అతనో బ్యాంకు ఉద్యోగి. జల్సాలకు అలవాటు పడ్డాడు. వక్రబుద్ధి చూపించాడు. డబ్బు కోసం అడ్డదారులు తొక్కాడు. తాను పనిచేస్తున్న బ్యాంకుకు సంబంధించిన ఏటీఎంలో నగదు చోరీ చేయించాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కిస్తున్నాడు.
శ్రీకాళహస్తి(చిత్తూరు జిల్లా): ఏటీఎంలో నగదు చోరీ చేసిన కేసులో ఐదుగురు నిందితులను ఆదివారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు శ్రీకాళహస్తి 1వ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 13న శ్రీకాళహస్తి పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న ఏటీఎంలో రూ.4.95 లక్షలు చోరీకి గురైంది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. తిరుపతి వేదాంతపురం అగ్రహారానికి చెందిన నారగంటి నరేష్(32) డీసీసీబీ బ్యాంకు అధికారిగా పనిచేస్తున్నాడు.
అతను గతంలో పనిచేసిన బ్యాంకు ఏటీఎం తాళం దొంగలించి ఇంట్లో పెట్టుకున్నాడు. అలాగే ఏటీఎంల పాస్వర్డ్‌ను కూడా తెలుసుకున్నాడు. తాను చోరీ చేస్తే సీసీ పుటేజీల్లో దొరకిపోతానని భావించాడు. గుర్తుతెలియని వ్యక్తులతో చోరీ చేయించాలని నిర్ణయించుకుని తన స్నేహితుడైన తిరుపతి జీవకోనకు చెందిన బట్టల వినోద్(25)కు చెప్పాడు. అతను నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలానికి చెందిన కొట్టు జయసూర్య(24)కు చెప్పాడు. అతని ద్వారా నెల్లూరు జిల్లా డక్కిలి మండలం, ఆల్తూరుపాడుకు చెందిన పల్లి వంశీ(23), నెల్లూరు నగర్ బీవీనగర్‌కు చెందిన మహ్మద్ రమీజ్(23)తో ఒప్పందం చేసుకున్నారు.
నరేష్, వినోద్ పథకం ప్రకారం అందరూ కలిసి 13వ తేదీ తెల్లవారుజామున శ్రీకాళహస్తి పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న డీసీసీబీ బ్యాంకు ఏటీఎం నుంచి రూ.4,95,700లు చోరీ చేశారు. అనంతరం 14వ తేదీ రాత్రి పూతలపట్టు మండలం రంగంపేట క్రాస్‌లో ఉన్న డీసీసీ బ్యాంకు ఏటీఎంలో రూ.11,49,900 చోరీ చేశారు. పోలీసులు నిందితుడైన నారగంటి నరేష్, వినోద్‌తోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. వీరు ఇప్పటి వరకు రూ.15,20,380 చోరీ చేసినట్లు అంగీకరించారు. వారి నుంచి రూ.11,49,900 నగదు, నాలుగు సెల్‌ఫోన్లు, ఒక కారు, బైక్ స్వా«దీనం చేసుకున్నట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు తెలిపారు. ఈ కేసును ఛేదించిన సీఐ, ఎస్‌ఐ, కానిస్టేబుళ్లను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ డి.విశ్వనాథ్, సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐలు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment