ఐదు కార్పోరేట్ ఆస్పత్రులకు రూ.600 కోట్ల ఫైన్
Published Sun, Jun 12 2016 8:57 AM | Last Updated on Tue, Oct 2 2018 4:26 PM
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ సర్కార్ కార్పోరేట్ ఆస్పత్రులపై కొరఢా ఝుళిపించింది. ఐదు కార్పోరేట్ దవాఖానాలపై ఏకంగా రూ.600 కోట్లు ఫైన్ విధించింది. పేదలకు వైద్యం అందించడంలో చేసిన నిర్లక్షానికి ఈఫైన్ విధిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్, మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, శాంతి ముకుంద్ హాస్పిటల్, ధర్మ శిల కాన్సర్ హాస్పిటల్, పుష్పవతి సింగానియా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లు ప్రభుత్వం దగ్గర పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తామని అన్ని సౌకర్యాలను పొంది, వారికి వైద్యం అందించడంలో విఫలమయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
ఈ ఆస్పత్రులు పేదలకు వైద్యం అందించే విషయంలో విఫలమైనందుకే రూ.600 కోట్ల ఫైన్ విధించామని, ఈ మేరకు వారికి నోటీసులు అందించామని ప్రభుత్వ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ హేమ్ ప్రకాశ్ తెలిపారు. యాజమాన్యాలు ఫైన్ చెల్లించేందుకు నెల రోజుల గడువు ఇస్తున్నామని ఆయన అన్నారు. నోటీసులు అందుకున్న యాజమాన్యాలు తమకు ఫైన్ విధించడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నాయి. ఢిల్లీలో మొత్తం 43 కార్పోరేట్ ఆస్పత్రులు ఉన్నాయి.
Advertisement