రన్వే మీద గేదెను ఢీకొన్న విమానం
గుజరాత్లోని సూరత్ నగరంలో ఓ స్పైస్ జెట్ విమానం 140 మంది ప్రయాణికులతో బయల్దేరింది. అది ప్రయాణం మొదలుపెట్టి రెండు నిమిషాలు కూడా అయ్యిందో లేదో గానీ.. ఉన్నట్టుండి ఆగిపోయింది. ఆగడానికి ముందు ఒక్కసారిగా ప్రయాణికులంతా చిన్నపాటి కుదుపునకు కూడా లోనయ్యారు. ఏం జరిగిందా అని చూస్తే.. రన్వే మీదకు వచ్చిన గేదె ఒకదాన్ని ఆ విమానం ఢీకొంది. విమానశ్రయం ప్రహరీ కొంతమేర పడిపోవడంతో.. ఆ ఖాళీ లోంచి గడ్డి మేయడం కోసం ఆ గేదె వచ్చేసినట్లు తెలిసింది. గేదెను ఢీకొనడంతో బోయింగ్ 737 విమానం ఇంజన్ బాగా పాడైపోయింది, అటు గేదె కూడా చనిపోయింది.
ఈ వ్యవహారంతో ఒక్కసారిగా అప్రమత్తమైన పౌర విమానయాన మంత్రిత్వశాఖ మొత్తం దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో భద్రత గురించి సమీక్షించాలని ఆదేశించింది. సూరత్ విమానాశ్రయం సమీపంలో పొలాలు ఉండటంతో అక్కడ గేదెలు తిరగడం సర్వసాధారణం. అయితే అలా వచ్చిన గేదెల్లో ఒకటి అనుకోకుండా రన్వే మీదకు వచ్చేసిందని అధికారులు చెబుతున్నారు. పైలట్ కూడా ఉన్నట్టుండి ఆ గేదెను చూడటంతో విమానం ఆపేలోపే దాన్ని ఢీకొట్టారు. కొన్ని సెకండ్లు ఆగి ఉంటే విమానం గాల్లోకి ఎగిరిపోయేదని, కానీ ఈలోపే ఈ దుర్ఘటన జరిగిందని ఓ ప్రయాణికుడు చెప్పారు.