malda
-
మమతకు జై కొట్టిన ‘కాంగ్రెస్’ జిల్లాలు
కోల్‌కతా: కాంగ్రెస్ కుంచుకోటలుగా ఉన్న ముస్లిం ఆధిక్య జిల్లాలైన మాల్దా, ముర్షీదాబాద్‌లు ఈసారి తృణమూల్‌కు జై కొట్టాయి. ఫలితంగా మమతా బెనర్జీ అద్వితీయ విజయం సాధ్యమైంది. ఈ రెండు జిల్లాల్లో టీఎంసీకి పెద్దగా పట్టులేదు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మాల్దా జిలాల్లోని 12 సీట్లలో టీఎంసీ ఒక్క సీటూ గెలువలేదు. ముర్షీదాబాద్‌లోని 22 స్థానాల్లో కేవలం నాలుగు మాత్రమే గెలిచింది. ఈ రెండు జిల్లాల్లోని 34 స్థానాల్లో కాంగ్రెస్ ఏకంగా 21 స్థానాల్లో (మాల్దాలో 7, ముర్షీదాబాద్‌లో– 14) నెగ్గింది. 2011 ఎన్నికల్లోనూ ఈ ప్రాంతంలో కాంగ్రెసే విజయ ఢంకా మోగించింది. 2021 ఎన్నికల నాటికి పరిస్థితి తారుమారైంది. ఈ ప్రాంతంలో అనూహ్యంగా తృణమూల్ పుంజుకుంది. రెండు జిల్లాల్లోని 32 స్థానాల్లో 24 సీట్లలో టీఎంసీ విజయం సాధించింది. పోటీలో ఉన్న వారిలో ఇద్దరు అభ్యర్థులు మరణించడంతో శంషేర్‌గంజ్, జంగీపూర్ స్థానాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. 8 సీట్లలో విజయం సాధించి బీజేపీ కూడా ఈ ప్రాంతంలో గణనీయ స్థాయిలో బలపడింది. ముస్లిం జనాభా మెజారిటీగా ఉన్న ఈ ప్రాంతంలో కాంగ్రెస్, లెఫ్ట్, ఐఎస్ఎఫ్ కూటమి ఈ ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానంలోనూ విజయం సాధించకపోవడం గమనార్హం. మార్పునకు కారణమేంటి? ఈ రెండు ముస్లిం ఆధిపత్య జిల్లాలు. మాల్దాలో 51% జనాభా, ముర్షీదాబాద్‌లో 66% జనాభా ముస్లింలే. చాన్నాళ్లుగా వీరు కాంగ్రెస్‌కు గట్టి మద్దతుదారులుగా ఉన్నారు. కానీ, ఈ ఎన్నికల్లో, మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ముస్లింలు అత్యంత వ్యూహాత్మకంగా ఓట్లు వేసినట్లు స్పష్టమవుతోంది. తృణమూల్, బీజేపీ, కాంగ్రెస్ కూటమిల త్రిముఖ పోరులో, బీజేపీ వ్యతిరేక పార్టీల మధ్య తమ ఓట్లు చీలితే, అది అంతిమంగా బీజేపీకి లాభిస్తుందని వారు గుర్తించారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ నార్త్ మాల్దా స్థానంలో చోటు చేసుకున్న త్రిముఖ పోరు వల్ల బీజేపీ లాభపడిన విషయాన్ని వారు మర్చిపోలేదు. దాంతో, కీలకమైన ఈ ఎన్నికల్లో ఆ తప్పు చేయవద్దని, తృణమూల్, కాంగ్రెస్‌ల మధ్య తమ ఓట్లు చీలకూడదని నిర్ణయించుకున్నారు. మూకుమ్మడిగా తృణమూల్‌కు మద్దతిచ్చారు. మరోవైపు, కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత, వివాదాస్పద ఎన్నార్సీ, సీఏఏలను మమత గట్టిగా వ్యతిరేకించడం ముస్లింలకు ఆమెపై విశ్వాసం పెరగడానికి కారణమైంది. బీజేపీ గెలిస్తే సీఏఏ, ఎన్నార్సీలను అమలు చేస్తారన్న భయం కూడా ముస్లింలను మమతకు దగ్గర చేసింది. బీజేపీ గెలుపును అడ్డుకునేలా, ఈ రెండు జిల్లాల్లో ముస్లింల వ్యూహాత్మక ఓటింగ్ సరళి తృణమూల్ ఘనవిజయానికి బాటలు వేసింది. -
భారీ పేలుడు : ఐదుగురు దుర్మరణం
సాక్షి, కోలకతా: పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకున్నపేలుడు తీవ్ర విషాదాన్ని నింపింది. మాల్డా జిల్లాలో ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరిన రక్షక బృందాలు,అగ్నిమాపక బృందాలు, సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ఉదయం 11 గంటల సమయంలో సుజాపూర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. పరిస్థితిని అదుపు చేసేందుకు భారీ పోలీసు బృందాలను పంపించామన్నారు. అగ్నిమాపక శకటాలు మంటలను అరికట్టడానికి ప్రయత్నిస్తున్నాయనీ, ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతోందని ఆయన చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తక్షణమే స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ .2 లక్షలు, గాయపడిన వారికి రూ .50 లక్షలు ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వ కార్యదర్శి అలపన్ బండి యోపాధ్యాయ ప్రకటించారు. పట్టణ అభివృద్ధి శాఖా మంత్రి సంఘటనా స్థలాన్ని సందర్శించనున్నారని తెలిపారు. -
మాల్దా రైల్వే స్టేషన్లో బాంబు కలకం
-
భవనంపై నుంచి తాడు సాయంతో బాలికలు ఎస్కేప్
మాల్దా: ప్రభుత్వ మహిళా శరణార్దుల గృహం నుంచి ఐదుగురు మైనర్లు తప్పించుకున్నారు. రెండు అంతస్తుల భవనంపై నుంచి ఓ తాడు సహాయంతో పారిపోయారు. వీరిలో బంగ్లాదేశ్‌కు చెందిన యువతి కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అధికారుల వివరాల ప్రకారం మాల్దాలోని ఇంగ్లిష్ బజార్లో ప్రభుత్వం నడుపుతున్న మహిళల సంరక్షణ గృహం ఉంది. ఇందులో ఉమెన్ ట్రాఫికింగ్‌కు గురైనవారిని, పేదవారైన బాలికలు, మహిళలకు పునరావాసం కల్పిస్తుంటారు. ప్రస్తుతం ఇందులో అక్రమ రవాణా నుంచి బయటపడేసిన 77మంది బాలికలను సంరక్షిస్తున్నారు. అయితే, ఇందులో నుంచి అనూహ్యంగా బుధవారం ఉదయం రెండు అంతస్తుల భవనంపై నుంచి ఒక తాడు సహాయంతో ఐదుగురు బాలికలు తప్పించుకొని వెళ్లిపోయారు. వీరంతా వారివారి ప్రాంతాలకు తరలి వెళ్లుతున్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. -
నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం
మాల్దా: నకిలీ కరెన్సీ సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు రూ. 3.80 లక్షల దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్న ఘటన పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో చోటుచేసుకుంది. కలియచక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ కరెన్సీకి సంబంధించిన విశ్వసనీయ సమాచారం మేరకు బార్డర్ సెక్యురిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్), స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడి చేసి ఈ నకిలీ కరెన్సీని సీజ్ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ నోట్లు వారి వద్దకు ఎలా వచ్చాయన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇటీవల అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీసులు వలపన్ని అదుపులోకి తీసుకున్న దొంగనోట్లు చలామని చేసే ముఠా మూలాలు పశ్చిమ బెంగాల్ లో ఉన్నట్లు గుర్తించిన విషయం తెలిసిందే. -
బాంబులు పేలి ఆరుగురి మృతి
బెంగాల్లో ఘటన మాల్దా: పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో బాంబుల్ని నిర్వీర్యం చేస్తుండగా అవి పేలి సోమవారం ఇద్దరు సీఐడీ అధికారులు మరణించారు. అంతకుముందు అక్కడే బాంబు పేలి నలుగురు మృతిచెందారు. మే 5న చివరి దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. మాల్దా జిల్లా జౌన్పూర్ గ్రామంలో గైసు షేక్ ఇంట్లో ఆదివారం అర్ధరాత్రి సమయంలో బాంబులు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో ఒకరు సంఘటన స్థలంలో, ముగ్గురు ఆస్పత్రిలో మరణించారు. ఆ గ్రామంలో మరో రెండు బాంబుల్ని కనుగొనడంతో సీఐడీకి చెందిన బాంబు నిర్వీర్వ బృందానికి సమాచారమిచ్చారు. వాటిని నిర్వీరం చేస్తుండగా పేలడంతో విశుద్దానంద మిశ్రా, సుబ్రతా చౌదరి అనే ఇద్దరు సీఐడీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. -
కేంద్ర మంత్రి సభకు సమీపంలో బాంబు కలకలం
మాల్దా: పశ్చిమ బెంగాల్ లో మాల్దా పట్టణంలోని పోస్టాఫీసుకు సమీపంలో బాంబు ఉందనే వదంతులు వ్యాపించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శుక్రవారం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొనాల్సిన సభకు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాంబ్ స్క్వాడ్ బృందం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న తనిఖీలు చేపట్టింది. అక్కడున్న అనుమానిత బ్యాగును స్వాధీనం చేసుకొని ల్యాబ్ కు తరలించారు. ఇటీవల కాలంలో మాల్దాకు సమీపంలో ఉన్న కాలియాచాక్ లో100 మంది పోలీసుస్టేషన్ పైదాడి చేసిన ఘటనలో అనేక మంది గాయపడ్డారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. -
గడ్కరీకి షాక్ ఇచ్చిన బెంగాల్ సర్కార్
కోల్ కతా: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెంగాల్ సర్కార్ షాక్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ లో అల్లర్లు చోటుచేసుకున్న మాల్దా జిల్లాలోని కాళియచాక్ ప్రాంతంలో పర్యటించేందుకు నితిన్ గడ్కరీని అనుమతించలేదు. ఇప్పటికే బీజేపీకి చెందిన ముగ్గురు సభ్యుల బృందం ఇక్కడ పర్యటించేందుకు విఫలయత్నం చేసింది. తాజాగా గడ్కరీకి స్థానిక అధికార యంత్రాంగం అనుమతి నిరాకరించింది. ఈ నెల 18న నిర్వహించనున్న ర్యాలీలో పాల్గొనేందుకు గడ్కరీ అనుమతి కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే అనుమానంతో జిల్లా అధికారులు అనుమతి ఇవ్వలేదు. అయితే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ నెల 21న కాళియచాక్ లో జరగనున్న ర్యాలీలో పాల్గొననుండడం విశేషం. ఇక్కడ అనుమతించకపోవడంతో దక్షిణ దినాజ్ పూర్ లో ర్యాలీ నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. -
'స్టేషన్లో మూడు గంటలు కూర్చోబెట్టి రైలెక్కించారు'
-
'స్టేషన్లో మూడు గంటలు కూర్చోబెట్టి రైలెక్కించారు'
మాల్దా: మాల్దాలో జరిగిన మతపరమైన ఘర్షణలకు సంబంధించి పరిశీలనలు జరిపేందుకు బయలుదేరిన నిజనిర్ధారణ కమిటీని మాల్దా రైల్వే స్టేషన్లో జిల్లా అధికారులు అడ్డుకున్నారు. వారిని అక్కడే నిలిపి ఉంచారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో డిసెంబర్ 3న రెండు వర్గాల మధ్య మతపరమైన ఘర్షణలు తలెత్తిన విషయం తెలిసిందే. ఇవి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మధ్య చిచ్చుపెట్టాయి. ఈ రెండు పార్టీలు ఒకరినొకరు నిందించుకోవడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అసలు ఈ ఘర్షణల వెనుక నిజనిజాలను నిగ్గు తేల్చాలని బీజేపీ ముగ్గురు వ్యక్తులతో కూడిన నిజనిర్దారణ కమిటీ వేసింది. ఇందులో ఎంపీలు భూపేంద్రయాదవ్, రామ్ విలాస్ వేదాంతి, ఎస్ఎస్ అహ్లువాలియా ఉన్నారు. వీరు ముగ్గురు కలిసి సోమవారం ఉదయం గౌర్ ఎక్స్ ప్రెస్ లో మల్దాకు వచ్చారు. అక్కడి నుంచి ఘటన చోటుచేసుకున్న కాలియాచాక్ వెళ్లాలనుకున్నారు. కానీ, పోలీసులు, స్థానికులు వారిని వెనక్కి వెళ్లాలని చెప్పారు. స్టేషన్ లోని వీఐపీ లాంజ్ లో కూర్చుని మూడు గంటలపాటు వారితో చర్చించారు. ప్రస్తుతం కాలియాచక్ లో 144 సెక్షన్ ఉందని, అక్కడికి ఎవరినీ అనుమతించబోమని పోలీసులు తెలిపారు. అనంతరం వారిని హౌరాకు చెందిన శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో తిరిగి బలవంతంగా వెనక్కి పంపించారు. దీనిపట్ల ఎంపీ భూపేంద్ర యాదవ్ స్పందిస్తూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నియంతృత్వ పోకడలు అనుసరిస్తోందని, ఉద్దేశ పూర్వకంగా తమను వెనక్కి పంపించారని మండిపడ్డారు. -
అమ్మాయిల దుస్తులు బిగుతుగా ఉన్నాయని..
ఔట్‌డోర్ గేమ్స్‌లో అమ్మాయిల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహించాలనుకున్నారు.. ఏర్పాట్లన్నీ పూర్తయిన తర్వాత ఉపద్రవం తలెత్తుతుందేమోనని భయపడి ఆ మ్యాచ్‌ను రద్దు చేశారు. అయితే ఉపద్రవమంటే తుఫానో, సునామీనో కాదు.. ఆ మ్యాచ్‌లో మహిళా క్రీడాకారిణుల కోసం సిద్ధం చేసిన దుస్తులు బిగుతుగా ఉండటం! తాలిబన్ పాలనను, ఐఎస్ దుశ్యర్యల్ని తలపించేలా పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. మల్దా జిల్లాలోని చండీపూర్‌లో స్థానిక క్లబ్ గోల్డెన్ జూబ్లీ(50 ఏళ్ల) వేడుకల్లో భాగంగా కోల్‌కతా, ఉత్తర బెంగాల్ మహిళా ఫుట్‌బాల్ జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించాలనుకున్నారు. తీరా మ్యాచ్ ప్రారంభానికి ముందు రోజు అమ్మాయిల దుస్తులు బిగుతుగా ఉన్నాయని, వాటిని ధరించి ఆడితే పురుషుల్ని రెచ్చగొట్టినట్టవుతుందని నిర్వాహకులు ఏకంగా మ్యాచ్ నే రద్దు చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ వ్యవహారంపై క్రీడాభిమానులు మండిపడుతున్నారు. 'నిర్వాహకుల తీరు ఆక్షేపణీయం. వాళ్లని అలాగే వదిలేస్తే సానియా మీర్జా కాళ్ల నిండుగా ప్యాంటు ధరించి టెన్నిస్ ఆడాలని డిమాండ్ చేసేలా ఉన్నారు' అని భారత ఫుట్‌బాల్ టీమ్‌కు ప్రాతినిథ్యం వహించిన మాజీ క్రీడాకారుడొకరు వ్యాఖ్యానించారు. కొన్ని రాజకీయ పక్షాలు సైతం దీనిపై నిరసనను తెలపగా, అధికార తృణమూల్ కాంగ్రెస్ మంత్రి సావిత్రి మిశ్రా మాత్రం దుస్తుల కారణంగా మ్యాచ్ రద్దును సమర్థించారు. మత ఘర్షణలు తలెత్తే అవకాశం ఉన్నందునే మ్యాచ్ నిలిచిపోయిందని బ్లాక్ డెవలప్మెట్ అధికారులు చెప్పారు. మతపరంగా తనపై చర్యలు తీసుకుంటామని కొందరు వ్యక్తులు హెచ్చరించడంవల్లే మ్యాచ్‌ను రద్దుచేసినట్లు ప్రధాన నిర్వాహకుడు రేజా రజీర్ పేర్కొన్నారు. -
సహచరులపై సైనికుడు కాల్పులు: ఒకరు మృతి
కొల్కతా: పశ్చిమ బెంగాల్ మాల్డాలోని బీఎస్ఎఫ్ సైనిక శిబిరంలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. శిబిరంలోని ఓ సైనికుడు తన వద్దనున్న తుపాకీతో సహచరులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఒకరు రక్తపు మడుగులో కుప్పకూలి మరణించాడు. ఈ ఘటనలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని... విచారిస్తున్నారు. క్షతగాత్రులను మాల్డాలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బెంగాల్లో పదేళ్ల బాలికపై అత్యాచారం
పెళ్లికి వెళ్లి తిరిగొస్తున్న పదేళ్ల బాలికపై పశ్చిమ బెంగాల్‌లోని మాల్డాలో ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఓ కూలీ కుమార్తె అయిన బాధితురాలు తన నాయనమ్మ ఊళ్లో పెళ్లి జరుగుతుండటంతో అక్కడకి వెళ్లి, తిరిగి ఒంటరిగా వస్తున్న సమయంలో ఈ దారుణం జరిగిందని అదనపు ఎస్పీ అభిషేక్ మోడీ తెలిపారు. స్పృహలేకుండా పడి ఉన్న ఆమెను గ్రామస్థులు గమనించి, వెంటనే బుల్బుచాడీ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడినుంచి మాల్డా వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆమెపై అత్యాచారం జరిగిన విషయాన్ని వైద్యులు నిర్ధారించారు. ఈ కేసులో ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు మోడీ చెప్పారు. -
వింతవ్యాధితో 9 శిశువుల మృతి
పశ్చిమ బెంగాల్ లో గుర్తుతెలియని వ్యాధి తొమ్మిది మంది పసిపిల్లల ప్రాణాలను హరించేసింది. మాల్దా జిల్లాలో ఉన్నట్టుండి వాంతులు, జ్వరం, వంకర్లు తిరిగిపోవడం వంటి లక్షణాలలో బాధపడుతున్న పిల్లలను ఆస్పత్రిలో చేర్చిన కొద్ది సేపటికే వారు చనిపోయారు. చనిపోయిన వారంతా ఒకటి నుంచి ఆరేళ్ల లోపు వయసున్న వారే. వీరంతా మాల్దా జిల్లాలోని కాలియాచక్ బ్లాక్ కి చెందిన వారు. 'ముందుగా జ్వరంతో మొదలై ఆ తరువాత పరిస్థితి విషమిస్తోంది. మేం చేయగలిగిందంతా చేస్తున్నాం. ఇప్పటికి తొమ్మది మంది చనిపోయారు.' అన్నారు మాల్డా మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్. కోల్ కతా నుంచి నిపుణుల వైద్య బృందం పరీక్షల నిమిత్తం మాల్దాకు చేరుకుంది. -
కారును ఢీకొన్న ట్రక్కు. 16 మంది మృతి
వేగంగా వస్తున్న లారీ, ఓ కారును ఢీకొనడంతో 16 మంది మరణించగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం పశ్చిమబెంగాల్లోని మాల్డా సమీపంలో గల కలౌడిఘి వద్ద 34వ నెంబరు జాతీయరహదారిపై సంభవించింది. ఉదయం 7.30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో 15 మంది పురుషులు, ఓ బిడ్డ మరణించారు. 13 మంది అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు మాల్డా వైద్య కళాశాల ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత మరణించినట్లు అధికారులు తెలిపారు. బాధితులంతా మాల్డా పట్టణ సమీపంలోని సహాపూర్లో ఓ పెళ్లికి హాజరై, అక్కడి నుంచి ఉత్తర దీనాజ్‌పూర్ జిల్లాలోని రాయ్‌గంజ్ ప్రాంతంలోని తమ ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు. ఈ ప్రమాదం సంభవించిన తర్వాత జాతీయ రహదారిని మూసేశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు వెళ్లారు. -
అత్యాచారం చేసి.. గొంతుకోసిన దుర్మార్గుడు
పశ్చిమబెంగాల్లో దారుణం జరిగింది. ఓ యువకుడు టీనేజి యువతిపై అత్యాచారం చేసి, తర్వాత ఆమె గొంతుకోసేశాడు!! మాల్డా జిల్లాలోని ఇంగ్లీష్ బజార్ ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. అభయ్ మోండల్ (27) అనే వ్యక్తి సైకిల్ కొనిస్తానని చెప్పి ఓ అమ్మాయిని ఆమె ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఆమెను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి, అక్కడ అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోసేశాడు. దాంతో ఆమెకు తీవ్రంగా రక్తస్రావం అయ్యి, ఆమె స్పృహ కోల్పోయింది. తర్వాత ఎలాగోలా రోడ్డుమీదకు వచ్చి ఓ టీస్టాల్ వద్దకు చేరుకుంది. ఆమెను చూసిన స్థానికులు వెంటనే మాల్డా మెడికల్ కాలేజికి తరలించారు. జిల్లా ఎస్పీ కళ్యాణ్ ముఖర్జీ, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కృష్ణేందు నారాయణ్ చౌదరి వెంటనే ఆస్పత్రికి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. మోండల్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.