VK Saraswat
-
పెట్రోలియం దిగుమతులకు చెక్!
న్యూఢిల్లీ: భారీ పరిమాణంలో మెథనాల్ ప్లాంట్ల ఏర్పాటుతో శిలాజ ఇంధనాలైన పెట్రోలియం తదితర ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకోవచ్చని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ సూచించారు. థర్మల్ ప్లాంట్లపై ఆధారపడడం భవిష్యత్తులో తగ్గుతుందంటూ.. మెథనాల్ తయారీకి పరిశ్రమ ముందుకు వచ్చేలా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. మెథనాల్‌ను శుద్ధ ఇంధనంగా పేర్కొంటూ, భారీ వాణిజ్య వాహనాల్లోనూ దీన్ని వినియోగించొచ్చన్నారు. మెథనాల్‌తో నడిచే ఓడను నిర్మించాలంటూ ఓ విదేశీ కంపెనీ కోచి్చన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌కు ఆర్డర్ ఇచి్చనట్టు చెప్పారు. ఈ నెల 17, 18 తేదీల్లో ఢిల్లీలోని మనేక్షా కేంద్రంలో రెండు రోజుల పాటు అంతర్జాతీయ మెథనాల్ సెమినార్, ఎక్స్పోను నీతి ఆయోగ్ నిర్వహిస్తున్నట్టు సారస్వత్ ప్రకటించారు. 2016లో అమెరికాకు చెందిన మెథనాల్ ఇనిస్టిట్యూట్‌తో నీతిఆయోగ్ భాగస్వామ్యం కుదుర్చుకోగా.. ఈ ఎనిమిదేళ్లలో ప్రాజెక్టులు, ఉత్పత్తులు, పరిశోధన, అభివృద్ధికి సంబంధించి సాధించిన పురోగతిని సెమినార్లో తెలియజేస్తామని చెప్పారు. ఉత్పత్తులు, టెక్నాలజీలను ఈ ఎక్స్‌పోలో ప్రదర్శిస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మెథనాల్ తయారీ, వినియోగానికి వీలుగా ప్రభుత్వం ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తోందని, ఆ తర్వాత పెద్ద స్థాయి మెథనాల్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలతో సమగ్ర విధానాన్ని ప్రకటిస్తుందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో 0.7 మిలియన్ మెట్రిక్ టన్నుల మెథనాల్ తయారీ సామర్థ్యం ఉండగా.. డిమాండ్ 4 మిలియన్ టన్నులు మేర ఉండడం గమనార్హం. -
మేఘం నుంచి భూమి వరకు..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా మరింత కచ్చితత్వంతో వర్షపాతాన్ని అంచనా వేసేందుకు వీలుగా వర్షపు చినుకు (నీటి బిందువుల)ల పరిణామక్రమంపై పరిశోధనలకు హైదరాబాద్ ఐఐటీ శ్రీకారం చుట్టింది. మేఘం నుంచి భూమికి చేరే వరకు వివిధ ఎత్తుల్లో వర్షపు చినుకు ఆకారం, మారుతున్న తీరునుబట్టి వర్షపాతం అంచనాకు ఐఐటీలోని కెమికల్ ఇంజనీరింగ్ విభాగం రెయిన్‌డ్రాప్ రీసెర్చ్ ఫెసిలిటీ (ఆర్ఆర్ఎఫ్)ని ఏర్పాటు చేసింది. ఇందుకోసం మెషీన్ లెర్నింగ్ ఆధారిత డిజిటల్ ఇన్లైన్ హోలోగ్రఫీ పరిజ్ఞానాన్ని వినియోగించనుంది. ఈ కేంద్రాన్ని నీతి ఆయో సభ్యుడు ప్రొఫెసర్ వీకే సారస్వత్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షపు చినుకులు ఏర్పడటం వెనకున్న ప్రక్రియలను అర్థం చేసుకోవడంతోపాటు పర్యావరణం, వాతావరణ మార్పులపై దాని ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు ఈ కేంద్రం ఎంతగానో దోహదపడుతుందన్నారు. అలాగే వర్షాలు కురవడంలో తేమ, ఉష్ణోగ్రతల పాత్ర, మబ్బుల నిర్మాణం, ఒక ప్రాంతంలో కురవబోయే వర్షం పరిమాణం వంటి అంశాలను తెలుసుకొనేందుకు వీలవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఐటీహెచ్ ఫ్రొఫెసర్ బీఎస్ మూర్తి, ప్రొఫెసర్ కీర్తి సాహు, మెకానికల్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ లక్ష్మణ దొర చంద్రాల, పరిశోధన విభాగం సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘క్రమశిక్షణతోనే మహమ్మారి కట్టడి’
బెంగళూర్ : కరోనా వైరస్ కట్టడికి లాక్డౌన్ అమలవుతున్న క్రమంలో ప్రజలందరూ ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను క్రమశిక్షణతో పాటించాలని నీతిఆయోగ్ సభ్యులు, డీఆర్డీఓ మాజీ చీఫ్ వీకే సారస్వత్ సూచించారు. లాక్డౌన్ ఆంక్షలు తొలగిన తర్వాత కూడా మహమ్మారి తిరిగి ప్రబలకుండా ప్రజలు సామాజిక దూరం పాటించడం, సమూహాలకు దూరంగా ఉండటం వంటి నియమాలను పాటించాలని అన్నారు. లాక్డౌన్ విరమణ అనంతరం సమాజం అత్యంత క్రమశిక్షణతో కట్టుదిట్టంగా వ్యవహరించడం అవసరమని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రస్తుతం మౌలిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడం, రోగులు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందికి అవసరమైన రక్షణ పరికరాలు, మందులను నిరాటంకంగా సరఫరా చేయాల్సిన తక్షణ అవసరం నెలకొందని అన్నారు. ఈ పరికరాల తయారీ, సరఫరా నిరాఘాటంగా సాగాల్సిన అవసరంపై దృష్టిసారించాలని చెప్పుకొచ్చారు. కోవిడ్-19 కేసులు వేగంగా పెరుగుతున్న క్రమంలో ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రులన్నీ మహమ్మారిపై పోరాడేందుకు యుద్ధప్రాతిపదికన సన్నద్ధం కావాలని సూచించారు. చదవండి : కీలకమైన డేటా దేశం దాటిపోకూడదు -
నూతన ఆవిష్కరణలతోనే దేశ పురోగతి
నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే సారస్వత్ హైదరాబాద్: ఉత్పత్తి, నూతన ఆవిష్కరణలతోనే దేశం పురోగతి సాధిస్తుందని నీతి ఆయోగ్ సభ్యులు, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ వీకే సారస్వత్ పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలపై విద్యార్థి, యువత మరింతగా దృష్టి సారించాల్సిన అవసరాన్ని గుర్తించాలని సూచించారు. 19వ ఫౌండేషన్ డే సందర్భాన్ని పురస్కరించుకొని సోమవారం గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ) డీడీఈ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సారస్వత్ మాట్లాడుతూ మనవారికి విదేశీ ఉత్పత్తులంటే ఇష్టమని, అది దేశానికి కష్టమని అన్నారు. ఎగుమతులు పెంచి దిగుమతులు తగ్గించాలంటే ఉత్పత్తి రంగం పురోగతి సాధించాల్సిందేనన్నారు. పర్యాటక, సేవల రంగాల్లో ప్రపంచస్థాయిలో ఎంతో పురోగతి సాధించినప్పటికీ అది సరిపోదని, ఉత్పత్తి ఆధారిత నూతన ఆవిష్కరణలు అవసరమన్నారు. ఆ దిశగా దేశాన్ని పయనించేలా చేయాల్సిన బాధ్యత విద్యార్థి, యువత, మేధావి వర్గాలపై ఉందన్నారు. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో అభివృద్ధి సాధిస్తేనే దేశం పురోగతి సాధిస్తుందని 65 ఏళ్ల క్రితమే అప్పటి ప్రధాని నెహ్రూ, మొదటి విద్యామంత్రి మౌలానా ఆజాద్ గుర్తించారని ఆయన గుర్తు చేశారు. విద్యారంగంలో కలామ్ అప్పట్లో కృషి చేస్తే, ఆ తర్వాత కాలంలో అబ్దుల్ కలామ్ మిసైల్ రంగంలో ఎంతో పురోగతి సాధించేందుకు ఆద్యుడుగా మారారన్నారు. ఆయన సాన్నిహిత్యంతో తాను ఎంతో నేర్చుకున్నానన్నారు. 2032 నాటికి 6,000 మెగావాట్ల అణువిద్యుత్ ఉత్పత్తే లక్ష్యం.. అణువిద్యుత్ రంగంలో దేశం ఎంతో పురోగతి సాధిస్తోందని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే సారస్వత్ తెలిపారు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్లను ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అత్యధికంగా దేశంలోనే ఏర్పాటు చేసుకోగలుగుతున్నామని అన్నారు. 2032 నాటికి దేశంలో 6,000 మెగావాట్ల న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యం పెరిగేలా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఆకట్టుకున్న క్షిపణి చిత్ర ప్రదర్శన భారతదేశంలో క్షిపణి ప్రయోగ రంగంలో సాధించిన పురోగతిని వీడియో చిత్ర ప్రదర్శన ద్వారా డాక్టర్ సారస్వత్ వివ రించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ మహ్మద్ అస్లామ్ పర్వేజ్, ప్రో వైస్ చాన్స్‌లర్ డాక్టర్ షకీల్ అహ్మద్, సీడబ్ల్యూఎస్ ఇన్చార్జి డైరెక్టర్ డాక్టర్ అమీనా తహసీన్ మాట్లాడారు. 2050 నాటికి దేశ జనాభాలో సగం మంది పట్టణాల్లోనే.. భారతదేశంలో జనాభా పట్టణీకరణ వైపు సాగుతోందని, 2050 నాటికి దేశ జనాభాలో సగం మంది పట్టణ ప్రాంతాల్లోనే నివాసముండటం ఖాయంగా కనిపిస్తోందని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ సారస్వత్ పేర్కొన్నారు. దేశం ఇంత అభివృద్ధి సాధిస్తున్నా ఇప్పటికీ 300 మిలియన్ ప్రజలు దారిద్రరేఖకు దిగువనే ఉన్నారన్నారు. వైద్య రంగంలో ఎంతో పురోగతి సాధిస్తున్నా ఇప్పటికీ ఎక్స్‌రే, ఎంఆర్ఐ, సీటీస్కాన్ యంత్రాలన్నీ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, ఈ పరిస్థితులు మారాలన్నారు. సెక్యూరిటీ ఇన్నోవేషన్ రంగంలో చాలా పురోగతి సాధించాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు. -
యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్య శిక్షణ
వినూత్న పద్ధతిలో కార్యక్రమాలు చేపట్టాలి: వీకే సారస్వత్ రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశం సాక్షి, హైదరాబాద్: భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా దేశవ్యాప్తంగా యువతకు వినూత్న పద్ధతిలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, ప్రపంచవ్యాప్తంగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ పేర్కొన్నారు. దేశ జనాభాలో పనిచేసే వయసున్న వారి నుంచి ప్రయోజనాలు గత 30 ఏళ్ల నుంచి పొందలేదని... వచ్చే 