'పాక్తో జాగ్రత్త.. ఫుటేజీ విడుదల చేయొద్దు'
న్యూఢిల్లీ: భారత ఆర్మీ నిర్వహించిన సర్జికల్ దాడుల వీడియో ఫుటేజీలను విడుదల చేయాల్సిన పనిలేదని ఆర్మీ మాజీ సీనియర్ అధికారులు అంటున్నారు. సరైన ఆలోచనలు లేని స్టుపిడ్ ఫెలోసే అలాంటివి చూపించండని అడుగుతుంటారని, వారికోసం చూపించాల్సినవసరం లేదని చెబుతున్నారు. దాడులను నిరూపించుకోవాలని ప్రశ్నించేవారంతా ఒక వెర్రి ఆలోచనలో ఉన్నట్లే తాను భావిస్తామని అన్నారు. ఫుటేజీ విడుదల ద్వారా తమకు ఏమైనా లబ్ధి చేకూరుతుండొచ్చనే ఆలోచనతో పాక్ రెచ్చగొట్టి ఎదురుచూస్తుందని, పాక్ వ్యూహంలో చిక్కుకోవద్దని వారు హెచ్చరిస్తున్నారు.
ఆర్మీ మాజీ చీఫ్ జనరల వీపీ మాలిక్, జనరల్ జేజే సింగ్, జనరల్ శంకర్ రాయ్ చౌదరీ ఫుటేజీల విడుదలపై స్పందించారు. 'ఫుటేజీలను విడుదల చేయాలా వద్దా అనేది కేవలం ఆర్మీనే నిర్ణయించుకోవాలి. అది మాత్రమే ఏ సమయంలో విడుదల చేయాలనే విషయాన్ని నిర్ణయించాలి. ఈ వీడియోను ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయకూడదు. స్టుపిడ్ పీపుల్సే అలా కోరుకుంటారు. ప్రతి భారతీయుడు గర్వించేలాగా భారత సైనికులు మిషన్ పూర్తి చేశారు. ఎవరైతే ఆ దాడి చేసినట్లు నిరూపించుకోవాలని ప్రశ్నిస్తున్నారో వారంతా ఒక చెత్త లోకంలో జీవిస్తున్నవారవుతారు. పాకిస్థాన్ మీడియా అల్లే కథనాలను ఎట్టి పరిస్థితుల్లో మనం నమ్మొద్దు. ఫుటేజీ ద్వారా పాకిస్థాన్ లబ్ధి పొందాలని చూస్తోంది' అంటూ వారు హెచ్చరించారు.