Meghalayam
-
అక్కడ తొలి కరోనా మరణం.. సీఎం ట్వీట్
షిల్లాంగ్: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ దాటికి అగ్రరాజ్యం అమెరికా సైతం చిగురుటాకులా వణికిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 20 లక్షలు దాటాయి. ప్రతి రోజు వేల మంది ఈ రాకాసి కోరల్లో చిక్కుకొని మృత్యువాత పడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న కరోనాను నియంత్రించడం కష్టంగానే మారింది. భారత ప్రభుత్వం కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ను ప్రకటించి పక్కగా అమలు చేస్తోన్న కరోనా మరణాలు దేశంలో నానాటికి పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో జన సాంద్రత తక్కువగా ఉండే ఈశాన్య రాష్ట్రాలలో సైతం తొలి కరోనా మరణం నమోదయింది.(కుప్పలుగా శవాలు.. అక్కడే ఎందుకు ఎక్కువ మరణాలు?) మేఘాలయాలో బుధవారం ఉదయం 2గంటల 45 నిమిషాలకు కరోనాతో ఒక వ్యక్తి మరణించారు. బెతాని హాస్పిటల్ వ్యవస్థాపకుడు డాక్టర్ జాన్ ఎల్ సైలోరింథియాంగ్ (69) కు ఏప్రిల్ 13న కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. చికిత్స పొందుతూ ఆయన బుధవారం తెల్లవారు జామున మరణించారు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ మేఘాలయ ముఖ్యమంత్రి కార్నడ్ సంగ్మా ట్వీట్ చేశారు. ‘మేఘాలయాలో మొదటి కోవిడ్-19 పాజిటివ్ కేసు పేషెంట్ ఈ రోజు ఉదయం మరణించారు అని ప్రకటించాడానికి నేను బాధపడుతున్నాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢసానుభూతి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’ అని సంగ్మా ట్వీట్ చేశారు. ( ఆ రెండు రకాల గబ్బిలాల్లో కరోనా!) ఈశాన్య భారతంలో గత నెల తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదయిన విషయం తెలిసిందే. లండన్ నుంచి మార్చి 19న వచ్చిన ఆ వ్యక్తిని క్వారంటైన్లో ఉంచారు. రాష్ట్రాల్లోకి వచ్చే వెళ్లే అన్ని మార్గాలను ప్రభుత్వాలు లాక్డౌన్ కారణంగా మూసివేశాయి. దీంతో సాధారణంగానే జనసాంద్రత, ఇతర దేశాల నుంచి ఈశాన్య భారతదేశానికి వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉండటంతో అక్కడ కరోనా కేసులు చాలా తక్కువగా నమోదు అయ్యాయి. అయితే ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో మాత్రం ఇప్పటి వరకు 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిజాముద్దీన్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైన వ్యక్తి భార్యకు కరోనా సోకినట్లు అస్సాం మంత్రి హిమాంత బిశ్వ శర్మ తెలిపారు. గుహవటిలోని అగ్త్వాన్ కబరీస్తాన్ మసీదును కంటెయిన్మెంట్ జోన్‌గా ప్రకటించినట్లు అస్సాం ప్రభుత్వం తెలిపింది. ఆ ప్రాంతాన్ని 14రోజుల పాటు సీజ్ చేస్తున్నట్లు తెలిపింది. అగ్త్వాన్ మసీదులో మార్చి 12న 100 మంది సమావేశం నిర్వహించారని వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ అని తేలిందని అస్సాం మంత్రి హిమాంత బిశ్వ శర్మ తెలిపారు. ఇప్పటివరకు భారత్‌లో 11,439 కరోనా కేసులు నమోదు కాగా, 377 మంది మరణించారు. 2687 కరోనా పాజిటివ్ కేసులతో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉండగా ఢిల్లీ, తమిళనాడు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. చదవండి: కుటుంబానికంతా కరోనా -
అక్కడ ఇప్పటికీ రాత్రిపూట కర్ఫ్యూ
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం నిరసన జ్వాలలు ఇప్పుడు మేఘాలయను చుట్టుముట్టాయి. శుక్రవారం నుంచి ముగ్గురు మృత్యువాత పడగా, అనేక మంది కత్తిపోట్లకు గురయ్యారు. అనేక దుకాణాలు తగులబడ్డాయి. ఖాసి, జైంటియా ప్రాంతాల్లోని ఆరు జిల్లాలో ఇంటర్నెట్ సర్వీసులు నిలిచి పోయాయి. షిల్లాంగ్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో రాత్రిపూట కర్ఫ్యూ ఇప్పటికీ కొనసాగుతోంది. ఆదివాసీలు ఎక్కువగా ఉన్న మేఘాలయ లాంటి రాష్ట్రాల్లో పౌరసత్వ సవరణ చట్టం వల్ల అక్రమ వలసదారులకు పౌరసత్వం లభిస్తుందని వారు భయాందోళనలకు గురవుతున్నారు. పౌరసత్వ సవరణ చట్టం వల్ల బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్ నుంచి వచ్చిన హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులకు చట్టబద్ధంగా పౌరసత్వం లభిస్తుందన్న విషయం తెల్సిందే. ఆ దేశాల నుంచి మేఘాలయతోపాటు ఈశాన్య రాష్ట్రాలకు అక్రమంగా వలసవచ్చిన వారందరికి పౌరసత్వం లభిస్తుందన్నది వారి వాదన. అయితే రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ కింద ఉన్న ఆదివాసీలకు ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని, పౌరసత్వ సవరణ చట్టం కింద ఆరవ షెడ్యూల్ పరిధిలోని ప్రాంతాలకు పూర్తి మినహాయింపు ఉందంటూ కేంద్ర ప్రభుత్వం చివరి నిమిషయంలో దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఈ రక్షణ వల్ల పెద్ద ఉపయోగం లేకపోవచ్చని మేఘాల ప్రజలు భయాందోళన లకు గురవుతున్నారు. ఆరవ షెడ్యూల్ ప్రాంతాలకు ఇతరులు ఎవరు వెళ్లాలన్న అధికారిక అనుమతి పత్రం అవసరం. అయినప్పటికీ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మేఘాలయలోని ఖాసి విద్యార్థుల సంఘం పెద్ద ఎత్తున విధ్వంసకాండకు దిగింది. మృత్యువాత పడిన వారు కూడా విద్యార్థులే. 1960వ దశకంలో ‘బొంగాల్ ఖేదా ఉద్యమం’ కొనసాగిన మేఘాలయ ప్రజలతో పౌరసత్వ సవరణ చట్టాన్ని ఒప్పించడం చాలా కష్టం. బొంగాల్ ఖేదా ఉద్యమం సందర్భంగా వందలాది మంది ఆదివాసీయేతరులను ఇళ్ల నుంచి తరమి తరమి కొట్టారు. అప్పుడు పెద్ద ఎత్తున రక్తపాతం జరిగింది. ఈ మధ్యనే అక్కడ శాంతియుత పరిస్థితులు నెలకొనగా మళ్లీ ఇప్పుడు చిచ్చు రేగింది. నెలరోజుల్లోగా ఆదివాసీయేతరులు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లి పోవాలంటూ తాజాగా ఆదివాసీ మిలిటెంట్ సంస్థలు అల్టిమేటమ్ జారీ చేశాయి. అస్సాంలో చాలా ప్రాంతాలు రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌కు వెలుపల ఉన్నాయి. అందుకనే అక్కడ ఈ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విధ్వంసకాండ చెలరేగింది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో కూడా ఈ చట్టానికి వ్యతిరేకంగా ఇప్పటికీ ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెల్సిందే. యూపీ, ఢిల్లీ రాష్ట్రాల్లో ముస్లింలు, హిందువులకు మధ్య చిచ్చు రగులుకోగా, ఈశాన్య రాష్ట్రాల్లో ఆదివాసీలు, ఇతరులకు మధ్య చిచ్చు రగులుతోంది. (చదవండి: అంతర్జాతీయ సమస్యగా సీఏఏ) -