3 దశాబ్దాల వరకే నైపుణ్యం, పనిచేసే వయసుగల వారి ద్వారా ప్రయోజనం పొందగలమని చెప్పారు. ఈ దిశగా నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని అధికారులకు సూచించారు. నైపుణ్యాభివృద్ధి అంశంపై ముఖ్యమంత్రుల ఉప సంఘం ఇప్పటికే నివేదిక సమర్పించిందని తెలిపారు. బుధవారం సచివాలయంలో వివిధ శాఖల ద్వారా చేపడుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో వీకే సారస్వత్‌తోపాటు ప్రభుత్వ సలహాదారులు పాపారావు, డాక్టర్ జీఆర్ రెడ్డి, ఏకే గోయల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, నీతి ఆయోగ్ సలహాదారులు సునీత సంఘీ, ఏకే జైన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పంచాయతీరాజ్, విద్య, కార్మిక, మున్సిపల్, సంక్షేమ శాఖలు, న్యాక్, టాస్క్ ద్వారా యువతలో నైపుణ్య అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను నీతి ఆయోగ్ సభ్యులకు రాష్ట్ర అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం సారస్వత్ మాట్లాడారు. తెలంగాణలో ఉన్న ఐటీఐలను పునర్వ్యవస్థీకరించాలని, నైపుణ్యం గల సిబ్బందిని నియమించాలని, మంచి సౌకర్యాలను ఏర్పరచాలని చెప్పారు. శిక్షణ పొందే ప్రతి ఒక్కరికి సాఫ్ట్ స్కిల్స్‌లోనూ నైపుణ్యం ఉండాలన్నారు. వృత్తిపర గౌరవం పొందాలి.. వ్యవసాయ రంగం, నిర్మాణ రంగం తదితర రంగాల్లో శిక్షణ పొంది పనిచేసే వారు వృత్తిపర గౌరవం పొందేలా ప్రభుత్వం చూడాలని సారస్వత్ పేర్కొన్నారు. శిక్షణకు ప్రస్తుత సాంకేతికత కూడా తోడవ్వాలని సూచించారు. వివిధ శాఖల ద్వారా యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడతున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ చెప్పారు. ఈ సమావేశంలో వచ్చిన సూచనల మేరకు మరింత సమర్థవంతంగా కార్యక్రమాలు చేపడతామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన స్థాయిలో నిధులు కేటాయించాలని కోరారు. -
ప్రత్యేక హోదా ముఖ్యం కాదు
♦ నీతి ఆయోగ్ సభ్యుడు సారస్వత్ వెల్లడి ♦ తెలంగాణ, ఏపీలను కేంద్రం ఆదుకుంటోంది ♦ హైదరాబాద్‌లో నీటి సమస్య ఎక్కువైంది సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాలకు సహాయం చేసేందుకు ప్రత్యేక హోదాను ఇవ్వడం ముఖ్యం కాదని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ స్పష్టంచేశారు. వనరులు, నిధులు, ప్రయోజనాల రూపంలో ఏపీ, తెలంగాణలకు కేంద్రం సహాయాన్ని అందిస్తోందన్నారు. ఏపీకి కేంద్రం సహాయాన్ని అందించడంలో ముందుం దని, నీతి ఆయోగ్ ద్వారా మరింత సహాయం చేస్తోందన్నారు. ప్రత్యేకహోదాకు సంబంధించి నీతి ఆయోగ్ ఎలాంటి నివేదిక సమర్పించడం లేదని స్పష్టంచేశారు. ఆయన మంగళవారం ‘సృజనాత్మకత, సుస్థిర అభివృద్ధి’ అంశంపై అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కి)లో మాట్లాడారు. తెలంగాణకు హైదరాబాద్ వంటి రాజధాని ఉంది ఏపీకి అదికూడా లేదన్న ఒక విలేకరి ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, దానిని ఆ కోణంలో చూడకూడదని, రెండు రాష్ట్రాలకు సంబంధించి విభజన కారణంగా తలెత్తిన సమస్యలు, అంశాలను పరిష్కరించుకోవాల్సి ఉంద న్నారు. తెలంగాణకు నీటి సమస్య ఉందని, అందువల్ల మిషన్ కాకతీయకు కేంద్రం నిధులిస్తున్నదన్నారు. ఏపీ రాజధాని ఏర్పాటు, కొత్త పరిశ్రమల ఏర్పాటు, హౌజింగ్, ఇతర అంశాలను గురించి చూడాలన్నారు. స్మార్ట్ విలేజీలు కావాలి హైదరాబాద్‌లో డిసెంబర్లోనే నీటి ట్యాంకర్లు తిరుగుతున్నాయంటే ఇప్పుడే నీటి సమస్య ఏ మేరకుందో స్పష్టమవుతోందని సారస్వత్ అన్నారు. దేశంలో నీటి సమస్యను అధిగమిం చేందుకు వాననీటి పరిరక్షణ, నీటిని మళ్లీ ఉపయోగించేలా చేయడం లాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో స్మార్ట్‌సిటీల కంటే కూడా స్మార్ట్ విలేజీలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆస్కి కోర్ట్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ కె. పద్మనాభయ్య, ఆస్కి డెరైక్టర్ జనరల్ రవికాంత్ పాల్గొన్నారు. -
వీకే సారస్వత్‌కు జైలు
డీఎంఆర్ఎల్ డెరైక్టర్ జి.మాలకొండయ్యకు కూడా.. ఓ కేసులో ఆదేశాలు అమలు చేయనందుకే: మద్రాస్ హైకోర్టు చెన్నై: ఓ పక్క శాస్త్రవేత్తలందరూ మంగళయాన్ విజయోత్సాహాల్లో మునిగి తేలుతుంటే.. దేశంలోని ప్రముఖ శాస్త్రవేత్తలిద్దరు మాత్రం కోర్టు ఆదేశాలతో షాక్‌లో మునిగిపోయారు. కోర్టు వారికి మూడు వారాలపాటు జైలు శిక్ష, రూ.2,000 జరిమానా విధించడమే దీనికి కారణం. ఏ తప్పూ లేకుండా ఉద్యోగం నుంచి తొలగించిన ఓ వ్యక్తికి తిరిగి ఉద్యోగమివ్వాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను పదేళ్లుగా పాటించకుండా ధిక్కరించినందుకుగాను న్యాయస్థానం ఈ శిక్ష విధించింది. ఆ ఇద్దరిలో ఒకరు రక్షణ శాఖ శాస్త్రీయ సలహాదారు, డీఆర్డీవో పరిశోధన, అభివృద్ధి విభాగం డెరైక్టర్ జనరల్ వి.కె.సారస్వత్కాగా మరొకరు హైదరాబాద్‌లోని డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చి లేబొరేటరీ(డీఎంఆర్ఎల్) డెరైక్టర్ జి.మాలకొండయ్య. వీరు వెంటనే పోలీసులకు లొంగిపోవాలని మద్రాస్ హైకోర్టు గురువారం ఆదేశించింది. 1985లో జోసెఫ్ రాజ్ అనే వ్యక్తిని ‘యుద్ధ వాహనాల పరిశోధన, అభివృద్ధి సంస్థ’(సీవీఆర్డీఈ)లో తాత్కాలిక ప్రాతిపదికన క్లర్కు కమ్ స్టోర్ కీపర్‌గా నియమించారు. ఈ ఉద్యోగం చేస్తూ జోసె ఫ్ అవాదీలోని సీవీఆర్డీఈ స్కూలులో గ్రంథాలయాధికారి పోస్టుకు దరఖాస్తు చేసి అర్హత ప్రకారం దక్కించుకున్నారు. కానీ 2001లో ప్రభుత్వం ఆ స్కూల్‌ను మూసేసి సిబ్బందిని తొలగిస్తున్నట్లు నోటీసులిచ్చింది. ఇది అన్యాయమంటూ కోర్టుకెక్కిన జోసెఫ్ పరిపాలనా ట్రైబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టులోనూ గెలిచారు. అయినా ఆయనకు ఏ ప్రభుత్వ సంస్థలోనూ ఉద్యోగం ఇవ్వకపోవడంతో ఆయన కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ వేశారు. -
డీఆర్డీవో.. ఏర్పాటయ్యేనా?
