
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్‌లో అంతర్భాగమేనని, దానిపై ఎప్పటిౖకైనా భౌతిక అధికార పరిధి కలిగి ఉండాలని కేంద్రం భావిస్తోందని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ అన్నారు. కశ్మీర్ అంశంపై ప్రజలు ఏమంటారోనని ఎక్కువగా దిగులు చెందాల్సిన అవసరంలేదని ఆయన స్పష్టంచేశారు. కశ్మీర్ అనేది భారత్ అంతర్గత సమస్య అని, త్వరలోనే సద్దుమణుగుతుందని ధీమా వ్యక్తంచేశారు. ఇక భారత్ పొరుగు దేశం నుంచి ప్రత్యేక సవాళ్లను ఎదుర్కొంటోందని, వాటిని సాధారణ స్థితికి తీసుకురావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. సరిహద్దు ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాల్సి ఉందని స్పష్టంచేశారు. భారత్–అమెరికాల మధ్య సంబంధాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని తెలిపారు. వాణిజ్య వ్యవహారాలు సాధారణ స్థితిలో ఉన్నాయన్నారు.
పాత మార్గాల్లోనే మళ్లీ కొత్తగా
శ్రీనగర్: కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి రద్దు అనంతరం పాక్ సైన్యం దొంగచాటు మార్గాల గుండా 60 మంది ఉగ్రవాదులను దేశంలోకి పంపించిందని అధికారులు వెల్లడించారు. ఎత్తైన పర్వత ప్రాంతాలైన ఉత్తర కశ్మీర్‌లోని గురెజ్, మచిల్, గుల్మార్గ్, జమ్మూలోని పూంఛ్, రాజౌరీ సెక్టార్ల గుండానే చొరబాట్లు ఎక్కువగా జరిగినట్లు నిఘా వర్గాల సమాచారాన్ని బట్టి అంచనాకు వచ్చామన్నారు. ఉగ్రవాదులు గతంలో ఈ మార్గాల ద్వారానే దేశంలోకి ప్రవేశించేవారని తెలిపారు. అయితే, చొరబాట్లపై సైన్యం ఎటువంటి ప్రకటనా చేయలేదు. ఈ అనుమానాల నేపథ్యంలోనే భద్రతా బలగాలు తనిఖీలను ముమ్మరం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment