
కేజ్రీవాల్ పాంచ్ సాల్...
*'చలో మోడీకే సాథ్'.. ఢిల్లీలో ఎక్కడ చూసినా ఇవే పోస్టర్లు.
*'కేజ్రీవాల్ పాంచ్ సాల్'.... వాడవాడలా మార్మోగిన పాట
ఈ రెండింటి మధ్య పోరులో విజయం ఎవరిదనే ఉత్కంఠతకు తెరపడింది. మోడీ వెంట నడవటానికి ఢిల్లీ ప్రజలు ఇష్టపడలేదు. ఎపుడెలా వ్యవహరిస్తారో అంతు చిక్కని సాంప్రదాయ రాజకీయ వ్యూహాలకు భిన్నంగా ఎత్తుగడలు వేసే మాజీ ఐఆర్ఎస్ అధికారి వెనకే ఢిల్లీ ఓటర్లు కలిసికట్టుగా నడిచారు. ఎగ్జిట్ పోల్స్ కాదు.. ఎగ్జాక్ట్ రిజల్ట్ కోసం వేచి చూడండని గంభీరాలు పలికిన వెంకయ్యనాయుడు లాంటి రాజకీయ ఉద్ధండుల అంచనాలని తలకిందులు చేశారు. దేశ రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడికి నాంది పలికారు. వాస్తవానికి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇంతటి ఏకపక్ష ఫలితాలను ఊహించి ఉండదు. ఒక సునామీ లాగా ఆప్.. బీజేపీని, కాంగ్రెస్ ని తుడిచిపెట్టేసింది. బీజేపీకి కనీసం ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కలేదంటే 'ఆప్'ను ఓటర్లు ఎంతగా విశ్వసించారో అర్థమవుతోంది.
కనీసం ఒక్క స్థానం కూడా దక్కించుకోని దుస్థితి కాంగ్రెస్ పార్టీది. "నరేంద్రమోదీని కేజ్రీవాల్ నిలువరించారు. అది మాకు సంతోషం" అని కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యానించడం 129 ఏళ్ల జాతీయ పార్టీ భావ దారిద్ర్యానికి అద్దం పడుతుంది. ఆత్మ విమర్శ చేసుకోవడానికి కూడా ఆ పార్టీకి ఏమీ మిగలలేదు. అటు ఫలితాలు వెలువడుతుండగానే కాంగ్రెస్ శ్రేణులు "ప్రియాంక కో లావో.. కాంగ్రెస్ బచావో' పల్లవిని ఎత్తుకున్నాయి. వరుస దెబ్బలు తింటున్న కాంగ్రెస్ పార్టీకి ఇది చావు దెబ్బ. " ఏ ఫైనల్ నెయిల్ ఇన్ ది కాఫిన్" అనుకోవచ్చు.
తప్పంతా కిరణ్ బేడీదేనా?
కిరణ్ బేడీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసి బీజేపీ తప్పు చేసిందా ? ఏ రాజకీయ వ్యవస్థపై ఉద్యోగంలో ఉన్నపుడు, పదవీ విరమణ చేసిన తరువాత కిరణ్ బేడి పోరాటం చేశారో.. ఆ రాజకీయ వ్యవస్థలో అదీ ఒక సాంప్రదాయ రాజకీయ పార్టీలో చేరడం.. అందరు రాజకీయ నాయకులలాగే ఉపన్యాసాలు ఇవ్వడం ఢిల్లీ ఓటర్లు జీర్ణించుకున్నట్టులేదు. కిరణ్ బేడీ బీజేపీలోకి అన్న ఈ ప్రశ్న యువకుల్లో, మధ్య తరగతి ప్రజానీకంలో తలెత్తడం బీజేపీకి ప్రతికూలంగా పరిణమించింది. దానికి తోడు బీజేపీలో కిరణ్బేడికి సహాయ నిరాకరణ, అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీని దారుణంగా దెబ్బతీసాయి. మనోజ్ తివారీ లాంటి నాయకులు పార్టీ నాయకత్వంపై మొదట్లోనే బహిరంగంగా విమర్శలు చేశారు.
ఇలాంటి గొంతుకలను పార్టీ అధినాయికత్వం అణిచివేసినప్పటికీ ఓటర్ల నిర్ణయాన్ని మార్చలేకపోయింది. వెరసి 2014 మే నుండి అప్రతిహతంగా సాగుతున్న మోదీ జైత్ర యాత్రకు బ్రేక్ పడింది. ఏం జరిగింది? ఎందుకిలా అయింది? పొరపాట్లు ఎక్కడ జరిగాయి. లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు లోక్సభ నియోజకవర్గాల్లో విజయం సాధించిన పార్టీ తొమ్మిది నెలల్లోనే ఎందుకిలా చావుదెబ్బ తింది. ఇవన్నీ అమిత్ షా ముందున్న ప్రశ్నలు. అమిత్ షా చాణుక్యం ఏమైంది? సామాన్య మానవుడి సంకల్పం ముందు ఎందుకు తలవంచాల్సి వచ్చింది. తప్పు ఒక్క కిరణ్ బేడీదా? లేక ప్రజల నాడిని పూర్తిగా పట్టుకోలేకపోయిన కాషాయ దళపతులదా? కొద్ది రోజుల పాటు కాషాయ పతాకధారుల గొంతుల్లో కషాయంలాగ మిలిగిపోయే ప్రశ్నలే...
ఇంత భారీ విజయం టీం కేజ్రీవాల్కు ఆనందాన్ని కలిగించేదే? సందేహం లేదు. ఇది సామాన్యుడి విజయమే. అయితే ఈ భారీ విజయం పజలపై కేజ్రీవాల్పై ప్రజలకున్న భారీ అంచనాలను కూడా తేటతెల్లం చేసింది. పక్కా ఇళ్ల నుండి అవినీతి రహిత పాలన వరకు ప్రజల్లో అంచనాలు భారీగా ఉంటాయి. ప్రతి క్షణం ప్రతి కదలికను ప్రతి అడుగును ప్రజలు గమనిస్తూనే .. ఈ అడుగులు మార్పు దిశగా ఉండాలని కోరుకుంటారు. కేజ్రీవాల్తో పాటు ఆయన మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, అధికారులు పరుగులు తీయాలని తమ సమస్యలు తీర్చాలని ఆశపడతారు. ఎనభైయవ దశకంలో అస్సాం గణ పరిషత్ ఇలాంటి విజయాన్నే నడుచుకోవడంలో పూర్తిగా విజయం పొందలేదు.
కేవలం 48 రోజుల పాలన అనంతరం 2013లో కొన్ని కారణాలు చూపించి కేజ్రీవాల్ బాధ్యతల నుండి తప్పుకున్నారు. ఢిల్లీ ఓటర్లు ఆ తప్పును పూర్తిగా క్షమించి ఏకపక్ష విజయాన్ని కేజ్రీవాల్కు అందించారు. ఈసారి తప్పించుకోవడానికి, మధ్యలో వదిలిపెట్టి వెళ్ళడానికి వీలులేకుండా అన్నిదారులు మూసేసి "కేజ్రీవాల్ పాంచ్ సాల్'' అన్నారు. ఈ అయిదు సంవత్సరాలు ప్రజల ఆకాంక్షల్ని తీర్చగలిగితే భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నవ శకానికి నాంది పలికిన వ్యక్తి అవుతారు కేజ్రీవాల్...లేకపోతే ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీల పుట్టుకే ప్రశ్నార్థకమవుతుంది.
-ఎస్. గోపినాథ్ రెడ్డి