ఒడిషా సీఎం రాజీనామాకు విపక్షాల పట్టు
భువనేశ్వర్: నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలిన ఘటనపై ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ రాజీనామాకు విపక్షాలు పట్టుపట్టాయి. దీనిపై సోమవారుం ఒడిషా అసెంబ్లీలో తీవ్ర గందరగోళం చెలరేగింది. విపక్షాల ఆందోళనతో స్పీకర్ పలుమార్లు సభను వాయిదా వేశారు. తొలుత సభ ప్రారంభమైన వెంటనే ఈ ఘటనపై సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటన చేస్తుండగా, బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు పెద్దపెట్టున నిరసనకు దిగారు. సీఎం రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు.
నగరంలోని బొమికల్ ప్రాంతంలో ఆదివారం నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలిన ఘటనలో ఒకరు మరణించగా, 11 మంది గాయపడ్డారు. బాధితులకు రూ 5 లక్షలు పరిహారం ప్రకటించినట్టు సీఎం పట్నాయక్ తెలిపారు.ఘటనకు సంబంధించి అయిదుగురిపై కేసు నమోదు చేయగా, సీనియర్ ఇంజనీర్ ఒకరిని అరెస్ట్ చేశారు.