సాక్షి, హైదరాబాద్: విస్తృత రోగ నిర్ధారణ పరీక్షలతోనే కరోనా కట్టడి సాధ్యమని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. కరోనాపై పోరులో గెలిచిన దేశాలు, రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యయ నం చేసింది. ‘కరోనా వైరస్ మేనేజింగ్: గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్’పేరుతో పది ఉత్తమ పద్ధతులపై సమగ్ర నివేదిక విడుదల చేసింది. కేరళ, కర్ణాటక రాష్ట్రాలు సహా దక్షిణ కొరియా, న్యూజి లాండ్, తైవాన్, వియత్నాం దేశాలు అనుసరించిన వ్యూహాలను ప్రస్తావించింది. పరీక్షలు (టెస్టింగ్), గుర్తింపు (ట్రేసింగ్), చికిత్సలు (ట్రీట్‌మెంట్) వంటి వ్యూహాలను (3–టీ) ఆయా దేశాలు ఎలా అమలు చేశాయో వివరించింది. కరోనా కట్టడికి బలమైన, నిరంతర, వ్యూహాత్మక ప్రయత్నాలు అవసరమని తేల్చిచెప్పింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోందని, ప్రస్తుతం ప్రతి 10 లక్షల జనాభాకు 57 మంది వైరస్ బారిన పడుతున్నారని నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది.
నివేదికలోని అంశాలు ఇవీ...
- కరోనాను కట్టడి చేసేందుకు విస్తృతంగా రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలి. అయితే భారత్ జనాభా ఎక్కువ కాబట్టి ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేయడం సాధ్యం కాకపోయినా ప్రధాన నగరాల్లో అయినా పరీక్షలు చేయాల్సిన అవసరముంది.
- కాంటాక్ట్ ట్రేసింగ్‌ను పక్కగా చేపట్టాలి. బెంగళూరులో ప్రతి పాజిటివ్ కేసుకు సం బంధించి 47 కాంటాక్ట్‌లను గుర్తించారు. కేరళలో జీఐఎస్ మ్యాపింగ్, మొబైల్ ట్రేసింగ్, స్వచ్ఛంద సమాచార వెల్లడి ద్వారా నూరు శాతం కరోనా కాంటాక్ట్‌లను గుర్తించగలిగారు. అన్ని రాష్ట్రాలూ ఈ విధానాన్ని అనుసరించాలి.
- అధిక రికవరీ రేటును పెంచడానికి చికిత్స సమర్థంగా, సమయానుకూలంగా ఉండాలి. లక్షణాలను సకాలంలో కనుక్కోవడం, అధిక ప్రమాదమున్న వ్యక్తుల గుర్తింపు, వారిని ఆసుపత్రికి తరలించడం, వెంటిలేటర్లు తగినంత అందుబాటులో ఉంచడం, తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేయడం కీలకమైన అంశాలు.
- కరోనా లక్షణాలున్న వారిని క్వారంటైన్ చేయడంతోపాటు వైరస్‌ను మూలం వద్ద ఎదుర్కోవాలి. విమానాశ్రయాల్లో ప్రయాణికులను క్వారంటైన్ చేయడం, విమానాలను ముందుగానే నిలిపివేసిన దేశాలు ఈ రోజు వైరస్‌ను కట్టడి చేయగలిగాయి. చైనాతో 1,450 కి.మీ. సరిహద్దు ఉన్న వియత్నాం కరోనాను కట్టడి చేయడంలో విజయం సాధించింది. దేశంలో 2.5 కి.మీ. విస్తీర్ణంలో 10 లక్షల మంది నివసిస్తున్న ముంబైలోని ధారావి కూడా ఒక అద్భుతమైన ఉదాహరణ.
- లాక్‌డౌన్లు శాశ్వత పరిష్కారం కావు. కాబట్టి హాట్‌స్పాట్‌లను గుర్తించడం ద్వారా, వైరస్ వ్యాపించకుండా దూకుడుగా వ్యవహరించాలి. ప్రభావిత ప్రాంతాలను కట్టడి చేయడం ద్వారా మిగిలిన ప్రాంతాల్లో ప్రజల ప్రాణాలు, జీవనోపాధిని కాపాడవచ్చు.
- డేటా అనలిటిక్స్ వాడకాన్ని పెంచాలి. డేటాను పారదర్శకంగా తెలియజేయాలి. దీనివల్ల అనుకున్న వ్యూహాలను అమలు చేయడానికి అవకాశం కలుగుతుంది. సమర్థ డేటా విశ్లేషణల వల్ల వైరస్ వ్యాప్తిని వేగంగా కట్టడి చేయగలం. ప్రజలను, ప్రజా సంఘాలను సమీకరించటానికి వీలుగా వెబ్‌సైట్లలో వాస్తవ డేటాను నిరంతరం అందుబాటులో ఉంచడం అవసరం.
- కరోనా కట్టడిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి. దీనికి అద్భుతమైన ఉదాహరణ ఆరోగ్య సేతు యాప్. ఇది దేశవ్యాప్తంగా కనీసం 3,500 హాట్‌స్పాట్‌లను గుర్తించింది. ఏప్రిల్ 13 నాటికి 140 జిల్లాలను ఈ యాప్ ద్వారా హాట్‌స్పాట్‌లుగా గుర్తించారు. తరువాత వాటిని ఆరోగ్య మంత్రిత్వ శాఖ హాట్‌స్పాట్‌లుగా ప్రకటించింది. 13 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లను ఈ యాప్ కలిగి ఉంది. కేరళలో అంబులెన్సులు, పోలీసు వాహనాలు, ట్రక్కులు వంటి వాటిని ప్రత్యేక యాప్ ట్రాక్ చేస్తుంది.
- వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అనుసరించాల్సిన నియమాలను ప్రజలు కచ్చితంగా పాటించేలా చూడాలి. రాజస్తాన్‌లోని భిల్వారాలో జిల్లా యంత్రాంగం కఠిన నియంత్రణ, కర్ఫ్యూ అమలుతో సత్ఫలితాలు సాధించింది. వైరస్ వ్యాప్తి మొదటి దశలో ఎక్కువగా కేసులు బయటపడ్డ ఈ జిల్లాలో ఈ విధానం బాగా పనిచేసింది.
- వైద్య సిబ్బంది సహా ఇతరత్రా ఉద్యోగులకు నమూనాల సేకరణ, క్లినికల్ మేనేజ్‌మెంట్, క్వారంటైన్ సౌకర్యాల నిర్వహణపై ఆన్‌లైన్ శిక్షణ ఇవ్వడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు.
- కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల భాగస్వామ్యం లేనిదే ఆ ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. అందువల్ల ప్రజలంతా మాస్కులు ధరించేలా, భౌతికదూరం పాటించేలా ప్రభుత్వాలు ప్రోత్సహించాలి.
Comments
Please login to add a commentAdd a comment