bangladeshi national
-
బంగ్లాదేశ్ దొంగల ముఠా గుట్టురట్టు
గన్నవరం: బంగ్లాదేశ్‌కు చెందిన దొంగల ముఠాను కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా శుక్రవారం మీడియాకు చెప్పారు. బంగ్లాదేశ్ వాసులు ఆరుగురు ఈ నెల 5న జయంతిపూర్ బోర్డర్ వద్ద అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి రైలులో ఈ నెల 10న విజయవాడ చేరుకున్నారు. ఏటీఎంల్లో చోరీ నిమిత్తం మాచవరం డౌన్, రామ్‌గోపాల్ థియేటర్ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా బందోబస్తు ఎక్కువగా ఉండటంతో ఈ నెల 14న గోవాకు మకాం మార్చారు. అక్కడ హెచ్డీఎఫ్సీ, కెనరా బ్యాంక్ ఏటీఎంలను ఎత్తుకుపోయి రూ.15 లక్షలు దోచుకున్నారు. అక్కడి నుంచి కర్ణాటకలోని హుబ్లీ చేరుకుని బంగారం కొనుగోలు చేశారు. ఈ నెల 19న విజయవాడకు చేరుకున్నారు. 21న గన్నవరంలో పార్కింగ్ చేసి ఉన్న ట్రక్ ఆటోను అపహరించి హైవే పక్కనే ఉన్న ఎస్బీఐ ఏటీఎం సెంటర్‌కు వచ్చి ఏటీఎం చోరీకి యత్నించారు. బీట్ కానిస్టేబుల్ మణింద్రకుమార్, హోంగార్డు నాగరాజు అక్కడికి వెళ్లడంతో వారిపై దాడిచేసి పరారయ్యేందుకు యత్నించారు. మణీంద్ర ఇతర సిబ్బంది సహాయంతో ముఠాలోని నదీమ్‌ఖాన్, మహమ్మద్ జహంగీర్‌ను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.1.3 లక్షల నగదు, 32 కాసుల బంగారం, ట్రక్ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నేరస్తులు సైమన్, బాద్షా, శరణ్‌సింగ్ సుమన్, కోకోన్ ముల్లా పరారీలో ఉన్నారు. మణీంద్ర ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి ఎంబసీ అధికారులకు సమాచారమిచ్చారు. మిగిలిన వారు బంగ్లాదేశ్‌కు వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మణీంద్ర, నాగరాజు, వీరికి సహకరించిన మరో ఇద్దరు కానిస్టేబుల్స్, సీఐ శివాజీ, ఎస్ఐలు శ్రీనివాస్, రమేష్‌బాబుకు ఎస్పీ రివార్డులను అందజేశారు. ఇదీ చదవండి: 30 వేల ఎకరాల వక్ఫ్ భూములు అన్యాక్రాంతం -
రాజకీయ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ అంశాలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వానికి ఇలాంటి అంశాలను పరిశీలించడానికి తగిన అధికారం ఉందని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ మీదుగా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన రోహింగ్యాలు, బంగ్లాదేశ్ జాతీయులను సంవత్సరంలోగా గుర్తించి, నిర్భంధించి, దేశం నుంచి బహిష్కరించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ గురువారం జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ‘‘పార్లమెంట్ సభ్యుల సమస్య, నామినేషన్ సమస్య, ఎన్నికల సంస్కరణలు ఇలా ప్రపంచంలోని ఎన్నో సమస్యలు, దాంతోపాటు ఇక ప్రతిరోజూ మీ కేసును మాత్రమే వినాలి! అవి రాజకీయ అంశాలు. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి. మీరు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను(పిల్) మేము(న్యాయస్థానం) విచారణకు స్వీకరించాల్సి వస్తే.. ఇక ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నట్టు? చట్టాలు చేయడానికి రాజ్యసభ, లోక్‌సభ ఉన్నాయి’’ అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. అశ్వినీకుమార్ ఉపాధ్యాయ పిటిషన్‌కు కౌంటరు వేయాలని కేంద్రం భావిస్తే జాబితాలో చేరుస్తామని చెప్పారు. -
భవనంపై నుంచి తాడు సాయంతో బాలికలు ఎస్కేప్
మాల్దా: ప్రభుత్వ మహిళా శరణార్దుల గృహం నుంచి ఐదుగురు మైనర్లు తప్పించుకున్నారు. రెండు అంతస్తుల భవనంపై నుంచి ఓ తాడు సహాయంతో పారిపోయారు. వీరిలో బంగ్లాదేశ్‌కు చెందిన యువతి కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అధికారుల వివరాల ప్రకారం మాల్దాలోని ఇంగ్లిష్ బజార్లో ప్రభుత్వం నడుపుతున్న మహిళల సంరక్షణ గృహం ఉంది. ఇందులో ఉమెన్ ట్రాఫికింగ్‌కు గురైనవారిని, పేదవారైన బాలికలు, మహిళలకు పునరావాసం కల్పిస్తుంటారు. ప్రస్తుతం ఇందులో అక్రమ రవాణా నుంచి బయటపడేసిన 77మంది బాలికలను సంరక్షిస్తున్నారు. అయితే, ఇందులో నుంచి అనూహ్యంగా బుధవారం ఉదయం రెండు అంతస్తుల భవనంపై నుంచి ఒక తాడు సహాయంతో ఐదుగురు బాలికలు తప్పించుకొని వెళ్లిపోయారు. వీరంతా వారివారి ప్రాంతాలకు తరలి వెళ్లుతున్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.