
భవనంపై నుంచి తాడు సాయంతో బాలికలు ఎస్కేప్
మాల్దా: ప్రభుత్వ మహిళా శరణార్దుల గృహం నుంచి ఐదుగురు మైనర్లు తప్పించుకున్నారు. రెండు అంతస్తుల భవనంపై నుంచి ఓ తాడు సహాయంతో పారిపోయారు. వీరిలో బంగ్లాదేశ్‌కు చెందిన యువతి కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అధికారుల వివరాల ప్రకారం మాల్దాలోని ఇంగ్లిష్ బజార్‌లో ప్రభుత్వం నడుపుతున్న మహిళల సంరక్షణ గృహం ఉంది. ఇందులో ఉమెన్ ట్రాఫికింగ్‌కు గురైనవారిని, పేదవారైన బాలికలు, మహిళలకు పునరావాసం కల్పిస్తుంటారు.
ప్రస్తుతం ఇందులో అక్రమ రవాణా నుంచి బయటపడేసిన 77మంది బాలికలను సంరక్షిస్తున్నారు. అయితే, ఇందులో నుంచి అనూహ్యంగా బుధవారం ఉదయం రెండు అంతస్తుల భవనంపై నుంచి ఒక తాడు సహాయంతో ఐదుగురు బాలికలు తప్పించుకొని వెళ్లిపోయారు. వీరంతా వారివారి ప్రాంతాలకు తరలి వెళ్లుతున్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.