ప్రతీకాత్మక చిత్రం
షిల్లాంగ్: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ దాటికి అగ్రరాజ్యం అమెరికా సైతం చిగురుటాకులా వణికిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 20 లక్షలు దాటాయి. ప్రతి రోజు వేల మంది ఈ రాకాసి కోరల్లో చిక్కుకొని మృత్యువాత పడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న కరోనాను నియంత్రించడం కష్టంగానే మారింది. భారత ప్రభుత్వం కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ను ప్రకటించి పక్కగా అమలు చేస్తోన్న కరోనా మరణాలు దేశంలో నానాటికి పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో జన సాంద్రత తక్కువగా ఉండే ఈశాన్య రాష్ట్రాలలో సైతం తొలి కరోనా మరణం నమోదయింది.(కుప్పలుగా శవాలు.. అక్కడే ఎందుకు ఎక్కువ మరణాలు?)
మేఘాలయాలో బుధవారం ఉదయం 2గంటల 45 నిమిషాలకు కరోనాతో ఒక వ్యక్తి మరణించారు. బెతాని హాస్పిటల్ వ్యవస్థాపకుడు డాక్టర్ జాన్ ఎల్ సైలోరింథియాంగ్ (69) కు ఏప్రిల్ 13న కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. చికిత్స పొందుతూ ఆయన బుధవారం తెల్లవారు జామున మరణించారు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ మేఘాలయ ముఖ్యమంత్రి కార్నడ్ సంగ్మా ట్వీట్ చేశారు. ‘మేఘాలయాలో మొదటి కోవిడ్-19 పాజిటివ్ కేసు పేషెంట్ ఈ రోజు ఉదయం మరణించారు అని ప్రకటించాడానికి నేను బాధపడుతున్నాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢసానుభూతి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’ అని సంగ్మా ట్వీట్ చేశారు. ( ఆ రెండు రకాల గబ్బిలాల్లో కరోనా!)
ఈశాన్య భారతంలో గత నెల తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదయిన విషయం తెలిసిందే. లండన్ నుంచి మార్చి 19న వచ్చిన ఆ వ్యక్తిని క్వారంటైన్‌లో ఉంచారు. రాష్ట్రాల్లోకి వచ్చే వెళ్లే అన్ని మార్గాలను ప్రభుత్వాలు లాక్‌డౌన్ కారణంగా మూసివేశాయి. దీంతో సాధారణంగానే జనసాంద్రత, ఇతర దేశాల నుంచి ఈశాన్య భారతదేశానికి వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉండటంతో అక్కడ కరోనా కేసులు చాలా తక్కువగా నమోదు అయ్యాయి. అయితే ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో మాత్రం ఇప్పటి వరకు 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
నిజాముద్దీన్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైన వ్యక్తి భార్యకు కరోనా సోకినట్లు అస్సాం మంత్రి హిమాంత బిశ్వ శర్మ తెలిపారు. గుహవటిలోని అగ్త్వాన్ కబరీస్తాన్ మసీదును కంటెయిన్‌మెంట్ జోన్‌గా ప్రకటించినట్లు అస్సాం ప్రభుత్వం తెలిపింది. ఆ ప్రాంతాన్ని 14రోజుల పాటు సీజ్ చేస్తున్నట్లు తెలిపింది. అగ్త్వాన్ మసీదులో మార్చి 12న 100 మంది సమావేశం నిర్వహించారని వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ అని తేలిందని అస్సాం మంత్రి హిమాంత బిశ్వ శర్మ తెలిపారు. ఇప్పటివరకు భారత్‌లో 11,439 కరోనా కేసులు నమోదు కాగా, 377 మంది మరణించారు. 2687 కరోనా పాజిటివ్ కేసులతో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉండగా ఢిల్లీ, తమిళనాడు తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment