
లక్నో: ఉన్నావ్ అత్యాచార బాధితురాలి మృతిపై ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బాధితురాలి హత్యకు ప్రభుత్వం, పోలీసుల వైఫల్యమే కారణమంటూ విపక్షాలు, ప్రజాసంఘాలు, మహిళలు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రభుత్వం నిందితులను కాపాడుతోందంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సోషల్ మీడియా వేదికగా తన గళాన్ని వినిపించారు. బాధిత యువతి కుటుంబ సభ్యులను పలువురు పరామర్శించారు. ఈ నేపథ్యంలో వారి వద్ద ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ దేశాన్ని ఎవరూ రక్షించలేరు. మహిళలకు కనీస రక్షణ లేదు. నిందితుల చావును నా సోదరి కోరుకుంటోంది. వారిని వెంటనే శిక్షించాలి. నా సోదరిని హత్యచేసిన ఐదుగురు నిందితులు బతకడానికి అనర్హులు’ అంటూ ఉన్నావ్ బాధితురాలి సోదరుడు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. తన బిడ్డ ఆత్మ శాంతించాలంటే నిందితులను వెంటనే ఉరితీయాలని ఆమె తల్లి డిమాండ్ చేసింది. (ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతి)
కాగా ఉన్నావ్ అత్యాచార ఘటనలో బాధితురాలు శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. 90 శాతం కాలిన గాయాలతో రాత్రి 11.40 గంటల సమయంలో బాధితురాలు చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. గతేడాది డిసెంబర్‌లో మృతురాలిపై అత్యాచారం జరుగగా, విచారణ నేపథ్యంలో గురువారం కోర్టుకు వస్తున్న బాధితురాలిపై ఐదుగురు దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. చనిపోయే ముందు బాధితురాలు మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలం మేరకు.. ఈ ఘటనపై విచారణకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా ఘటనపై విచారణ జరుపుతామని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment