మాజీ సీజేఐ కబీర్ కన్నుమూత
► రాష్ట్రపతి సహా ప్రముఖుల దిగ్భ్రాంతి
► తెలివైన న్యాయమూర్తిని కోల్పోయామన్న బార్‌కౌన్సిల్
కోల్‌కతా: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అల్తమస్ కబీర్ (68) ఆదివారం మధ్యాహ్నం కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈయన కిడ్నీ సంబంధింత వ్యాధితో చాలాకాలంగా బాధపడుతున్నారు. సెప్టెంబర్ 29, 2012 నుంచి జూలై 19, 2013 వరకు ఈయన అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.
ఈయనకు భార్య, కూతురు, ఓ కుమారుడు ఉన్నారు. 1973లో కోల్‌కతాలో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన అల్తమస్ 1990లో కలకత్తా హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005 మార్చి 1న జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2005 సెప్టెంబర్ 9న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు.
న్యాయలోకం దిగ్భ్రాంతి
అల్తమస్ కబీర్ హఠాన్మరణంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న జ్ఞాపకాలను ప్రణబ్ గుర్తుచేసుకున్నారు. ‘అల్తమస్ చాలా తెలివైన న్యాయమూర్తి, రెండు వైపుల వాదనలను చాలా ఓపికగా వినేవారు. అనవసర విషయాలు చర్చకు వచ్చినా ఏమాత్రం సహనం కోల్పోయేవారు కాదు. ఆయన మృతి న్యాయ వ్యవస్థకు తీరనిలోటు’ అని మాజీ అటార్నీ జనరల్ సోలీ సొరాబ్జీ తన సంతాప సందేశంలో తెలిపారు.
‘ఆయన మృతి దురదృష్టకరం, తీవ్రమైన లోటు. కేరీర్ చివర్లో కొన్ని వివాదాలొచ్చినా.. ఆయన గొప్ప ఆలోచనలున్న న్యాయమూర్తి. ఆయనలాంటి మరింతమంది న్యాయమూర్తులు రావాలని కోరుకుంటున్నాం’ అని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ) అధ్యక్షుడు ఏఎస్ సూరి అభిప్రాయపడ్డారు. ఇద్దరు కేరళ జాలరులను ఇటలీ నేవీ అధికారులు కాల్చిచంపిన కేసు సమయంలో ధర్మాసనంలో కబీర్ సభ్యుడిగా ఉన్నారు. పార్టీనుంచి బహిష్కృతుడైన తర్వాత ఓ ఎంపీ పదవిలో కొనసాగొచ్చా అనే అంశంపై కబీర్ కీలక తీర్పునిచ్చారు. పార్టీతో సంబంధం లేకుండా ఎంపీగా ఉండొచ్చని, ఓటింగ్‌లోనూ పాల్గొనవచ్చని స్పష్టం చేశారు.