
బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (ఫైల్‌ఫోటో)
రాంచీ : పశుగ్రాస కుంభకోణం కేసుల్లో దోషిగా తేలడంతో జైలు శిక్ష అనుభవించేందుకు బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ గురువారం రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం ఎదుట లొంగిపోయారు. మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు వెంటరాగా లాలూ సీబీఐ న్యాయస్ధానానికి చేరుకున్నారు. రాంచీ హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఆయన ఈ రోజు సీబీఐ న్యాయస్ధానంలో లొంగిపోయారు.
లాలూకు వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం ఆసియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ (ముంబై) వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై కోర్టుకు నివేదిస్తారని లాలూ న్యాయవాది ప్రభాత్ కుమార్ వెల్లడించారు. జార్ఖండ్ హైకోర్టు లాలూను త్వరగా ప్రత్యేక న్యాయస్ధానంలో లొంగిపోవాలని ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. ముంబైలో మూడు వారాల పాటు వైద్య చికిత్సలు పొందిన లాలూ శనివారం అక్కడినుంచి పట్నా చేరుకున్నారు. లాలూ ప్రాధమిక బెయిల్‌ను పొడిగించేందుకు నిరాకరించిన జార్ఖండ్ హైకోర్టు ఆగస్ట్ 30లోగా సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానంలో లొంగిపోవాలని కోరింది.
వైద్యపరమైన కారణాలతో మే 11న లాలూకు ఆరు వారాల ప్రాధమిక బెయిల్‌ను మంజూరు చేసిన హైకోర్టు ఆ తర్వాత పలు సందర్భాల్లో ఆగస్ట్ 27 వరకూ పొడిగించింది. మరోవైపు రాంచీ విమానాశ్రమయంలో పార్టీ అనుచరులతో కలిసి వెలుపలికి వచ్చిన లాలూ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. తన ఆరోగ్యం బాగాలేదని, తానిప్పుడు మాట్లాడేదేమీ లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment