కేంద్రాన్ని ప్రారంభిస్తున్న నీతి ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ వీకే సారస్వత్, చిత్రంలో ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్.మూర్తి.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా మరింత కచ్చితత్వంతో వర్షపాతాన్ని అంచనా వేసేందుకు వీలుగా వర్షపు చినుకు (నీటి బిందువుల)ల పరిణామక్రమంపై పరిశోధనలకు హైదరాబాద్ ఐఐటీ శ్రీకారం చుట్టింది. మేఘం నుంచి భూమికి చేరే వరకు వివిధ ఎత్తుల్లో వర్షపు చినుకు ఆకారం, మారుతున్న తీరునుబట్టి వర్షపాతం అంచనాకు ఐఐటీలోని కెమికల్ ఇంజనీరింగ్ విభాగం రెయిన్‌డ్రాప్ రీసెర్చ్ ఫెసిలిటీ (ఆర్‌ఆర్‌ఎఫ్)ని ఏర్పాటు చేసింది.
ఇందుకోసం మెషీన్ లెర్నింగ్ ఆధారిత డిజిటల్ ఇన్‌లైన్ హోలోగ్రఫీ పరిజ్ఞానాన్ని వినియోగించనుంది. ఈ కేంద్రాన్ని నీతి ఆయో సభ్యుడు ప్రొఫెసర్ వీకే సారస్వత్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షపు చినుకులు ఏర్పడటం వెనకున్న ప్రక్రియలను అర్థం చేసుకోవడంతోపాటు పర్యావరణం, వాతావరణ మార్పులపై దాని ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు ఈ కేంద్రం ఎంతగానో దోహదపడుతుందన్నారు.
అలాగే వర్షాలు కురవడంలో తేమ, ఉష్ణోగ్రతల పాత్ర, మబ్బుల నిర్మాణం, ఒక ప్రాంతంలో కురవబోయే వర్షం పరిమాణం వంటి అంశాలను తెలుసుకొనేందుకు వీలవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఐటీహెచ్ ఫ్రొఫెసర్ బీఎస్ మూర్తి, ప్రొఫెసర్ కీర్తి సాహు, మెకానికల్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ లక్ష్మణ దొర చంద్రాల, పరిశోధన విభాగం సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment