కోల్‌కతా: కాంగ్రెస్ కుంచుకోటలుగా ఉన్న ముస్లిం ఆధిక్య జిల్లాలైన మాల్దా, ముర్షీదాబాద్‌లు ఈసారి తృణమూల్‌కు జై కొట్టాయి. ఫలితంగా మమతా బెనర్జీ అద్వితీయ విజయం సాధ్యమైంది. ఈ రెండు జిల్లాల్లో టీఎంసీకి పెద్దగా పట్టులేదు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మాల్దా జిలాల్లోని 12 సీట్లలో టీఎంసీ ఒక్క సీటూ గెలువలేదు. ముర్షీదాబాద్‌లోని 22 స్థానాల్లో కేవలం నాలుగు మాత్రమే గెలిచింది. ఈ రెండు జిల్లాల్లోని 34 స్థానాల్లో కాంగ్రెస్ ఏకంగా 21 స్థానాల్లో (మాల్దాలో 7, ముర్షీదాబాద్‌లో– 14) నెగ్గింది.
2011 ఎన్నికల్లోనూ ఈ ప్రాంతంలో కాంగ్రెసే విజయ ఢంకా మోగించింది. 2021 ఎన్నికల నాటికి పరిస్థితి తారుమారైంది. ఈ ప్రాంతంలో అనూహ్యంగా తృణమూల్ పుంజుకుంది. రెండు జిల్లాల్లోని 32 స్థానాల్లో 24 సీట్లలో టీఎంసీ విజయం సాధించింది. పోటీలో ఉన్న వారిలో ఇద్దరు అభ్యర్థులు మరణించడంతో శంషేర్‌గంజ్, జంగీపూర్ స్థానాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. 8 సీట్లలో విజయం సాధించి బీజేపీ కూడా ఈ ప్రాంతంలో గణనీయ స్థాయిలో బలపడింది. ముస్లిం జనాభా మెజారిటీగా ఉన్న ఈ ప్రాంతంలో కాంగ్రెస్, లెఫ్ట్, ఐఎస్‌ఎఫ్ కూటమి ఈ ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానంలోనూ విజయం సాధించకపోవడం గమనార్హం.
మార్పునకు కారణమేంటి?
ఈ రెండు ముస్లిం ఆధిపత్య జిల్లాలు. మాల్దాలో 51% జనాభా, ముర్షీదాబాద్‌లో 66% జనాభా ముస్లింలే. చాన్నాళ్లుగా వీరు కాంగ్రెస్‌కు గట్టి మద్దతుదారులుగా ఉన్నారు. కానీ, ఈ ఎన్నికల్లో, మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ముస్లింలు అత్యంత వ్యూహాత్మకంగా ఓట్లు వేసినట్లు స్పష్టమవుతోంది. తృణమూల్, బీజేపీ, కాంగ్రెస్ కూటమిల త్రిముఖ పోరులో, బీజేపీ వ్యతిరేక పార్టీల మధ్య తమ ఓట్లు చీలితే, అది అంతిమంగా బీజేపీకి లాభిస్తుందని వారు గుర్తించారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ నార్త్ మాల్దా స్థానంలో చోటు చేసుకున్న త్రిముఖ పోరు వల్ల బీజేపీ లాభపడిన విషయాన్ని వారు మర్చిపోలేదు.
దాంతో, కీలకమైన ఈ ఎన్నికల్లో ఆ తప్పు చేయవద్దని, తృణమూల్, కాంగ్రెస్‌ల మధ్య తమ ఓట్లు చీలకూడదని నిర్ణయించుకున్నారు. మూకుమ్మడిగా తృణమూల్‌కు మద్దతిచ్చారు. మరోవైపు, కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత, వివాదాస్పద ఎన్నార్సీ, సీఏఏలను మమత గట్టిగా వ్యతిరేకించడం ముస్లింలకు ఆమెపై విశ్వాసం పెరగడానికి కారణమైంది. బీజేపీ గెలిస్తే సీఏఏ, ఎన్నార్సీలను అమలు చేస్తారన్న భయం కూడా ముస్లింలను మమతకు దగ్గర చేసింది. బీజేపీ గెలుపును అడ్డుకునేలా, ఈ రెండు జిల్లాల్లో ముస్లింల వ్యూహాత్మక ఓటింగ్ సరళి తృణమూల్ ఘనవిజయానికి బాటలు వేసింది.
మమతకు జై కొట్టిన ‘కాంగ్రెస్’ జిల్లాలు
Published Mon, May 3 2021 6:30 AM | Last Updated on Mon, May 3 2021 12:44 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment