జమ్మూ : పాకిస్తాన్ మరోసారి తెగబడింది. పాక్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించి సరిహద్దు ప్రాంతంలో సోమవారం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో అయిదుగురు పౌరులు మృతి చెందగా, సుమారు 29మంది గాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్లోని ఆర్నియా సబ్ సెక్టార్లో బీఎస్ఎఫ్ జవాన్ల స్థావరాలతో పాటు సమీపంలోని జనావాసాలపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడింది.
ఈ ఘటనలో అయిదుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసు అధికారి తెలిపారు. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. క్షతగాత్రులకు సమీప ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. మృతి చెందినవారిలో తండ్రీ కూతుళ్లు ఉన్నారు. కాగా కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. మరోవైపు కాల్పులు జరుగుతున్న ప్రాంతం నుంచి గ్రామస్తులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు.