హా, రతన్ కుమార్ ఠాకూర్ కూడా ఉన్నారు. వారికి మోదీ సభలో నివాళులర్పించారు. ‘ఆప్తులను పోగొట్టుకున్న కుటుంబాలను నేను ఓదారుస్తాను.
అలాగే ఇక్కడున్న ఈ జనసమూహానికి నేనో విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే.. మీ గుండెల్లో రగులుతున్న మంటలే నా గుండెలోనూ మండుతున్నాయి’ అని మోదీ అన్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీలు మాట్లాడుతూ పుల్వామా దాడికి భారత్ గట్టిగా బదులిస్తుందని తాము ఆశిస్తున్నామన్నారు. మోదీ తన ప్రసంగంలో దాదాపు 30 నిమిషాలపాటు వివిధ ప్రాజెక్టులు, వాటి శంకుస్థాపనల గురించి మాట్లాడారు. మొత్తంగా బిహార్‌లో 33 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు మోదీ బెగూసరాయ్ సభ నుంచే రిమోట్ ద్వారా ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ ప్రాజెక్టులు ప్రజల జీవితాల్లో అన్ని విధాలుగా ఎలా అభివృద్ధిని తీసుకొస్తాయో మోదీ వివరించారు.
పట్నాకు మెట్రోరైల్..
‘నిర్ణయాలను త్వరగా తీసుకునే సామర్థ్యం ఉన్న, బలమైన, స్థిరమైన ప్రభుత్వానికి మీరు ఓటేసినందు వల్లే ఈనాడు ఈ అభివృద్ధి సాధ్యమవుతోంది’ అని మోదీ అన్నారు. చిన్న, సన్నకారు రైతులకు తమ ప్రభుత్వం ఏడాదికి రూ. ఆరు వేలు ఇస్తోందనీ, ప్రస్తుత రిజర్వేషన్ల స్వరూపాన్ని మార్చకుండానే అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తోందని ఆయన చెప్పారు. బిహార్ రాజధాని పట్నాలో రూ. 13 వేల కోట్లతో నిర్మించ తలపెట్టిన మెట్రోరైల్ ప్రాజెక్టుకు మోదీ రిమోట్ ద్వారా శంకుస్థాపన చేశారు. ‘పట్నా ప్రజలకు నా అభినందనలు. ఎందుకంటే త్వరలో మీ నగరంలో మెట్రోరైలు సేవలు అందుబాటులోకి వస్తాయి’ అని మోదీ చెప్పారు. బిహార్‌లో పలు ఇతర ప్రాజెక్టులకు కూడా ఆయన శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో బిహార్ గవర్నర్ లాల్జీ టాండన్, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.
అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి
బిహార్‌లో పర్యటన అనంతరం మోదీ జార్ఖండ్‌కు చేరుకున్నారు. అక్కడ కూడా అనేక ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. హజారీబాగ్‌లో బహిరంగ సభలో ప్రసంగించారు. గత నాలుగున్నరేళ్ల పాలనలో జార్ఖండ్‌లోని అన్ని వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేసిందని చెప్పుకొచ్చారు. జార్ఖండ్‌లో రైతులు స్మార్ట్‌ఫోన్ కొనడానికి పొందిన రాయితీలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాల పంపిణీ తదితర పథకాలను మోదీ ప్రస్తావించారు. డుంకా, పాలము, హజారీబాగ్‌ల్లో వైద్య కళాశాలలను రిమోట్ ద్వారా ప్రారంభించారు. వీటితో జార్ఖండ్‌లో ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య ఆరుకు చేరిందనీ, ఇకపై వెద్య విద్య కోసం దూరం వెళ్లాల్సిన అవసరం లేదని మోదీ పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద 57 వేల మంది జార్ఖండ్ ప్రజలు లబ్ధి పొందారని తెలిపారు. పుల్వామా దాడిలో చనిపోయిన జవాన్ విజయ్ సోరెంగ్‌కు నివాళి అర్పించారు.
ఉగ్రదాడులకు బదులు చెప్తాం: కోవింద్
గానావూర్ (సోనీపట్): జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఖండించారు. అదో పిరికిపందల చర్యగా అభివర్ణించారు. గతంలో ఇలాంటి ఘటనలను ధైర్యంగా అత్యంత సామర్థ్యంతో ఎదుర్కొన్నామని.. భవిష్యత్‌లోనూ వీటికి తగిన బదులిస్తామని స్పష్టం చేశారు. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు దేశ ప్రజల తరఫున నివాళులు అర్పిస్తున్నట్లు కోవింద్ ప్రకటించారు. హరియాణా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న నాలుగో అగ్రి లీడర్‌షిప్ సదస్సు ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. దేశంలో రైతులు, జవాన్ల కృషి అభినందనీయమని కొనియాడారు. ఒకరు దేశ ప్రజల ఆహార అవసరాలు తీర్చేందుకు కృషి చేస్తుంటే మరొకరు సరిహద్దుల్లో రక్షణగా ఉండి దేశాన్ని కాపాడుతున్నారని ప్రశంసించారు.
నిరాశతోనే జవాన్లపై ఉగ్రదాడి: రాజ్‌నాథ్
భద్రక్ (ఒడిశా): ఐదేళ్లుగా భారత భద్రతా దళాలు సాధిస్తున్న విజయాలను చూసి తట్టుకోలేక నిరాశతో ఉగ్రవాదులు దాడికి పాల్పడుతున్నారని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ఉగ్రదాడులను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ఉత్తర ఒడిశాలోని భద్రక్ జిల్లాలో జరిగిన బహిరంగ సమావేశంలో రాజ్‌నాథ్ ప్రసంగించారు. పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారు. శత్రుమూకలకు తగిన గుణపాఠం చెబుతామని ఉద్ఘాటించారు. ప్రతిపక్షాలు సహా దేశ ప్రజలంతా జవాన్ల వెంట ఉన్నారని.. వారి త్యాగాలు వృథాగా పోవని వ్యాఖ్యానించారు.
అమర జవాన్లకు నివాళులు: 1942 ఒడిశా ఊచకోతలో అమరులైన జవాన్లకు రాజ్‌నాథ్ సింగ్ నివాళులు అర్పించారు. ఒడిశాలోని భద్రక్ జిల్లా ఇరామ్ గ్రామంలో ఉన్న షాహీద్ స్తంభం వద్ద పుష్ప నివాళులు అర్పించారు. అనంతరం జిల్లాలోని పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.
భద్రక్‌లో జవాన్లకు నివాళులర్పిస్తున్న రాజ్‌నాథ్
జవాన్ల త్యాగాలు వృథా కావు: అమిత్‌షా
లఖింపూర్ (అస్సాం): ఇప్పుడు అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమని, పుల్వామా ఘటనలో జవాన్ల త్యాగాలను వృథాగా పోనివ్వమని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. కాంగ్రెస్‌లాగా దేశ రక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు. ఆదివారం ఇక్కడ భారతీయ జనతా యువ మోర్చా నిర్వహించిన ఒక బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. పుల్వామా ఘటనలో పాకిస్తాన్ ప్రమేయం ఉందని, ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదన్నారు.
టెర్రరిజంపై పోరాడటంలో ప్రపంచంలోని ఏ నేతకీ ప్రధాని నరేంద్రమోదీ తీసిపోరని ఆయన చెప్పారు. ఇప్పటికే దౌత్యమార్గం ద్వారా పాక్ కుట్రలను ప్రపంచం ముందు బహిర్గతం చేశామని, సర్జికల్‌స్ట్రైక్స్ ద్వారా వారికి దీటైన జవాబిచ్చామని అమిత్‌షా చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్‌ఆర్‌సీ అమలు చేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. పౌరసత్వ సవరణ బిల్లుపై విపక్షాలు తప్పుగా ప్రచారం చేశాయన్నారు. ఆ బిల్లుదేశంలోకి శరణార్ధులని నిరోధించేందుకు తీసుకువచ్చిన బిల్లు మాత్రమేనన్నారు. బిల్లు ఆమోదం పొందకపోతే అది అస్సాంకే కాదు, దేశానికే ప్రమాదమన్నారు.
భారత్ ఆరోపణలు నిరాధారం: పాక్
ఇస్లామాబాద్: జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి ఘటన గురించి భారత్ దుష్ప్రచారం చేస్తోందని పాకిస్తాన్ ఆరోపించింది. భారత్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, ఆ దేశం చేస్తోన్న వ్యాఖ్యల కారణంగా శాంతికి భంగం వాటిల్లే ప్రమాదం ఉందని ఆఫ్రికా దేశాల, షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) దేశాల రాయబారులకు ఆదివారం పాక్ వివరించింది. పుల్వామా ఉగ్రదాడి ఘటనలో పాక్ పాత్రపై ఇప్పటికే పలు దేశాలతో భారత్ చర్చించింది. పీ5 దేశాలు (అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్) సహా మొత్తం 25 దేశాల దౌత్యవేత్తలతో సంప్రదింపులు జరిపి పాక్ విధానాలను ఎండగట్టింది.
పాక్ విదేశాంగశాఖ ప్రతినిధి మహమ్మద్ ఫైసల్, ఆ దేశ విదేశాంగ కార్యదర్శి తెహ్మినా జంజువాతో పుల్వామా దాడి ఘటన నేపథ్యంలో భారత్ వ్యాఖ్యలపై సమావేశమై చర్చించారు. ‘భారత్ ఆరోపణలు నిరాధారమైనవి.. భారత్ వ్యాఖ్యలతో ఇక్కడి ప్రాంతాల శాంతికి ప్రమాదం కలిగే అవకాశముంది..’ అని ఫైసల్ ఎస్‌సీఓ దేశాల రాయబారులకు వివరించారు. ఇలాంటి ఘటనలకు సంబంధించి ఎటువంటి విచారణ జరపకుండానే భారత్ పాక్‌పై నిందలు వేస్తోందని చెప్పారు. ఎస్‌సీఓ దేశాల్లో భారత్, పాక్ సహా రష్యా, చైనా, కిర్గిజ్ రిపబ్లిక్, కజకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఉన్నాయి.
జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో జరిగిన సభలో ప్రసంగిస్తున్న మోదీ
Comments
Please login to add a commentAdd a comment