హిందూపురంలో ఏర్పాటుకు 2008లో కుదిరిన ఎంవోయూ కిరణ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక ఆ సంస్థ కలికిరికి మార్పు కలికిరిలో రైతుల నుంచి వెయ్యి ఎకరాల భూమి సేకరణ తాజాగా ఆ సంస్థ ఎస్ఆర్ పురానికి మార్పు 1102.30 ఎకరాల భూమిని కేటాయించిన మంత్రివర్గం అనంతపురం జిల్లా హిందూపురం నుంచి కలికిరి మీదుగా ఎస్ఆర్పురం మండలానికి చేరుకున్న డీఆర్డీవో(డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్- రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ).. కనీసం అక్కడైనా ఏర్పాటుచేస్తారా.. మరో ప్రాంతానికి తరలిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. దేశ రక్షణలో కీలక భూమిక పోషించే డీఆర్డీవో సంస్థ బ్రహ్మాస్ వంటి ఖండాంతర క్షిపణిని రూపొందించింది. ఆ సంస్థ ఏర్పాటైతే జిల్లా ప్రగతికి ఊతమిచ్చినట్లు అవుతుందనే అభిప్రాయం నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సాక్షి ప్రతినిధి, తిరుపతి: రక్షణశాఖ అమ్ముల పొదిలో లక్ష్య, త్రిశూల్, అగ్ని వంటి అస్త్రాలను ఇప్పటికే చేర్చిన డీఆర్డీవో ఇటీవలే రష్యా సహకారంతో బ్రహ్మాస్ వంటి ఖండాంతర క్షిపణిని కూడా విజయవంతంగా ప్రయోగించింది. దేశ రక్షణ వ్యవస్థను శత్రుదుర్భేద్యంగా తీర్చిదిద్దడానికి డీఆర్డీవో పరిశోధనలు చేస్తోంది. డీఆర్డీవోను విస్తరించే క్రమం లో ఆ సంస్థ డెరైక్టర్ వీకే సారస్వత్ రాష్ట్రంలో ఆ సంస్థ కేంద్రాన్ని ఏర్పాటుచేయడానికి 2008లో ప్రభుత్వంతో కనీస అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకున్నారు. అప్పటి సీఎం దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి ఆ సంస్థను అనంతపురం జిల్లా హిందూపురంలో ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. రక్షణశాఖ ప్రతిపాదన మేరకు డీఆర్డీవో రూపొందించిన క్షిపణులను ప్రయోగించేందుకు అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం-కనగానిపల్లె మండలాల్లో ఫైరింగ్ రేంజ్ ఏర్పాటుకు 17,285 ఎకరాల భూమిని కూడా కేటాయించా రు. హిందూపురంలో భూమిని అప్పగించడంలో అక్కడి అధికారులు జాప్యం చేయడంతో 2011 వరకూ డీఆర్డీవో కేంద్రాన్ని అక్కడ ఏర్పాటు చేయలేదు. ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక డీఆర్డీవో కేంద్రాన్ని తన నియోజకవర్గంలో ఏర్పా టు చేసేలా అప్పటి రక్షణశాఖ సహాయమంత్రి ఎం.పల్లంరాజు పై ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన కేంద్రం పీలేరు నియోజకవర్గం కలికిరిలో ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. కిరణ్‌కుమార్‌రెడ్డి తన సొంత మండలమైన కలికిరికి సమీపంలో టేకలకోన వద్ద డీఆర్డీవో కేంద్రం ఏర్పాటుకు 2600 ఎకరాల భూమిని కేటాయించారు. ఇందులో అప్పటి కలెక్టర్ సాలమన్ ఆరోగ్యరాజ్ వెయ్యి ఎకరాల భూమిని సేకరించారు. ఆ భూమిని డీఆర్డీవో ప్రతినిధి బృందం పరిశీలించింది. కానీ.. ఈలోగా విభజనోద్యమం చెలరేగడంతో డీఆర్డీవో సంస్థ ఏర్పాటులో జాప్యం చోటుచేసుకుంది. ఆలోగా ఎన్నికలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో కూడా రాష్ట్రంలో డీఆర్డీవోను ఏర్పాటుచేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. కేంద్రం హామీ మేరకు డీఆర్డీవో ఏర్పాటుకు ఎస్ఆర్పురం మండలం చిన్నతయారులో 600 ఎకరాలు.. కొక్కిరాలగడ్డలో 502.30 ఎకరాలు మొత్తం 1,102.30 ఎకరాల భూమిని కేటాయిస్తూ మంత్రివర్గం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఇందుకు డీఆర్డీవో ఎకరానికి రూ.1.25 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని కోరింది. ఆరేళ్ల నుంచి డీఆర్డీవో ఏర్పాటు కేవలం ప్రతిపాదనకే పరిమితమైన నేపథ్యంలో.. కనీసం ఇప్పుడైనా ఎస్ఆర్పురం వద్ద ఏర్పాటుచేస్తారా అన్నది హాట్ టాపిక్‌గా మారింది. డీఆర్డీవో ఏర్పాటైతే ఎస్ఆర్పురం దేశ చిత్రపటంలో సమున్నత స్థానాన్ని పొందుతుంది. ప్రయోగశాలలతోపాటు క్షిపణులను తయారుచేసే పరిశ్రమను కూడా ఎస్ఆర్పురంలో డీఆర్డీవో ఏర్పాటు చేయనుంది.