ATM theft case
-
బంగ్లాదేశ్ దొంగల ముఠా గుట్టురట్టు
గన్నవరం: బంగ్లాదేశ్‌కు చెందిన దొంగల ముఠాను కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా శుక్రవారం మీడియాకు చెప్పారు. బంగ్లాదేశ్ వాసులు ఆరుగురు ఈ నెల 5న జయంతిపూర్ బోర్డర్ వద్ద అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి రైలులో ఈ నెల 10న విజయవాడ చేరుకున్నారు. ఏటీఎంల్లో చోరీ నిమిత్తం మాచవరం డౌన్, రామ్‌గోపాల్ థియేటర్ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా బందోబస్తు ఎక్కువగా ఉండటంతో ఈ నెల 14న గోవాకు మకాం మార్చారు. అక్కడ హెచ్డీఎఫ్సీ, కెనరా బ్యాంక్ ఏటీఎంలను ఎత్తుకుపోయి రూ.15 లక్షలు దోచుకున్నారు. అక్కడి నుంచి కర్ణాటకలోని హుబ్లీ చేరుకుని బంగారం కొనుగోలు చేశారు. ఈ నెల 19న విజయవాడకు చేరుకున్నారు. 21న గన్నవరంలో పార్కింగ్ చేసి ఉన్న ట్రక్ ఆటోను అపహరించి హైవే పక్కనే ఉన్న ఎస్బీఐ ఏటీఎం సెంటర్‌కు వచ్చి ఏటీఎం చోరీకి యత్నించారు. బీట్ కానిస్టేబుల్ మణింద్రకుమార్, హోంగార్డు నాగరాజు అక్కడికి వెళ్లడంతో వారిపై దాడిచేసి పరారయ్యేందుకు యత్నించారు. మణీంద్ర ఇతర సిబ్బంది సహాయంతో ముఠాలోని నదీమ్‌ఖాన్, మహమ్మద్ జహంగీర్‌ను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.1.3 లక్షల నగదు, 32 కాసుల బంగారం, ట్రక్ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నేరస్తులు సైమన్, బాద్షా, శరణ్‌సింగ్ సుమన్, కోకోన్ ముల్లా పరారీలో ఉన్నారు. మణీంద్ర ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి ఎంబసీ అధికారులకు సమాచారమిచ్చారు. మిగిలిన వారు బంగ్లాదేశ్‌కు వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మణీంద్ర, నాగరాజు, వీరికి సహకరించిన మరో ఇద్దరు కానిస్టేబుల్స్, సీఐ శివాజీ, ఎస్ఐలు శ్రీనివాస్, రమేష్‌బాబుకు ఎస్పీ రివార్డులను అందజేశారు. ఇదీ చదవండి: 30 వేల ఎకరాల వక్ఫ్ భూములు అన్యాక్రాంతం -
బ్యాంకు ఉద్యోగి వక్రబుద్ధి.. జల్సాలు.. అడ్డదారులు.. చివరికి కటకటాలు
అతనో బ్యాంకు ఉద్యోగి. జల్సాలకు అలవాటు పడ్డాడు. వక్రబుద్ధి చూపించాడు. డబ్బు కోసం అడ్డదారులు తొక్కాడు. తాను పనిచేస్తున్న బ్యాంకుకు సంబంధించిన ఏటీఎంలో నగదు చోరీ చేయించాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కిస్తున్నాడు. శ్రీకాళహస్తి(చిత్తూరు జిల్లా): ఏటీఎంలో నగదు చోరీ చేసిన కేసులో ఐదుగురు నిందితులను ఆదివారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు శ్రీకాళహస్తి 1వ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 13న శ్రీకాళహస్తి పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న ఏటీఎంలో రూ.4.95 లక్షలు చోరీకి గురైంది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. తిరుపతి వేదాంతపురం అగ్రహారానికి చెందిన నారగంటి నరేష్(32) డీసీసీబీ బ్యాంకు అధికారిగా పనిచేస్తున్నాడు. అతను గతంలో పనిచేసిన బ్యాంకు ఏటీఎం తాళం దొంగలించి ఇంట్లో పెట్టుకున్నాడు. అలాగే ఏటీఎంల పాస్‌వర్డ్‌ను కూడా తెలుసుకున్నాడు. తాను చోరీ చేస్తే సీసీ పుటేజీల్లో దొరకిపోతానని భావించాడు. గుర్తుతెలియని వ్యక్తులతో చోరీ చేయించాలని నిర్ణయించుకుని తన స్నేహితుడైన తిరుపతి జీవకోనకు చెందిన బట్టల వినోద్(25)కు చెప్పాడు. అతను నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలానికి చెందిన కొట్టు జయసూర్య(24)కు చెప్పాడు. అతని ద్వారా నెల్లూరు జిల్లా డక్కిలి మండలం, ఆల్తూరుపాడుకు చెందిన పల్లి వంశీ(23), నెల్లూరు నగర్ బీవీనగర్‌కు చెందిన మహ్మద్ రమీజ్(23)తో ఒప్పందం చేసుకున్నారు. నరేష్, వినోద్ పథకం ప్రకారం అందరూ కలిసి 13వ తేదీ తెల్లవారుజామున శ్రీకాళహస్తి పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న డీసీసీబీ బ్యాంకు ఏటీఎం నుంచి రూ.4,95,700లు చోరీ చేశారు. అనంతరం 14వ తేదీ రాత్రి పూతలపట్టు మండలం రంగంపేట క్రాస్‌లో ఉన్న డీసీసీ బ్యాంకు ఏటీఎంలో రూ.11,49,900 చోరీ చేశారు. పోలీసులు నిందితుడైన నారగంటి నరేష్, వినోద్‌తోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. వీరు ఇప్పటి వరకు రూ.15,20,380 చోరీ చేసినట్లు అంగీకరించారు. వారి నుంచి రూ.11,49,900 నగదు, నాలుగు సెల్ఫోన్లు, ఒక కారు, బైక్ స్వా«దీనం చేసుకున్నట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు తెలిపారు. ఈ కేసును ఛేదించిన సీఐ, ఎస్ఐ, కానిస్టేబుళ్లను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ డి.విశ్వనాథ్, సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. -
ఏటీఎం కేంద్రాల్లో కొత్త తరహా దోపిడీ..
సాక్షి, విశాఖపట్నం: ఢిల్లీ కేంద్రంగా బ్యాంక్ ఏటీఎంలలో కొత్త తరహాలో దోపిడీలకు పాల్పడే ఇద్దరిని క్రైం పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఎస్బీఐ ఏటీఎం కేంద్రాల్లోనే నేరాలకు పాల్పడే ఈ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఏటీఎం తెరిచే నకిలీ తాళాలతో పాటు వారి వద్ద నుంచి 34 ఏటీఎం కార్డులు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. అసలేం జరిగిందంటే.. ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జూలై నెల 7, 8 తేదీల్లో ఏటీఎంలో రూ.1.03 లక్షలు దొంగతనం జరిగిందంటూ బిర్లా జంక్షన్ స్టేట్ బ్యాంక్ అకౌంటెంట్ గజ్జెల సూర్య భాస్కరరావు ఫిర్యాదు చేశారు. ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన క్రైం డీసీపీ సురేష్‌బాబు ఆదేశాల మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీïసీ ఫుటేజీల ఆధారంగా ఏటీఎంలో రూ.19,500, రూ.19,500, రూ.39,000 లావాదేవీలు చేస్తున్న ఇద్దరు అనుమానితులను గుర్తించారు. ఈ కేసు దర్యాప్తు చేస్తుండగా.. ఈ నెల 21న ఎవరో ఇద్దరు అనుమానితులు బ్యాంక్ ఏటీఎంలలో దోపిడీ చేస్తున్నారని విజయవాడ సైబర్ కంట్రోల్ రూం నుంచి విశాఖ క్రైం పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇది తెలుసుకున్న క్రైం పోలీసులు అదే రోజు తెల్లవారుజామున బిర్లా జంక్షన్ ఏటీఎంలో చోరీకి పాల్పడుతున్న హర్యానాకు చెందిన ఏ1–అకిబ్‌ఖాన్, ఏ–2 ముబారక్‌లు ఇద్దరు అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా.. ఈ నెల 19న విమానంలో ఢిల్లీ నుంచి విశాఖపట్నం వచ్చి, డాబాగార్డెన్స్‌లోని ఓ లాడ్జీలో దిగినట్టు అంగీకరించారు. వారిద్దరూ ఓ ఆటోమొబైల్స్‌లో స్కూటీని అద్దెకు తీసుకున్నారు. ఏటీఎం మిషన్లను తెరిచే మూడు నకిలీ తాళాలను ఉపయోగించి.. నగరంలో సెక్యూరిటీ గార్డులు లేని ఎస్బీఐ ఏటీఎంలు ఎక్కడెక్కడ ఉన్నాయోనని వెతికి నగదు దోపిడీలకు పాల్పడ్డారు. ఇలా మోసం.. హర్యానా నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడే ఈ ముఠా తమ స్నేహితుల ఎస్బీఐ ఏటీఎం కార్డులు తీసుకొస్తారు. ఏటీఎంలో కార్డు పెట్టి విత్‌డ్రా ట్రాన్జాక్షన్ మొదలు పెడతారు. నగదు బయటకు వచ్చే సమయంలో వారి వద్ద ఉన్న నకిలీ తాళాలతో ఏటీఎం మిషన్‌ను ఆపేస్తారు. అమౌంట్ డెబిట్ అయినట్టు మెసేజ్ వస్తుంది. మిషన్ ఆగిపోయిందని.. ఖాతాదారుడు నేరుగా కస్టమర్ కేర్‌కు ఫోన్ చేస్తే.. వారికి ఎర్రర్ చూపిస్తుంది. వారు సంబంధిత బ్యాంక్ మేనేజర్ని సంప్రదించాలని సూచిస్తారు. బ్యాంక్ మేనేజర్ అకౌంట్లో కూడా టెక్నికల్ ఎర్రర్ చూపిస్తుంది. ఈ నగదు నష్టమంతా సంబంధిత బ్యాంక్ మేనేజర్ అకౌంట్లోనే చూపిస్తుంది. మిషన్ నుంచి వచ్చిన నగదును నిందితులు పట్టుకుని వెళ్లిపోతారు. ఇలా ముఠాగా ఏర్పడిన సైబర్ నేరగాళ్లను పోలీసులు పట్టుకుని జైలుకు పంపారు. నిందితుల నుంచి 34 ఏటీఎం కార్డులు, రూ.76 వేలు నగదు, ఒక స్కూటీ, మూడు నకిలీ తాళాలు, రెండు స్మార్ట్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
పండుగనాడు దోపిడీ దొంగల బీభత్సం
సాక్షి, హైదరాబాద్ : నగరం పరిధిలో పండుగనాడు దొంగలు బీభత్సం సృష్టించారు. షామిర్పేట్ మండలంలోని తుర్కపల్లి రాజీవ్ రహదారి పక్కన ఉన్న ఏటీఎంలో చొరబడి డబ్బు దొంగిలించేందుకు విఫలయత్నం చేశారు. మనీస్పాట్ అనే ఓ ప్రైవేట్ ఏటీఎంను పగులగొట్టేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకపోవడంతో అక్కడి నుంచి పక్కనే ఉన్న ఓ మొబైల్ షాప్‌లోకి చొరబడ్డి దోచుకునే యత్నం చేశారు. చివరకు అక్కడ కూడా తమ ప్లాన్ వర్కవుట్ కాకపోవడంతో పరారయ్యారు. వారిని గుర్తించేందుకు ప్రస్తుతం పోలీసులు ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. షామీర్పేట్ నేర విభాగానికి చెందిన పోలీసులు ఈ కేసును విచారణకు స్వీకరించారు. -
మావోయిస్టుల ముసుగులో దోపిడీలు
ఏటీఎం చోరుల కోసం మాటేస్తే..ఎస్బీఐ ఏటీఎం మాయం కేసు.. రాష్ట్రంలోని సంచలనం రేపిన ఈ కేసు కొత్తూరు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రాత్రింబవళ్లు నిందితుల కోసం వేట సాగిస్తున్నారు. అదే రీతిలో నిశిరాత్రి వేళ గాలింపు నిర్వహిస్తున్న వారికి అనూహ్య రీతిలో ఓ ముఠా పట్టుబడింది. ఏటీఎం చోరీ కేసు వీరి పనే అయ్యుంటుందన్న ఉద్దేశంతో పట్టుబడిన ముగ్గురిని స్టేషన్‌కు తరలించి విచారణ జరిపారు. తాము వెతుకుతున్న ముఠా కాకుండా మరో దోపిడీ ముఠా తమ వలలో చిక్కిందన్న విషయం పోలీసులకు అప్పుడు గాని అర్థం కాలేదు. దాంతో కొంత నిరుత్సాహానికి గురయ్యారు. ఏటీఎం కేసు చిక్కుముడి వీడనందుకు నిరాశ పడినా.. అనూహ్యంగా మావోయిస్టుల పేరుతో దోపిడీలకు పాల్పడుతున్న ఒడిశా ముఠాను పట్టుకోగలిగామన్న ఆనందం వారిలో కనిపించింది. కొత్తూరు: మావోయిస్టులుగా చెలామణీ అవుతూ దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు నకిలీ మావోయిస్టులను శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. శనివారం తెల్లవారుజామున వీరిని అదుపులోకి తీసుకున్నట్లు కొత్తూరు ఎస్సై వి.