krishna sp
-
బంగ్లాదేశ్ దొంగల ముఠా గుట్టురట్టు
గన్నవరం: బంగ్లాదేశ్‌కు చెందిన దొంగల ముఠాను కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా శుక్రవారం మీడియాకు చెప్పారు. బంగ్లాదేశ్ వాసులు ఆరుగురు ఈ నెల 5న జయంతిపూర్ బోర్డర్ వద్ద అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి రైలులో ఈ నెల 10న విజయవాడ చేరుకున్నారు. ఏటీఎంల్లో చోరీ నిమిత్తం మాచవరం డౌన్, రామ్‌గోపాల్ థియేటర్ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా బందోబస్తు ఎక్కువగా ఉండటంతో ఈ నెల 14న గోవాకు మకాం మార్చారు. అక్కడ హెచ్డీఎఫ్సీ, కెనరా బ్యాంక్ ఏటీఎంలను ఎత్తుకుపోయి రూ.15 లక్షలు దోచుకున్నారు. అక్కడి నుంచి కర్ణాటకలోని హుబ్లీ చేరుకుని బంగారం కొనుగోలు చేశారు. ఈ నెల 19న విజయవాడకు చేరుకున్నారు. 21న గన్నవరంలో పార్కింగ్ చేసి ఉన్న ట్రక్ ఆటోను అపహరించి హైవే పక్కనే ఉన్న ఎస్బీఐ ఏటీఎం సెంటర్‌కు వచ్చి ఏటీఎం చోరీకి యత్నించారు. బీట్ కానిస్టేబుల్ మణింద్రకుమార్, హోంగార్డు నాగరాజు అక్కడికి వెళ్లడంతో వారిపై దాడిచేసి పరారయ్యేందుకు యత్నించారు. మణీంద్ర ఇతర సిబ్బంది సహాయంతో ముఠాలోని నదీమ్‌ఖాన్, మహమ్మద్ జహంగీర్‌ను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.1.3 లక్షల నగదు, 32 కాసుల బంగారం, ట్రక్ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నేరస్తులు సైమన్, బాద్షా, శరణ్‌సింగ్ సుమన్, కోకోన్ ముల్లా పరారీలో ఉన్నారు. మణీంద్ర ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి ఎంబసీ అధికారులకు సమాచారమిచ్చారు. మిగిలిన వారు బంగ్లాదేశ్‌కు వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మణీంద్ర, నాగరాజు, వీరికి సహకరించిన మరో ఇద్దరు కానిస్టేబుల్స్, సీఐ శివాజీ, ఎస్ఐలు శ్రీనివాస్, రమేష్‌బాబుకు ఎస్పీ రివార్డులను అందజేశారు. ఇదీ చదవండి: 30 వేల ఎకరాల వక్ఫ్ భూములు అన్యాక్రాంతం -
జగన్ నిర్ణయం అభినందనీయం: ఎస్పీ
సాక్షి, కృష్ణా : ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా పోలీసులకు వారాంతపు సెలవులు ఇస్తానని జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సంవత్సరంలో 365 రోజులూ కష్టపడే పోలీసులకు వారాంతపు సెలవులను ప్రకటిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు నేటి నుంచే అమలు కానున్నాయి. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. నూతన ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుంచి పోలీసు శాఖలో వారాంతపు సెలవులు అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. తొలి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా 277 మంది సెలవు తీసుకున్నారని, ఈ వీక్లీ ఆఫ్ ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ వారంతపు సెలవుల విషయంలో ఎటువంటి ఇబ్బంది రానివ్వమని, ఉన్న సిబ్బందితోనే పోలీసు సేవలను కొనసాగిస్తామని పేర్కోన్నారు. రాష్ట్రంలో పని ఒత్తిడికి గురవుతున్న పోలీసులకు వారాంతపు సెలకు కొంత ఊరటనిస్తుందని, ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని కొనియాడారు. -
సంగమ ప్రదేశంలో పటిష్ట భద్రత
కోడూరు : పవిత్ర కృష్ణా సాగరసంగమ ప్రాంతంలో భక్తులకు ఇబ్బందిలేకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తామని కృష్ణా జిల్లా ఎస్పీ విజయకుమార్ తెలిపారు. పోలీసు అధికారులతో కలిసి ఆయన సోమవారం సాగర సంగమ ప్రదేశాన్ని పరిశీలించారు. విజయవాడ తర్వాత ప్రభుత్వం సాగరసంగమ ప్రాంతాన్ని ముఖ్య ఘాట్‌గా గుర్తించిందని, భక్తులు తాకిడి కూడా ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. నది, సముద్రం కలిసే ప్రాంతంలో ఊహాకందని లోతు ఉంటుందని, ఈ ప్రాంతంలో ఏర్పాట్లు మరింత పటిష్టంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. సాగర సంగమ ప్రాంతంలో పర్యవేక్షణాధికారిగా నెల్లూరు జిల్లా అడిషనల్ ఎస్పీ శరత్‌బాబును నియమించామని, ఆయన పర్యవేక్షణలో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతోపాటు 500మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారని వివరించారు. సముద్రం కరకట్ట దగ్గర నుంచి సంగమం వరకు పూర్తిగా తమ అధీనంలో ఉంటుందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. లోతు ఆధారంగా 500 మీటర్ల మేరకు ఇనుప కడ్డీలు, మెస్లతో బారికేడ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం సంగమ ప్రదేశంలో లోతు తెలుసుకునేందుకు స్థానిక గజ ఈతగాళ్ల సహాయం తీసుకొని బారికేడ్ల ఏర్పాటుకు మార్కింగ్ ఇచ్చారు. పోటు, పాటు సమయంలో సంగమం లోతు మారుతుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని పనులు చేయాలని ఆదేశించారు. వీవీఐపీలు, వీఐపీలు సంగమ ప్రాంతానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని, సీసీ కెమారాలతో నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. పుష్కర భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నిర్మించిన కంట్రోల్ రూమ్‌లను పరిశీలించారు. అవనిగడ్డ డీఎస్పీ ఖాదర్‌బాషా, సీఐ మూర్తి, ఎస్ఐ సుధాకర్‌తోపాటు అవనిగడ్డ, నాగాయలంక, చల్లపల్లి, మోపిదేవి ఎస్ఐలు పాల్గొన్నారు.