సంగమ ప్రదేశంలో పటిష్ట భద్రత
సంగమ ప్రదేశంలో పటిష్ట భద్రత
Published Mon, Aug 1 2016 7:09 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM
కోడూరు : పవిత్ర కృష్ణా సాగరసంగమ ప్రాంతంలో భక్తులకు ఇబ్బందిలేకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తామని కృష్ణా జిల్లా ఎస్పీ విజయకుమార్ తెలిపారు. పోలీసు అధికారులతో కలిసి ఆయన సోమవారం సాగర సంగమ ప్రదేశాన్ని పరిశీలించారు. విజయవాడ తర్వాత ప్రభుత్వం సాగరసంగమ ప్రాంతాన్ని ముఖ్య ఘాట్‌గా గుర్తించిందని, భక్తులు తాకిడి కూడా ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. నది, సముద్రం కలిసే ప్రాంతంలో ఊహాకందని లోతు ఉంటుందని, ఈ ప్రాంతంలో ఏర్పాట్లు మరింత పటిష్టంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. సాగర సంగమ ప్రాంతంలో పర్యవేక్షణాధికారిగా నెల్లూరు జిల్లా అడిషనల్ ఎస్పీ శరత్‌బాబును నియమించామని, ఆయన పర్యవేక్షణలో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతోపాటు 500మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారని వివరించారు. సముద్రం కరకట్ట దగ్గర నుంచి సంగమం వరకు పూర్తిగా తమ అధీనంలో ఉంటుందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. లోతు ఆధారంగా 500 మీటర్ల మేరకు ఇనుప కడ్డీలు, మెస్‌లతో బారికేడ్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం సంగమ ప్రదేశంలో లోతు తెలుసుకునేందుకు స్థానిక గజ ఈతగాళ్ల సహాయం తీసుకొని బారికేడ్ల ఏర్పాటుకు మార్కింగ్ ఇచ్చారు. పోటు, పాటు సమయంలో సంగమం లోతు మారుతుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని పనులు చేయాలని ఆదేశించారు. వీవీఐపీలు, వీఐపీలు సంగమ ప్రాంతానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని, సీసీ కెమారాలతో నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. పుష్కర భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నిర్మించిన కంట్రోల్ రూమ్‌లను పరిశీలించారు. అవనిగడ్డ డీఎస్పీ ఖాదర్‌బాషా, సీఐ మూర్తి, ఎస్‌ఐ సుధాకర్‌తోపాటు అవనిగడ్డ, నాగాయలంక, చల్లపల్లి, మోపిదేవి ఎస్‌ఐలు పాల్గొన్నారు.
Advertisement