
బీజేపీలో చేరిన షాజియా ఇల్మీ
న్యూఢిల్లీ: ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వైఖరికి నిరసనగా ఆ పార్టీకి రాజీనామా చేసిన ఇల్మీ శుక్రవారం బీజేపీలో చేరారు. జర్నలిస్ట్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన షాజియా ఇల్మీ, తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి కీలకపాత్ర పోషించారు. స్వచ్ఛ్ భారత్ అభియాన్ ప్రచారం కోసం రాష్ట్ర బీజేపీ ప్రకటించిన తొమ్మిది మంది ప్రముఖుల పేర్లలో షాజియా ఇల్మి పేరు కూడా ఉండడం పలువురికి ఆశ్చర్యం కలిగించింది. గురువారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ఈ పేర్లను ప్రకటించారు.
షాజియా ఇల్మీ గత అసెంబ్లీ ఎన్నికలలో ఆర్ కే పురం నుంచి ఆప్ అభ్యర్థిగా పోటీచేసి కేవలం 326 ఓట్ల తేడాతో ఓడిపోయారు. గత లోక్‌సభ ఎన్నికల్లోనూ ఘజియాబాద్ నుంచి మాజీ సైన్యాధ్యక్షుడు జనరల్ వీకే సింగ్‌పై పోటీచేసి ఓడిపోయారు. అప్పటికే ఆమెకు ఆప్తో విభేదాలు మొదలయ్యాయని, అంతేకాకుండా అయిష్టంగానే లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగారని కథనలు వచ్చిన సంగతి తెలిసిందే.