డైనమిక్ డాక్టరమ్మ
గర్భిణి ప్రసవ వేదనతో హాస్పిటల్‌కు వస్తే ‘‘డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకెళ్లండి’’ అని పేషెంట్‌ని నిర్దాక్షిణ్యంగా పంపించేసిన ఉదంతాలనే చదువుతుంటాం. అయితే ఇందుకు పూర్తి భిన్నంగా స్పందించారు మేఘాలయలోని డాక్టర్ బాల్నామ్చి సంగ్మా. అంబులెన్స్ నడిపేందుకు డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో పెద్దాసుపత్రివరకు తనే బండి నడిపి గర్భిణి ప్రాణాలు కాపాడారు. మేఘాలయలోని వెస్ట్ గారో హిల్స్‌లో గారోబదా ప్రైమరీ హెల్త్ సెంటర్లో డాక్టర్ ఆమె. తమ హాస్పిటల్‌కి వచ్చిన పేషెంట్‌కి నొప్పులు మొదలయ్యాయి. ఆమెకు స్కానింగ్ టెస్ట్‌లో అంచనా వేసిన తేదీ కంటే ముందుగానే కాన్పు నొప్పులు మొదలయ్యాయి. ఆమెను తురా పట్టణంలోని మెటర్నిటీ అండ్ చైల్డ్ హాస్పిటల్‌కు చేర్చాల్సిన అవసరాన్ని గుర్తించారు డాక్టర్లు. పేషెంట్ బంధువులకు అదే మాట చెప్పారు. అయితే పేషెంట్‌ను పెద్దాసుపత్రికి చేర్చే నాధుడు లేడు. అత్యవసర వైద్య సేవలు అందించాల్సిన 108 సర్వీస్ ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు. ఆ హాస్పిటల్‌కి ఒక అంబులెన్స్ కూడా ఉంది. కానీ ఆ డ్రైవర్ ఆ రోజు సెలవులో ఉన్నాడు. వాహనం ఉంది కానీ నడిపే వాళ్లు లేరు. ‘‘ప్రైవేట్ వాహనం తెచ్చుకుని పేషెంట్‌ని తీసుకెళ్లండి’’ అని చెప్పడానికి డాక్టర్ సంగ్మాకి నోరు రాలేదు. వాళ్లు అంత ఖర్చును భరించలేరని వాళ్లను చూస్తేనే తెలుస్తోంది. అలాంటప్పుడు అంబులెన్స్ అందుబాటులో ఉండి, తనకు డ్రైవింగ్ వచ్చి ఉండి, లైసెన్స్ కూడా చేతిలో ఉండి... వాళ్లనలా వదిలించుకోవడానికి మనసొప్పలేదామెకి. అందుకే స్టెత్‌ని కోటు జేబులో పెట్టి, కోటును పక్క సీటుకు తగిలించి, డ్రైవింగ్ సీట్లో కూర్చున్నారామె. అంబులెన్స్ ప్రయాణం తురా పట్టణం వైపు మొదలైంది. ఫోన్లో ఫొటోలు డాక్టర్ సంగ్మా ప్రయాణిస్తున్న దారిలో రోడ్ల మీద ఉన్న జనం దృష్టి ఆ అంబులెన్స్ మీద పడనే పడింది. వెంటనే చాలా మంది చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లతో ఆ దృశ్యాన్ని క్యాప్చర్ చేశారు. అయితే వాళ్లకు విచిత్రంగా అనిపించిన సంగతి డాక్టర్ అంబులెన్స్ డ్రైవ్ చేస్తోందన్న విషయం కాదు. నిజానికి వాళ్లకెవరికీ ఆ సంగతి తెలియదు కూడా. స్థానికులను ఆశ్చర్యపరిచిన సంగతి.... అంబులెన్స్‌ని ఒక మహిళ నడుపుతోంది అని. అంబులెన్స్ తురా చేరింది, గర్భిణికి సుఖ ప్రసవం అయింది. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు. ఆలస్యం చేయకుండా సమయానికి తీసుకురావడంతో కాంప్లికేషన్లు ఏమీ తలెత్తలేదని చెప్పారు డెలివరీ చేసిన డాక్టర్లు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది కూడా. సంగ్మా మాత్రం ‘‘ఆ సమయానికి అవసరమైన పని చేశానంతే’’ అంటున్నారు. ఈ నెల ఒకటో తేదీన జరిగిన ఈ సంఘటన ఈశాన్య రాష్ట్రం నుంచి దేశం నాలుగు మూలలకూ చేరడానికి నాలుగురోజులు పట్టింది. – మను -
మేఘాలయలో కొనసాగుతున్న రెస్కూ ఆపరేషన్
-
మావీ ‘అతిపెద్ద’ పార్టీలే!
న్యూఢిల్లీ/పణజి/పట్నా: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన నేపథ్యంలో ప్రతిపక్షాలు ఈ నిర్ణయాన్ని ఆయుధంగా మార్చుకోనున్నాయి. గోవా, మణిపుర్, మేఘాలయతో పాటు బిహార్‌లో అతిపెద్ద పార్టీలుగా నిల్చిన కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆయా రాష్ట్రాల గవర్నర్లను కోరేందుకు సిద్ధమయ్యాయి. గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా కోరుతూ 16 మంది ఎమ్మెల్యేల సంతకాల లేఖను శుక్రవారం రాష్ట్ర గవర్నర్ మృదులా సిన్హాకు అందజేయనున్నట్లు గోవా కాంగ్రెస్ శాసనసభా పక్షనేత చంద్రకాంత్ కవ్లేకర్ తెలిపారు. ఈ ఎన్నికల్లో మొత్తం 40 స్థానాలకు గానూ కాంగ్రెస్ 17 సీట్లలో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచిందన్నారు. గవర్నర్‌తో సమావేశంలో గతంలో చేసిన తప్పును సరిదిద్దుకుని కర్ణాటక తరహాలో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరతామన్నారు. మరోవైపు మణిపుర్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత ఇబోబీ సింగ్, మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మాలు శుక్రవారం ఆయా రాష్ట్రాల గవర్నర్లతో సమావేశం కానున్నారు. మణిçపూర్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఉన్నందున తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌ను కోరతామని ఇబోబీ సింగ్ తెలిపారు. బిహార్ గవర్నర్‌తో భేటీ కానున్న తేజస్వీ కర్ణాటక ఉదంతం నేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలసి బిహార్ గవర్నర్ సత్యపాల్‌తో శుక్రవారం భేటీ అవుతానని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో నితీశ్ ప్రభుత్వాన్ని రద్దుచేసి కర్ణాటక తరహాలో తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరతామన్నారు. -
మేఘాలయ సారథి కన్రాడ్
-
సహజసుందరం
మేఘాలయం ప్రెజెంటేషన్: నిర్మలారెడ్డి ఏడాది పొడవునా చల్లగా, వర్షపాతం అధికంగా ఉండి, హోరుమని దుమికే జలపాతాలకు నెలవై, పచ్చదనంతో ప్రకృతి ఆరాధకులను తనవైపు తిప్పుకొని విస్మయపరిచే ప్రాంతం చిరపుంజి. గిరిజన సంస్కృతులు కొలువుదీరి, అబ్బురపరిచే వన్యప్రాణులు విహరించే ప్రాంతం, ప్రశాంతతకు ఆలవాలమైన ఆలయాలుగల షిల్లాంగ్. ఈశాన్య భారతదేశంలో కొలువైన ఈ ప్రాంతాల సోయగాలను కనులారా వీక్షించిన హైదరాబాద్ తపాలా శాఖలో మార్కెటింగ్ అసిస్టెంట్ డెరైక్టర్ జి.సూర్యనారాయణ పర్యటన అనుభవాలివి... ‘‘మా కుటుంబ సభ్యులతో కలిసి కిందటి నెలలో ఈశాన్యభారతదేశంలోని చిరపుంజిని సందర్శించాలని బయల్దేరాను. చిరపుంజితో పాటు షిల్లాంగ్, అస్సాంలోని గౌహతి పట్టణం సందర్శించాం. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఈస్ట్‌కోస్ట్ రైలులో ఉదయం 10 గం.లకు బయల్దేరిన మేము మరుసటి రోజు 4:30 గంటలకు కోల్కత్తా చేరుకున్నాం. అక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయం నుంచి విమానయానం ద్వారా షిల్లాంగ్‌కు బయల్దేరాం. హోటల్ గదిలో విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు చిరపుంజికి టాక్సీలో బయల్దేరాం. చిరపుంజి చేరడానికి దాదాపు 2 గంటల సమయం పట్టింది. జలపాతాల హోరు చిరపుంజి... మేఘాలయ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌కు 56 కి.మీ దూరంలో తూర్పు ఖాసి హిల్స్ జిల్లాలోని ఒక చిన్న పట్టణం చిరపుంజి. దీనిని సోహ్రా, చురా అని కూడా అంటారు. భూమి మీద అతి తేమగా ఉండే ప్రదేశంగా ఇది ఖ్యాతి చెందింది. షిల్లాంగ్ నుంచి చిరపుంజి వెళ్లే దారంతా పచ్చని ప్రకృతి అందాలను చూసి మైమరచిపోయాం. అదనపు ఆకర్షణగా చిరపుంజిలో అన్నీ జలపాతాలే! ‘నోహ్కాలికై’ జలపాత సోయగమైతే మాటల్లో వర్ణించలేం. దేశంలోనే ఎత్తై జలపాతాలలో ఒకటిగా ‘నోహ్కాలికై’కి పేరుంది. చిరపుంజికి 5 కిలోమీటర్ల దూరంలోనే గల ఈ జలపాతం ఈ ప్రాంతానికి ప్రధాన ఆకర్షణ. ఇక్కడ ఏడాదికి సాధారణ వర్షపాతం 12000 మి.మీ గా నమోదవుతుంది. రికార్డు స్థాయిలో 2500 మి.మీకు పైగా నమోదైన రోజులూ ఉన్నాయి. మేం వెళ్లిన రోజునా వర్షం మమ్మల్ని పలకరిస్తూనే ఉంది. రోడ్డుకి ఇరువైపులా బొగ్గుక్షేత్రాలు, సున్నపురాయి గనులు లెక్కకు మించి ఉన్నాయి. ఇదే ప్రాంతంలో ‘దైనత్లేన్’ అనే మరో జలపాతమూ ఉంది. గుహల సముదాయం... జలపాతాల హోరును, పర్వతశ్రేణులను, పచ్చని ప్రకృతిని తిలకిస్తూ అక్కడ ఫొటోలు దిగాం. చూసినంత సేపు చూసి అక్కడ నుంచి గుహల సందర్శనకు బయల్దేరాం. ‘లైమ్‌స్టోన్ కేవ్స్’గా పిలిచే సున్నపురాయి గుహలు చిరపుంజికి 6 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. ఇక్కడి పర్వతప్రాంతమంతా పచ్చని గడ్డి తివాచీ పరుచుకున్నట్టే ఉంది. ఈ గుహలలో చిన్నవి, పెద్దవి కలుపుకొని ఇంచుమించు వందకుపైగా ఉంటాయి. రాకాసి జంతువుల్లా రకరకాల రూపాల్లో గుహ లోపలి దృశ్యాలు అబ్బురపరిచాయి. చిరపుంజిలో