రమేష్ విలేకరులకు తెలిపారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో స్థానిక హరిదాసు కోనేరు వద్ద పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు ద్విచక్ర వాహనంపై వె ళుతున్న ముగ్గురు తారసపడ్డారు. అనుమానంతో వారిని వెంబడించి పట్టుకున్నారు. విచారణలో వారు నకిలీ మావోయిస్టులని తేలింది. ఆ పేరుతో దోపిడీలకు పాల్పడుతున్నట్లు నిర్థారణ అయ్యింది. దాంతో మండల మెజిస్ట్రేట్ కోర్టులో శనివారం హాజరు పరిచారు. అరెస్టరుున వారిలో ఒడిశా రాష్ట్రంలోని ఉక్కంబ గ్రామానికి చెందిన రత్తాల కృష్ణారావు, బరంపురానికి చెందిన కె.త్రినాథరావు(కలియా), శ్రీకాకుళం జిల్లా భామిని మండలం గురండికి చెందిన ముడగ పోలినాయుడులు ఉన్నారన్నారు. ఈ ఏడాది జూన్‌లో రాయగడ నుంచి బత్తిలి వస్తున్న ప్రైవేట్ బస్సును బాసన్నగూడ వద్ద వీరు నిలిపివేసి మావోస్టులమని బెదిరించి సిబ్బంది నుంచి లక్ష రూపాయలు డిమాండ్ చేయగా.. రూ. 50 వేలు వసూలు చేశారని ఎస్సై చెప్పారు. అదే నెలలో గుణపూర్ సమీపంలోని ఓ గ్రామస్తుని ఇంటికి వెళ్లి మావోరుుస్టుల పేరుతో రూ.50 వేలు డిమాండ్ చేయగా సదరు వ్యక్తి రూ. 20 వేలు ఇచ్చారన్నారు. నిందితుల నుంచి ఏపీ32ఏ 5526 హీరోహోండా ద్విచక్ర వాహనం స్వాధీ నం చేసుకున్నామన్నారు. అంధ్రా, ఒడిశా రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన చోరీ కేసులతో వీరికి సంబంధాలు ఉన్నాయన్నారు. పలు పోలీసు స్టేషన్లలో వీరిపై కేసులు ఉన్నాయన్నారు. ఈ ముఠా నాయకుడు ఒడిశాలో ఉన్నారన్న సమాచారం ఉందన్నారు. ఉలిక్కిపడిన ఏజెన్సీ నకిలీ మావోయిస్టుల అరెస్టుతో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం ఉలిక్కి పడింది. ఆదివారం నుంచి ఏవోబీలో మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహిస్తున్న తరుణంలో నకిలీల అరెస్టు ఉదంతం కలకలం రేపింది. గత కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు తక్కువగానే ఉన్నప్పటికీ, వారి పేరుతో నేరగాళ్లు దోపిడీలు, చోరీలకు పాల్పడుతున్న విషయం వెలుగులోకి రావడం అలజడి రేపుతోంది. జిల్లాలో మావోయిస్టుల కదలికలు లేవని భావిస్తున్న పోలీసు అధికారులు, ఈ నకిలీ ఉదంతంతో అప్రమత్తమయ్యారు. పట్టుబడిన వారంతా ఒడిశా రాష్ట్రానికి చెందిన వారు కావడం, వారి నాయకుడు ఆ రాష్ట్రంలోనే ఉన్నాడని తెలియడంతో ఒడిశా ముఠాలు జిల్లాలోకి చొరబడ్డాయన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఈ విషయాలపై స్థానిక ఎస్ఐ వి.రమేష్ వద్ద ప్రస్తావించగా మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా కూంబింగ్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రత్యేక బలగాలు వస్తున్నాయని చెప్పారు. అనుమానిత ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశామన్నారు.