బెంగళూర్ : కరోనా వైరస్ కట్టడికి లాక్‌డౌన్ అమలవుతున్న క్రమంలో ప్రజలందరూ ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను క్రమశిక్షణతో పాటించాలని నీతిఆయోగ్ సభ్యులు, డీఆర్‌డీఓ మాజీ చీఫ్ వీకే సారస్వత్ సూచించారు. లాక్‌డౌన్ ఆంక్షలు తొలగిన తర్వాత కూడా మహమ్మారి తిరిగి ప్రబలకుండా ప్రజలు సామాజిక దూరం పాటించడం, సమూహాలకు దూరంగా ఉండటం వంటి నియమాలను పాటించాలని అన్నారు. లాక్‌డౌన్ విరమణ అనంతరం సమాజం అత్యంత క్రమశిక్షణతో కట్టుదిట్టంగా వ్యవహరించడం అవసరమని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రస్తుతం మౌలిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడం, రోగులు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందికి అవసరమైన రక్షణ పరికరాలు, మందులను నిరాటంకంగా సరఫరా చేయాల్సిన తక్షణ అవసరం నెలకొందని అన్నారు. ఈ పరికరాల తయారీ, సరఫరా నిరాఘాటంగా సాగాల్సిన అవసరంపై దృష్టిసారించాలని చెప్పుకొచ్చారు. కోవిడ్-19 కేసులు వేగంగా పెరుగుతున్న క్రమంలో ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రులన్నీ మహమ్మారిపై పోరాడేందుకు యుద్ధప్రాతిపదికన సన్నద్ధం కావాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment