సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ అడ్డూఅదుపూలేకుండా వ్యాప్తి చెందుతున్న వేళ.. ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్న సమయంలో... వైద్యులు, సిబ్బంది పనిభారంతో సతమతమవుతున్న సందర్భంలో.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలను నీతి ఆయోగ్ ప్రశంసించింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన వ్యూహాత్మక ప్రణాళికను నీతి ఆయోగ్ అభినందించింది.
పరీక్షల నిర్వహణ, వైరస్ నిర్ధారణలతో సంబంధం లేకుండా ముందుజాగ్రత్తలు, నిరంతర పర్యవేక్షణతో వైరస్‌ను నిరోధించినట్టు వెల్లడించింది. రాష్ట్రాలవారీగా కోవిడ్–19 వ్యాప్తిని ఎదుర్కొన్న తీరుపై ఒక డాక్యుమెంట్‌ను తాజాగా నీతిఆయోగ్ విడుదల చేసింది. ఇందులో తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన విధానాలను ప్రస్తావిస్తూ ప్రశంసించింది. ఈ ప్రశంసను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ట్విట్టర్‌లోనూ పోస్టుచేశారు.
కోవిడ్–19 వ్యాప్తి మొదటి, రెండో దశల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ‘హితం(హోం ఐసోలేషన్ ట్రీట్‌మెంట్ అండ్ మానిటరింగ్)’ను వ్యూహాత్మకంగా అమలు చేయడంతో వైరస్ వ్యాప్తిని వేగంగా నిరోధించడంతోపాటు మరణాలను తగ్గించి ఆస్పత్రులపై భారం పడకుండా జాగ్రత్తలు పాటించి విజయం సాధించింది. నివేదికలో పేర్కొన్న అంశాలు ఈవిధంగా ఉన్నాయి.
అనుమానితులకు హెల్త్‌కిట్లు
కోవిడ్–19 బాధితుల గుర్తింపు, వైరస్ వ్యాప్తిపై అన్ని రాష్ట్రాలు వేగంగా స్పందించినప్పటికీ తెలంగాణలో మాత్రం వ్యాప్తి మూలాలను పసిగట్టే క్రమంలో పలు రకాల సర్వేలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. మరోవైపు బాధితుల సంఖ్య పెరుగుతున్న సమయంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రా లు వ్యాధి నిర్ధారణ పరీక్షలను పెద్దసంఖ్యలో చేపట్టాయి. తెలంగాణలో నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూనే అనుమానితులకు ప్రత్యేకంగా హెల్త్‌కిట్లను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసింది.
పారాసిటమాల్, సిట్రిజన్, డాక్సీసైక్లిన్, విటమిన్ బి–కాంప్లెక్స్, విటమిన్ సి మాత్రలతోపాటు రాన్టిడిన్ మందులు ఈ కిట్‌లో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రెండుకోట్ల కిట్లు పంపిణీ చేసినట్లు వైద్య, ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. నిర్ధారణ పరీక్షలు, ఫలితాలు వచ్చేవరకు వేచి చూడకుండా వేగంగా స్పందించి అనుమానితులందరినీ హోం ఐసోలేషన్‌కు తరలించి వ్యాప్తిని అడ్డుకోవడంలో సఫలమైనట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది.
టెలీ మెడిసిన్‌తో వైద్యులపై ఒత్తిడి తగ్గించి..
కోవిడ్–19 మొదటి, రెండో దశల్లో వైరస్ వ్యాప్తి వేగంగా ఉండటంతో ఆస్పత్రుల్లో సాధారణ సేవలకూ తీవ్ర ఇబ్బందులు ఎదరుయ్యాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు హోం ఐసోలేషన్ విధానాన్ని దేశవ్యాప్తంగా అన్నిరాష్ట్రాలు అనుసరించాయి. రాష్ట్ర ప్రభుత్వం హోం ఐసోలేషన్‌తోపాటు టెలీ మెడిసిన్ విధానాన్ని అనుసరించింది. హోం ఐసోలేషన్ ప్రక్రియ అమలు బాధ్యతలను స్థానిక ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు, ఆశ కార్యకర్తలకు అప్పగించింది.
హోం ఐసోలేషన్‌లో ఉన్న బాధితులను అనునిత్యం పర్యవేక్షించడం, కేసు తీవ్రతను బట్టి ఆస్పత్రులకు రిఫర్ చేయడంలో ఈ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో అస్పత్రులపై భారం, వైద్యులపై ఒత్తిడి తగ్గింది. వైద్యసిబ్బంది సేవలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడంతో వైరస్ వ్యాప్తిని వేగంగా నిరోధించడంలో రాష్ట్ర ప్రభుత్వం సఫలీకృతమైనట్లు నీతి ఆయోగ్ కితాబిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment