వీకే సారస్వత్‌కు జైలు
డీఎంఆర్‌ఎల్ డెరైక్టర్ జి.మాలకొండయ్యకు కూడా..
ఓ కేసులో ఆదేశాలు అమలు చేయనందుకే: మద్రాస్ హైకోర్టు
చెన్నై: ఓ పక్క శాస్త్రవేత్తలందరూ మంగళయాన్ విజయోత్సాహాల్లో మునిగి తేలుతుంటే.. దేశంలోని ప్రముఖ శాస్త్రవేత్తలిద్దరు మాత్రం కోర్టు ఆదేశాలతో షాక్‌లో మునిగిపోయారు. కోర్టు వారికి మూడు వారాలపాటు జైలు శిక్ష, రూ.2,000 జరిమానా విధించడమే దీనికి కారణం. ఏ తప్పూ లేకుండా ఉద్యోగం నుంచి తొలగించిన ఓ వ్యక్తికి తిరిగి ఉద్యోగమివ్వాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను పదేళ్లుగా పాటించకుండా ధిక్కరించినందుకుగాను న్యాయస్థానం ఈ శిక్ష విధించింది. ఆ ఇద్దరిలో ఒకరు రక్షణ శాఖ శాస్త్రీయ సలహాదారు, డీఆర్‌డీవో పరిశోధన, అభివృద్ధి విభాగం డెరైక్టర్ జనరల్ వి.కె.సారస్వత్‌కాగా మరొకరు హైదరాబాద్‌లోని డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చి లేబొరేటరీ(డీఎంఆర్‌ఎల్) డెరైక్టర్ జి.మాలకొండయ్య. వీరు వెంటనే పోలీసులకు లొంగిపోవాలని మద్రాస్ హైకోర్టు గురువారం ఆదేశించింది.
1985లో జోసెఫ్ రాజ్ అనే వ్యక్తిని ‘యుద్ధ వాహనాల పరిశోధన, అభివృద్ధి సంస్థ’(సీవీఆర్‌డీఈ)లో తాత్కాలిక ప్రాతిపదికన క్లర్కు కమ్ స్టోర్ కీపర్‌గా నియమించారు. ఈ ఉద్యోగం చేస్తూ జోసె ఫ్ అవాదీలోని సీవీఆర్‌డీఈ స్కూలులో గ్రంథాలయాధికారి పోస్టుకు దరఖాస్తు చేసి అర్హత ప్రకారం దక్కించుకున్నారు. కానీ 2001లో ప్రభుత్వం ఆ స్కూల్‌ను మూసేసి సిబ్బందిని తొలగిస్తున్నట్లు నోటీసులిచ్చింది. ఇది అన్యాయమంటూ కోర్టుకెక్కిన జోసెఫ్ పరిపాలనా ట్రైబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టులోనూ గెలిచారు. అయినా ఆయనకు ఏ ప్రభుత్వ సంస్థలోనూ ఉద్యోగం ఇవ్వకపోవడంతో ఆయన కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ వేశారు.