గన్నవరం: బంగ్లాదేశ్‌కు చెందిన దొంగల ముఠాను కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా శుక్రవారం మీడియాకు చెప్పారు. బంగ్లాదేశ్ వాసులు ఆరుగురు ఈ నెల 5న జయంతిపూర్ బోర్డర్ వద్ద అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి రైలులో ఈ నెల 10న విజయవాడ చేరుకున్నారు. ఏటీఎంల్లో చోరీ నిమిత్తం మాచవరం డౌన్, రామ్‌గోపాల్ థియేటర్ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా బందోబస్తు ఎక్కువగా ఉండటంతో ఈ నెల 14న గోవాకు మకాం మార్చారు. అక్కడ హెచ్‌డీఎఫ్‌సీ, కెనరా బ్యాంక్ ఏటీఎంలను ఎత్తుకుపోయి రూ.15 లక్షలు దోచుకున్నారు. అక్కడి నుంచి కర్ణాటకలోని హుబ్లీ చేరుకుని బంగారం కొనుగోలు చేశారు.
ఈ నెల 19న విజయవాడకు చేరుకున్నారు. 21న గన్నవరంలో పార్కింగ్ చేసి ఉన్న ట్రక్ ఆటోను అపహరించి హైవే పక్కనే ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌కు వచ్చి ఏటీఎం చోరీకి యత్నించారు. బీట్ కానిస్టేబుల్ మణింద్రకుమార్, హోంగార్డు నాగరాజు అక్కడికి వెళ్లడంతో వారిపై దాడిచేసి పరారయ్యేందుకు యత్నించారు. మణీంద్ర ఇతర సిబ్బంది సహాయంతో ముఠాలోని నదీమ్‌ఖాన్, మహమ్మద్ జహంగీర్‌ను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.1.3 లక్షల నగదు, 32 కాసుల బంగారం, ట్రక్ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నేరస్తులు సైమన్, బాద్‌షా, శరణ్‌సింగ్ సుమన్, కోకోన్ ముల్లా పరారీలో ఉన్నారు. మణీంద్ర ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి ఎంబసీ అధికారులకు సమాచారమిచ్చారు. మిగిలిన వారు బంగ్లాదేశ్‌కు వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మణీంద్ర, నాగరాజు, వీరికి సహకరించిన మరో ఇద్దరు కానిస్టేబుల్స్, సీఐ శివాజీ, ఎస్‌ఐలు శ్రీనివాస్, రమేష్‌బాబుకు ఎస్పీ రివార్డులను అందజేశారు.
ఇదీ చదవండి: 30 వేల ఎకరాల వక్ఫ్ భూములు అన్యాక్రాంతం
Comments
Please login to add a commentAdd a comment