మీడియాకు చిక్కిన ఏక్నాథ్ షిండే.. పరుగే పరుగు!
ముంబై: మహారాష్ట్రలోని సంకీర్ణ సర్కారును కూలదోయడానికి ప్రయత్నిస్తున్న శివసేన పార్టీ కీలక నేత, రాష్ట్ర పట్టణాభివృద్ధి మంత్రి ఏక్నాథ్ షిండే (58) మీడియా కంటపడ్డారు. గుజరాత్‌లోని సూరత్ విమానాశ్రయంలో ఆయన మీడియాకు చిక్కారు.
తమ మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి అసోంలోని గువాహటికి వెళుతుండగా వారిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారు. గుజరాత్ పోలీసులు, కేంద్ర బలగాలు వారికి రక్షణగా నిలిచాయి. ఏక్నాథ్ షిండేతో సహా ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు విలేకరులు విఫలయత్నం చేశారు. మీడియాను తప్పించుకునేందుకు కొంతమంది ఎమ్మెల్యేలు పరుగందుకున్నారు. అయితే తమకు మెజారిటీ ఉందని ఒక ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం గమనార్హం.
కాగా, శివసేన ఎమ్మెల్యేలను గొర్రెల మందను తరలించినట్టుగా సూరత్ విమానాశ్రయం నుంచి గుజరాత్ పోలీసులు తరలించారని ప్రముఖ న్యాయవాది, హక్కుల కార్యకర్త ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు. ఎన్డీటీవీ ట్వీట్ చేసిన వీడియోను షేర్ చేస్తూ ఈ కామెంట్ చేశారు.
Gujarat Police herding the Maharashtra Shivsena MLAs like sheep at Surat airport! https://t.co/Kts1SbzoJL
— Prashant Bhushan (@pbhushan1) June 22, 2022
మనసు మార్చుకున్న ఎమ్మెల్యేపై దాడి
శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే ఒకరు మనసు మార్చుకుని సూరత్ హోటల్ నుండి బయలుదేరడానికి ప్రయత్నించాడని సీనియర్ జర్నలిస్ట్ స్వాతి చతుర్వేది ట్వీట్ చేశారు. అతడిని దాడి చేయాలని ఇతర ఎమ్మెల్యేలను ఏక్నాథ్ షిండే ఉసిగొల్పారని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన గుజరాత్ పోలీసుల రక్షణలో ఆసుపత్రిలో ఉన్నారని పేర్కొన్నారు.
స్వాతి చతుర్వేది ట్వీట్‌పై ప్రశాంత్ భూషణ్ స్పందిస్తూ.. మహారాష్ట్ర ఎమ్మెల్యేలను సూరత్ హోటల్లో బంధించడం కిడ్నాప్ కంటే తక్కువేమీ కాదని వ్యాఖ్యానించారు. అధికార క్రీడలో ఎమ్మెల్యేలు అమ్ముడుపోడమే కాదు.. అపహరణకూ గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. (క్లిక్: ఏక్నాథ్ షిండే తిరుగుబాటు వెనక బలమైన కారణాలు!)