
అస్సాం మాజీ డీజీపీ బారువా ఆత్మహత్య
శారదా కుంభకోణంలో ఆరోపణలు రావడంతో కలత
గువాహటి: అస్సాం మాజీ డీజీపీ శంకర్ బారువా ఆత్మహత్య చేసుకున్నారు. కోట్లాది రూపాయల ‘శారద’ చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో బారువా పాత్ర కూడా ఉన్నట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో గత నెలలో సీబీఐ ఆయన నివాసంలో సోదాలు జరిపింది. దీనిపై కలత చెందిన ఆయన బుధవారం గువాహటిలోని తన నివాసంలో పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బారువాను ఆసుపత్రికి తరలించగా.. ఆయన చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారని గువాహటి సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్‌ఎస్‌పీ) ఎ.పి.తివారీ తెలిపారు. ‘‘బారువా మరి లేరు. మేం కేసు దర్యాప్తు చేస్తున్నాం. ప్రస్తుతం ఈ విషయంలో ఏమీ చెప్పలేం. దర్యాప్తు తరువాతే వివరాలు తెలపగలం’’ అని ఆయన చెప్పారు.
గతవారం ఛాతీలో నొప్పి రావడంతో బారువా స్థానిక ఆసుపత్రిలో చేరారు. కోలుకున్న ఆయన్ను బుధవారం ఉదయమే డిశ్చార్జి చేశారు. ఆ తరువాత ఇంటికి చేరిన అరగంటలోపుగానే ఆయన మేడపైకి వెళ్లి పిస్టల్‌తో కాల్చుకున్నారని కుటుంబ వర్గాలు తెలిపాయి. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయిందన్నాయి. శారదా కుంభకోణం కేసులో తన పాత్ర ఉన్నట్టు ఆరోపణలు రావడంతో ఆయన కలత చెందారని, దీనిపై టీవీ చానళ్లలో ప్రసారమైన వరుస కథనాలతో ఆయన తీవ్ర వేదనకు గురయ్యారని, ఆత్మహత్యకు ఇదే కారణమని ఆ వర్గాలు తెలిపాయి.