
పౌరసత్వ సవరణ చట్టం నిరసన జ్వాలలు ఇప్పుడు మేఘాలయను చుట్టుముట్టాయి.
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం నిరసన జ్వాలలు ఇప్పుడు మేఘాలయను చుట్టుముట్టాయి. శుక్రవారం నుంచి ముగ్గురు మృత్యువాత పడగా, అనేక మంది కత్తిపోట్లకు గురయ్యారు. అనేక దుకాణాలు తగులబడ్డాయి. ఖాసి, జైంటియా ప్రాంతాల్లోని ఆరు జిల్లాలో ఇంటర్నెట్ సర్వీసులు నిలిచి పోయాయి. షిల్లాంగ్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో రాత్రిపూట కర్ఫ్యూ ఇప్పటికీ కొనసాగుతోంది.
ఆదివాసీలు ఎక్కువగా ఉన్న మేఘాలయ లాంటి రాష్ట్రాల్లో పౌరసత్వ సవరణ చట్టం వల్ల అక్రమ వలసదారులకు పౌరసత్వం లభిస్తుందని వారు భయాందోళనలకు గురవుతున్నారు. పౌరసత్వ సవరణ చట్టం వల్ల బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్ నుంచి వచ్చిన హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులకు చట్టబద్ధంగా పౌరసత్వం లభిస్తుందన్న విషయం తెల్సిందే. ఆ దేశాల నుంచి మేఘాలయతోపాటు ఈశాన్య రాష్ట్రాలకు అక్రమంగా వలసవచ్చిన వారందరికి పౌరసత్వం లభిస్తుందన్నది వారి వాదన. అయితే రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ కింద ఉన్న ఆదివాసీలకు ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని, పౌరసత్వ సవరణ చట్టం కింద ఆరవ షెడ్యూల్ పరిధిలోని ప్రాంతాలకు పూర్తి మినహాయింపు ఉందంటూ కేంద్ర ప్రభుత్వం చివరి నిమిషయంలో దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఈ రక్షణ వల్ల పెద్ద ఉపయోగం లేకపోవచ్చని మేఘాల ప్రజలు భయాందోళన లకు గురవుతున్నారు. ఆరవ షెడ్యూల్ ప్రాంతాలకు ఇతరులు ఎవరు వెళ్లాలన్న అధికారిక అనుమతి పత్రం అవసరం.
అయినప్పటికీ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మేఘాలయలోని ఖాసి విద్యార్థుల సంఘం పెద్ద ఎత్తున విధ్వంసకాండకు దిగింది. మృత్యువాత పడిన వారు కూడా విద్యార్థులే. 1960వ దశకంలో ‘బొంగాల్ ఖేదా ఉద్యమం’ కొనసాగిన మేఘాలయ ప్రజలతో పౌరసత్వ సవరణ చట్టాన్ని ఒప్పించడం చాలా కష్టం. బొంగాల్ ఖేదా ఉద్యమం సందర్భంగా వందలాది మంది ఆదివాసీయేతరులను ఇళ్ల నుంచి తరమి తరమి కొట్టారు. అప్పుడు పెద్ద ఎత్తున రక్తపాతం జరిగింది. ఈ మధ్యనే అక్కడ శాంతియుత పరిస్థితులు నెలకొనగా మళ్లీ ఇప్పుడు చిచ్చు రేగింది. నెలరోజుల్లోగా ఆదివాసీయేతరులు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లి పోవాలంటూ తాజాగా ఆదివాసీ మిలిటెంట్ సంస్థలు అల్టిమేటమ్ జారీ చేశాయి.
అస్సాంలో చాలా ప్రాంతాలు రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌కు వెలుపల ఉన్నాయి. అందుకనే అక్కడ ఈ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విధ్వంసకాండ చెలరేగింది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో కూడా ఈ చట్టానికి వ్యతిరేకంగా ఇప్పటికీ ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెల్సిందే. యూపీ, ఢిల్లీ రాష్ట్రాల్లో ముస్లింలు, హిందువులకు మధ్య చిచ్చు రగులుకోగా, ఈశాన్య రాష్ట్రాల్లో ఆదివాసీలు, ఇతరులకు మధ్య చిచ్చు రగులుతోంది. (చదవండి: అంతర్జాతీయ సమస్యగా సీఏఏ)