లివింగ్ బ్రిడ్జికి పెట్టింది పేరు. వందల ఏళ్లుగా చిరపుంజీ వాసులు చెట్ల వేళ్లనే వంతెనలుగా మార్చుకొని వాడుకుంటున్నారు. ఇప్పటికీ ఉపయోగిస్తున్న పురాతన బ్రిడ్జి వయసు 500 ఏళ్లకు పైగా ఉంటుందని అంచనా! ఉత్సాహభరితం షిల్లాంగ్... ఇక్కడి గిరిజన సంస్కృతులు, డాన్ బాస్కో సెంటర్, మ్యూజియంను తప్పక సందర్శించాల్సిందే! షిల్లాంగ్ శిఖరం అత్యంత సుందరమైనది. దీనికి సంబంధించిన కథనాలు ఎన్నో ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో ప్రాచుర్యంలో ఉన్న ఓ కథ తెలిసింది. లిర్ అనే కన్య మగబిడ్డకు జన్మనిచ్చి, ఆ బిడ్డను ఒక తోటలో పాతిపెడుతుంది. కొన్ని ఏళ్ల తర్వాత అర్ధరాత్రి తలుపు దగ్గర శబ్దం రావడంతో మెలకువ వచ్చి లేచి చూస్తే ఒక అందమైన యువకుడు లోపలికి వచ్చి ‘అమ్మా భయపడవద్దు.. నాడు తోటలో పాతిపెట్టిన బిడ్డను నేనే’ అని చెప్పాడు. వెంటనే ఆమె అతనిని ‘షిల్లాంగ్’ అని ఆనందంగా పిలుస్తుంది. ‘షిల్లాంగ్’ అంటే ‘స్వతహాగా, స్వయంగా’ పెరిగిన అని అర్థం. సహజసిద్ధమైన ప్రాంతంగా అవడం వల్ల ఆ పేరు వచ్చిందని చెబుతారు. ఎలిఫెంట్ హిల్స్... షిల్లాంగ్‌లో ఎత్తై, అతి సుందరమైన మరో ప్రదేశం ఎలిఫెంట్ జలపాతం. దీనిని ఆంగ్లేయుల కాలంలో గుర్తించారు. జంతువులలో ఏనుగు ఎంత పెద్దదో జలపాతాలలో ఎలిఫెంట్ హిల్స్ అంత పెద్దది అని చెబుతారు. కొండ ఎడమభాగం ఏనుగు ఆకారంలో ఉండేదని, 1897లో భూకంపం రావడం వల్ల ఆ ఆకారం గల కొండ కొట్టుకుపోయిందని టూరిస్ట్ గైడ్ తెలిపారు. ఇక్కడ మరో ఆకర్షణీయ ప్రాంతం ‘లేడీ హైదర్ పార్క్’ తప్పక సందర్శించాల్సిన ఉద్యానవనం. సీతాకోకచిలుకలు ఎన్నో... షిల్లాంగ్‌కి 2 కిలోమీటర్ల దూరంలో, ఎలిఫెంట్ గుహలకు దాదాపు 9 కిలోమీటర్ల దూరంలో బటర్‌ఫ్లై మ్యూజియం ఉంది. షార్జా, దుబాయ్, ఒమన్, పొలస్కా, పనామా మొదలగు ప్రపంచంలో గల విభిన్న జాతుల రంగురంగుల సీతాకోక చిలుకలు ఇందులో ఉన్నాయి. జనవరి 17 న మొదలైన మా ప్రయాణం 27న ముగిసింది. పది రోజుల పాటు సాగిన ఈశాన్యభారతదేశ ప్రయాణం మదినిండా ఆనందోల్లాసాలను కలిగించింది. ఈ ప్రయాణం సరికొత్త అనుభవాన్ని మిగిల్చింది. తూర్పు స్కాట్లాండ్‌గా పిలబడే షిల్లాంగ్‌ని అత్యద్భుత పర్యాటక కేంద్రంగా చెప్పవచ్చు. విశాల మైదానాలలోనూ, పర్వతాల మీద పచ్చదనం, జలపాతాలు, మంత్రముగ్ధులను చేసే శిఖరాలు, అనేక ఆసక్తికరమైన విషయాలతో షిల్లాంగ్ పర్యాటకులకు ఆహ్వానం పలుకుతోంది.