ఆ న్యాయమూర్తులకు పటిష్ఠ భద్రత
న్యూఢిల్లీ: మెమన్ ఉరిశిక్ష తీర్పుపై విచారణకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ హెచ్ ఎల్ దత్తు ఏర్పాటుచేసిన త్రిసభ్య ధర్మాసనం లోని సభ్యులకు కేంద్రం పటిష్ఠ భద్రతను ఏర్పాటచేసింది. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల సీ పంత్, జస్టిస్ అమితవ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం ఉరిశిక్ష విధించాలన్న తీర్పు వెలువరించడంతో మెమన్ ఉరి అమలుకు అడ్డంకులు తొలగిన విషయం తెలిసిందే.
క్షమాభిక్ష పిటిషన్ పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకోవడం సరికాదని, ఒకవేళ తిరస్కరించినా ఆ నిర్ణయం అమలుకు కనీసం 14 రోజులు గడువు కావల్సి ఉంటుందని, తమ విజ్ఞప్తిని పరిశీలించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ ఎల్ దత్తును మెమన్ తరఫు న్యాయవాదులు కోరారు. ఈ వినతిని స్వీకరించిన సీజేఐ రాత్రికి రాత్రే ఇదివరకే ఈ కేసును విచారించిన జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల సీ పంత్, జస్టిస్ అమితవ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం ఏర్పాటుకు అంగీకరించారు. ఇరుపక్షాల వాదనలు విన్నఅనంతరం త్రిసభ్య ధర్మాసనం ప్రాసిక్యూషన్కు అనుకూలంగా తీర్పు వెలువరించింది.