మావోయిస్టుల ముసుగులో దోపిడీలు | Maoist pursuit in exploits | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల ముసుగులో దోపిడీలు

Published Sun, Sep 21 2014 2:06 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM

మావోయిస్టుల ముసుగులో  దోపిడీలు - Sakshi

మావోయిస్టుల ముసుగులో దోపిడీలు

ఏటీఎం చోరుల కోసం మాటేస్తే..ఎస్‌బీఐ ఏటీఎం మాయం కేసు.. రాష్ట్రంలోని సంచలనం రేపిన ఈ కేసు కొత్తూరు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రాత్రింబవళ్లు నిందితుల కోసం వేట సాగిస్తున్నారు. అదే రీతిలో నిశిరాత్రి వేళ గాలింపు నిర్వహిస్తున్న వారికి అనూహ్య రీతిలో ఓ ముఠా పట్టుబడింది. ఏటీఎం చోరీ కేసు వీరి పనే అయ్యుంటుందన్న ఉద్దేశంతో పట్టుబడిన ముగ్గురిని స్టేషన్‌కు తరలించి విచారణ జరిపారు. తాము వెతుకుతున్న ముఠా కాకుండా మరో దోపిడీ ముఠా తమ వలలో చిక్కిందన్న విషయం పోలీసులకు అప్పుడు గాని అర్థం కాలేదు. దాంతో కొంత నిరుత్సాహానికి గురయ్యారు. ఏటీఎం కేసు చిక్కుముడి వీడనందుకు నిరాశ పడినా.. అనూహ్యంగా మావోయిస్టుల పేరుతో దోపిడీలకు పాల్పడుతున్న ఒడిశా ముఠాను పట్టుకోగలిగామన్న ఆనందం వారిలో కనిపించింది.
 
  కొత్తూరు: మావోయిస్టులుగా చెలామణీ అవుతూ దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు నకిలీ మావోయిస్టులను శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. శనివారం తెల్లవారుజామున వీరిని అదుపులోకి తీసుకున్నట్లు కొత్తూరు ఎస్సై వి.రమేష్ విలేకరులకు తెలిపారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో స్థానిక హరిదాసు కోనేరు వద్ద పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు ద్విచక్ర వాహనంపై వె ళుతున్న ముగ్గురు తారసపడ్డారు. అనుమానంతో వారిని వెంబడించి పట్టుకున్నారు. విచారణలో వారు నకిలీ మావోయిస్టులని తేలింది. ఆ పేరుతో దోపిడీలకు పాల్పడుతున్నట్లు నిర్థారణ అయ్యింది. దాంతో మండల మెజిస్ట్రేట్ కోర్టులో శనివారం హాజరు పరిచారు.
 
 అరెస్టరుున వారిలో ఒడిశా రాష్ట్రంలోని ఉక్కంబ గ్రామానికి చెందిన రత్తాల కృష్ణారావు, బరంపురానికి చెందిన కె.త్రినాథరావు(కలియా), శ్రీకాకుళం జిల్లా భామిని మండలం గురండికి చెందిన ముడగ పోలినాయుడులు ఉన్నారన్నారు. ఈ ఏడాది జూన్‌లో రాయగడ నుంచి బత్తిలి వస్తున్న ప్రైవేట్ బస్సును బాసన్నగూడ వద్ద వీరు నిలిపివేసి మావోస్టులమని బెదిరించి సిబ్బంది నుంచి లక్ష రూపాయలు డిమాండ్ చేయగా.. రూ. 50 వేలు వసూలు చేశారని ఎస్సై చెప్పారు. అదే నెలలో గుణపూర్ సమీపంలోని ఓ గ్రామస్తుని ఇంటికి వెళ్లి మావోరుుస్టుల పేరుతో రూ.50 వేలు డిమాండ్ చేయగా సదరు వ్యక్తి రూ. 20 వేలు ఇచ్చారన్నారు. నిందితుల నుంచి  ఏపీ32ఏ 5526 హీరోహోండా ద్విచక్ర వాహనం స్వాధీ నం చేసుకున్నామన్నారు. అంధ్రా, ఒడిశా రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన చోరీ కేసులతో వీరికి సంబంధాలు ఉన్నాయన్నారు. పలు పోలీసు స్టేషన్లలో వీరిపై కేసులు ఉన్నాయన్నారు. ఈ ముఠా నాయకుడు ఒడిశాలో ఉన్నారన్న సమాచారం ఉందన్నారు.  
 
 ఉలిక్కిపడిన ఏజెన్సీ
 నకిలీ మావోయిస్టుల అరెస్టుతో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం ఉలిక్కి పడింది. ఆదివారం నుంచి ఏవోబీలో మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహిస్తున్న తరుణంలో నకిలీల అరెస్టు ఉదంతం కలకలం రేపింది. గత కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు తక్కువగానే ఉన్నప్పటికీ, వారి పేరుతో నేరగాళ్లు దోపిడీలు, చోరీలకు పాల్పడుతున్న విషయం  వెలుగులోకి రావడం అలజడి రేపుతోంది. జిల్లాలో మావోయిస్టుల కదలికలు లేవని భావిస్తున్న పోలీసు అధికారులు, ఈ నకిలీ ఉదంతంతో అప్రమత్తమయ్యారు. పట్టుబడిన వారంతా ఒడిశా రాష్ట్రానికి చెందిన వారు కావడం, వారి నాయకుడు ఆ రాష్ట్రంలోనే ఉన్నాడని తెలియడంతో ఒడిశా ముఠాలు జిల్లాలోకి చొరబడ్డాయన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఈ విషయాలపై స్థానిక ఎస్‌ఐ వి.రమేష్ వద్ద ప్రస్తావించగా మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా కూంబింగ్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రత్యేక బలగాలు వస్తున్నాయని చెప్పారు. అనుమానిత ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశామన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement