న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచే ప్రాజెక్టు గగన్‌యాన్‌లో ‘ఆమె’కు చోటు దక్కే అవకాశాలు దాదాపు కనుమరుగయ్యాయి. గగన్‌యాన్ ప్రాజెక్టు ద్వారా పంపే వ్యోమగాముల బృందంలో మహిళ ఉంటారని ఇస్రో చైర్మన్ శివన్ గతంలో చెప్పారు. అయితే తాజాగా భద్రతా దళాల నుంచి ఓ పైలట్‌ను పంపాలని ఇస్రో భావిస్తోందని సంస్థకు చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. అయితే భద్రతా దళాల్లో మహిళా పైలట్ ఎవరూ లేకపోవడంతో ‘ఆమె’కు అంతరిక్షంలోకి వెళ్లే అవకాశాలు దాదాపు లేవు. ఇప్పటివరకు చేపట్టిన మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష ప్రాజెక్టుల్లో పైలట్లను మాత్రమే పంపించారు. దీంతో తామూ మొట్టమొదటి ప్రాజెక్టులో పైలట్లనే పంపించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి మహిళా వ్యోమగామికి అవకాశం లేకపోయినప్పటికీ భవిష్యత్‌లో చేపట్టే మానవ సహిత యాత్రల్లో మహిళా పౌరురాలికి అవకాశం దక్కుతుందన్నారు. వచ్చే నెల కల్లా గగన్‌యాన్‌లో వెళ్లే బృందాన్ని ఖరారు చేస్తామని, ఇప్పటికే వడబోత మొదలైందన్నారు. 2022లో తొలి గగన్‌యాన్ యాత్ర చేపట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment